తలుపులు వేసి ఉన్నాయి. ఆ మూసినా తలుపులవైపు చూస్తూ అలా నిలబడి పోయింది నీరజ
తప్పదు....కదలాలి! ఆ తలుపులు తట్టాలి!
శక్తినంతా కూడదీసుకుని నడిచింది -తలుపు తట్టింది.
"ఎవరు?" అని విసుగ్గా
వినిపించింది. వర్దనిస్వరం-ఒక్కనిముషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి.
నీరజనుచూసి నిర్ఘాంతపోయింది వర్ధని.
"నువ్వు....నువ్వు..." అంది.
"వచ్చేసాను పిన్నీ! బయటపడి వచ్చేసాను!"
పొంగివస్తోంది ఏడుపు నీరజకి -కానీ మరొకరిముందు ఏడవటం నీరజకు అలవాటులేదు. వర్ధనిముందు అసలు ఏడవదు.
వర్ధని ఏంమాట్లాడలేదు. దెయ్యాన్ని చూస్తున్నట్లు నీరజను చూస్తూ
నిలుచుంది-లోపలకు రమ్మనికూడా అనలేదు -నీరజ తనే లోపలకు నడిచింది.
సందడికి పడుకున్నవాడు లేచివచ్చాడు కామయ్య. నీరజనుచూసి సంభ్రమంగా "వచ్చావా? ఎలా వచ్చావ్? ఎక్కడ చిక్కుపడ్డావ్? పోలీసులు విడిపించారా?" అన్నాడు. "పోలీసులుకాదు -నేనే తప్పించుకోగలిగాను..."
"ఎలా?"
వర్ధని కోరచూపులతో కామయ్యమాటలు ఆగిపోయాయి.
"అవును! నువ్వు తప్పించుకోగలిగావు
-
వాళ్ళ పనితీరాక
అవతలపారేస్తే తప్పించుకుని వచ్చావు - ఇంక మా తిప్పలు మొదలు! నాకు పెళ్ళికావలసిన ఇద్దరు పిల్లలున్నారు!"
వర్ధని ఒక్కొక్కమాట ఒక్కొక్క గుండుదెబ్బలా
తగిలింది నీరజకు.
ఈనాటి వర్ధని మాటలలో తను ఎదుర్కోబోయే
సమస్య వికటాట్టహాసం చేస్తూ ప్రత్యక్షమవుతోంది-అందుకే నీరజ భయపడుతోంది-బాధపడుతోంది-
క్షణాలలో నీరజ వచ్చినవార్త చుట్టుపక్కలకు
వ్యాపించింది - ఇలాటి వార్తలు వాటికవే రెక్కలువచ్చినట్లు
వ్యాపిస్తాయి.
అందరూ వచ్చేసారు...
నీరజ పై ప్రాణాలు పైనేపోయాయి - ఇప్పుడు వీళ్ళందరికీ తను సమాధానాలు చెప్పుకోవాలి! పొమ్మనటానికి లేదు - అది మర్యాద కాదు! ఇది సమాజం!
సుధ నీరజను కౌగలించుకుని కన్నీళ్ళు
పెట్టుకుంది - ఏ కారణంగానో నిజంగానే కన్నీళ్ళు వచ్చాయి ...
"ఎంతపని జరిగింది నీరూ! ఇలా మళ్ళీ మా కళ్ళబడతావని అనుకోలేదు ..."
ఆగి కన్నీళ్ళు తుడుచుకుంది.
"అయితే నీ గొలుసు ... మొన్న కొత్తగా చేయించుకున్నావు చూడు, అది పోయినట్టేనా? ఎంత బాగుందో! తలుచుకుంటే నాకే బాధగా ఉంది..."
"అది పోలేదు!"
"పోలేదూ?"
ఆశ్చర్యంగా అడిగింది సుధ -ఇందాక లేనిబాద ఇప్పుడు స్పష్టంగా
వినిపించింది ఆ గొంతులో...
"ఆ గొలుసుతప్ప నీ దగ్గిరేముంది
తీసుకోవటానికి?"
"ఏమీలేదు -ఏమీ తీసుకోలేదు -"
"అయితే కేవలం మానభంగంచేసి పంపేసారన్నమాట? అంతేనా?"
"ఏ భంగమూ ఎవరూ చెయ్యలేదు!"
అంతవరకూ కుతూహలంగా వింటున్న కామాక్షమ్మ
కల్పించుకుని చిరునవ్వుతో అంది -
"నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను నీరజా! అవును! అలాగే సమాధానం చెప్పాలి ! లేకపోతే ఎవరైనా పాడయిపోయామని
చెప్పుకుంటారా? పాడయిపోయిన ఆడదాని బ్రతుకేముంది? చిరిగిన విస్తరి....చూడు, ఎవరడిగినా ఇలాగే చెప్పు!...ఇంతకీ ఆ దొంగలు ఎక్కడికి తీసికెళ్ళారు
నిన్ను? ఎక్కడుంచారు? ఎలా వచ్చావ్? వాళ్ళే దింపారా? నువ్వే వచ్చావా?"
తన శ్రేయోభిలాషిణికి ఎలా కృతజ్ఞతలు
చెప్పుకోవాలో తెలియక పొంగి వచ్చే జుగుప్సను దిగమింగుతూ నవ్వింది నీరజ -ఏడవటం ఇష్టంలేక...
సావిత్రమ్మ అభిమానంగా నీరజ దగ్గరకు
జరిగింది-రహస్యం చెప్పింది.
"ఒక్కమాట! డాక్టర్ చేతిలో ఒక వందో, రెండు వందలో పారేస్తే, నువ్వు చెడిపోలేదని సర్టిఫికేట్ ఇస్తాడు - ఎవడూ నోరెత్తలేడు - నీకు లక్షణంగా పెళ్ళయిపోతుంది. వాళ్ళమీద కోపంతో కేసుపెట్టావంటే నీ బ్రతుకే బజారున పడుతుంది..."
ఇంకా గుసగుసగా ఏదో వాగాబోతున్న
సావిత్రమ్మనుచూచి లెంపకాయకొట్టాలనిపించింది నీరజకు.
అది చేతకాక అక్కడినుంచి వెళ్ళిపోవాలని
లేచి నిలబడింది - ఎక్కడికి వెళ్తుంది? వర్ధనిచుట్టూ మరో పెద్ద గుంపు ఉంది - ఆబగా కుతూహలంతో వాళ్ళు అడిగే ప్రశ్నలకు తన
శాయశక్తులా ఆ కుతూహలం పెంపొందిస్తూ సమాధానాలు చెప్తోంది వర్ధని... మధ్యమధ్యలో కళ్ళు తుడుచుకుంటోంది!
"ఇది తిరిగి వచ్చిందని ఆనందించనా ? మొత్తం కుటుంబానికే అప్రతిష్ట వచ్చిందని బాధపడనా?"
అని వాళ్ళనే అడుగుతోంది -
వాళ్ళు లోలోపల ఆనందిస్తూ పైకి
నిట్టూరుస్తూ సానుభూతి ప్రకటిస్తున్నారు ...
పోలీస్ ఆఫీసర్ మురళి మరో ఇద్దరు కాన్
స్టేబుల్స్ తో వచ్చాడు -
పోలీసులను చూడగానే శ్రేయోభిలాషిణులందరూ
చెల్లాచెదురైపోయారు...
నిలువునా వణికిన నీరజ 'తప్పదు - తప్పదు' అనుకుని పళ్ళుబిగబట్టి కూర్చుంది.
"కర్మ! చివరకు పోలీసులు ఇంటిమీదకు తయారయ్యే దశ
పట్టింది -" అని గట్టిగా స్వాగతం పలుకుతూ వెళ్ళిపోయింది వర్ధని...
"మిస్! నీరజ మీరేకదూ!"
నీరజనూ, పరిసరాలనూ జాగ్రత్తగా
పరిశీలిస్తూ అడిగాడు మురళి.
"అవును!"
ఆ కంఠంలో స్థైర్యానికి లోలోపల కొంచెం
ఆశ్చర్యపోయాడు మురళి...
"సరిగ్గా వారంరోజుల క్రిందట ఒక గేంగ్
ఎత్తుకుపోయింది మిమ్మల్నే కదూ!"
"అవును!"
"ఎలా ఎత్తుకుపోయారు?"
"షాపింగ్ చేసుకుని బస్ కోసం, బస్ స్టాండ్ దగ్గర నించున్నాను. నాతోపాటు మరికొందరు కూడా ఉన్నారు
అందరిమధ్యనుండీ నన్ను ఎత్తుకుపోయి కారులో తీసుకుపోయారు..."
"ఎవరూ ఏమీ చెయ్యలేదా?"
"నేను అరిచాను - మరికొందరు మూగారు. వాళ్ళదగ్గర ఆయుధాలున్నాయి. ఎవరిమటుకు వాళ్ళే భయపడిపోయారు?"
"అది కారా? టాక్సీయా?"
"ఏమో! అవన్నీ గుర్తించేస్థితిలో లేను నేను!"
"కారు నంబర్ కొందరు నోట్ చేసారు. కానీ అది రాంగ్ నంబరని తేలింది! అది ఎలాంటి కారో తెలుసుకోగలిగితే మాకు ఉపయోగిస్తుంది..."
"అయామ్ సారీ! నన్ను కారులో కూచోబెట్టటమూ, కళ్ళకు గుడ్డకట్టడమూ, అన్నీ ఒకదానివెనుక ఒకటి జరిగిపోయాయి - నాకు పెనుగులాడటానికి కూడా అవకాశం
లేకపోయింది-"
"వాళ్ళు ఎందరు?"
"అయిదుగురు!"
"ఎక్కడకు తీసికెళ్ళారు?"
"అది ఒక హోటల్ కావచ్చు- సరిగ్గా చెప్పలేను!"
"ఈ వారంరోజులూ అక్కడే ఉన్నారా?"
"అవును!"
"వాళ్ళు మిమ్మల్ని ఏమీ బాధించలేదా?"
"లేదు!"
"అక్కడినుండి ఎలా తప్పించుకోగలిగారు?"
"నేను తప్పించుకోలేదు!"
"క్షమించండి? మీరు వివరంగా
చెప్పాలి?"
"వాళ్ళలో ఒకతను నన్ను విడిపించి స్టేషన్
దగ్గిర దింపాడు..."
మురళి కళ్ళు మరింత నిశితంగా చూసాయి...
"ఎవరతను?"
"నాకు తెలియదు!"
"మీరెవరో తెలియని అతనికి మీమీద అంత అభిమానం
ఎలా వచ్చింది?"
"తెలియదు!"
"వాళ్ళవల్ల మీ కేవిధమయిన హానీ జరగలేదు?"
"లేదు!"
"మిమ్మల్ని విడిపించిన వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పగలరా?"
"చామనఛాయ -పొడుగనే చెప్పాలి!"
"ఇలాటివాళ్ళు చాలామంది ఉంటారు -"
"ఇంతకంటే ప్రత్యేకించి ఎలా వర్ణించాలో నాకు
తెలియటంలేదు -చూస్తే గుర్తుపట్టగలను!"
"పట్టపగలు నడిబజారులోఉన్న మిమ్మల్ని
ఎత్తుకుపోవటం సామాన్యమైన విషయంకాదు - వాళ్ళు ఇంత సాహసంచేసింది కేవలం
సరదాకా? దీని వెనుక ఏ ఉద్దేశమూ లేదా?"
"నా...నాకు తెలీదు-"
"మేడమ్! మీరు మా దగ్గిర అన్ని విషయాలూ చెప్పటమే
మంచిది!"
"నే నేదీ దాచటంలేదు?"
మురళి నవ్వాడు -ఆ నవ్వులో అతడు తన మాటలు నమ్మటంలేదని
అర్ధమయింది నీరజకు -
"ఆల్ రైట్ ! మీ రొక్కసారి మా ఆఫీస్ కు రావలసి ఉంటుంది. మా డాక్టర్ మిమ్మల్ని పరీక్షచేస్తాడు!"
నీరజ ముఖం పాలిపోయింది - మరొక్కసారి నవ్వి మురళి వెళ్ళిపోయాడు...
పోలీసులు వెళ్ళిపోయారని తెలియగానే మళ్ళీ
జనప్రవాహం మొదలయింది...
నీరజ నవ్వుతోంది...అందరికీ సమాధానాలు చెపుతోంది...కానీ నీరజ కళ్ళు ఒకే ఒక వ్యక్తికోసం
ఆరాటంగా ఎదురుచూస్తున్నాయి-
కొరకరాని కొయ్యలాంటి నీరజ తమ కుతూహలం
సరిగా తీర్చనందుకు నిరుత్సాహంతో అందరూ వెళ్ళిపోయారు -
అప్పుడు వచ్చాడు ప్రభు...
అంతవరకు కూడదీసుకున్న నీరజ ఓపిక ప్రభును
చూడగానే చెదిరిపోయింది...
దీనంగా వడిలిపోయిఉన్న నీరజను చూస్తూ
ఒక్కమాట మాట్లాడకుండా ఆప్యాయంగా చేతులు చాచాడు ప్రభు - ఆ చేతుల్లో వాలిపోయి వెక్కివెక్కి
ఏడ్చింది నీరజ...
"ప్రభూ! నిజం! నేను...నేను..."
"హుష్! ఏంమాట్లాడకు ; మళ్ళీ నిన్ను చూడగలిగాను - నా దగ్గిరకు వచ్చావు - అది చాలు నాకు! ఏ దెలా జరిగినా నువ్వు దూరంకాకుండా ఉంటే
చాలు!"
ప్రభు చేతులు మరింత ఆప్యాయంగా నీరజను
చుట్టుకున్నాయి...
తనను చుట్టుముట్టి పీడిస్తున్న
సమస్తశక్తులనుండీ కాపాడుతున్నట్లు తనను అదుముకున్న ఆ చేతులలో ఒదిగిపోయి తేలికగా
నిట్టూర్చింది నీరజ.
* * *
"నువ్వా? ఎందుకొచ్చావ్?"
లక్ష్మీదేవి అడిగిన ఆ ప్రశ్నకు
బిత్తరపోయింది నీరజ -నీరజకు లక్ష్మీదేవి కొత్తకాదు - ఆ ఇల్లు కొత్తకాదు...
నీరజకు పదేళ్ళ వయసున్నప్పుడు ... నీరజ తల్లి ఆత్మహత్యచేసుకున్నప్పుడు...చేతులుచాపి నీరజను
గుండెలలోకి తీసుకున్నది లక్ష్మీదేవే! ఆనాటి నుండీ తనకు దూరమయిన మాతృప్రేమను
లక్ష్మీదేవిదగ్గిరే పొందగలిగింది నీరజ -
నీరజకు జ్ఞానంవచ్చాక తన తల్లి దుఃఖగాథ
లక్ష్మీదేవి నోటినుండీ వింది ఎన్నోసార్లు...
"మీ నాయనమ్మ, మీ అత్తయ్యలు, మనుష్యులు కాదమ్మా! రాక్షసులు...ఏదో ఒక వంకతో మీ అమ్మను సతాయించటంతప్ప వాళ్ళకు వేరేపని ఉండేది కాదు - మీ నాన్న మీ అమ్మతో మాట్లాడితే మండిపడేది మీ నాయనమ్మ...మీ నాన్న ఒట్టి గంగిగోవు. దేనికీ సమాధానం చెప్పగలిగేవాడు కాదు... మీ నాన్నా మీ అమ్మాకలిసి సరదాగా సినిమాకు వెళ్ళటానికి లేదు -కబుర్లు చెప్పుకోవటానికి లేదు -చివరకు కాపురంచెయ్యటానికి
కూడా లేదు -మీ అత్తయ్యలందరికీ పెళ్ళిళ్ళయ్యాయి -కానీ ఒక్కళ్ళూ అత్తవారిళ్ళకు వెళ్ళేవారు కారు - వాళ్ళ మొగుళ్ళే వాళ్ళదగ్గరకు వచ్చేవారు. మీ అత్తయ్యలకీ, వాళ్ళ మొగుళ్ళకీ, వాళ్ళ పిల్లలకీ చాకిరీచెయ్యటమే మీ అమ్మ
అనుభవించిన సంసారసుఖం... మీ అత్తయ్యలు మీ అమ్మ కళ్ళెదురుగానే
పట్టుచీరలు కట్టుకునేవారు - పువ్వులు సింగారించుకునేవారు. మీ అమ్మ కేమీ ఇచ్చేవారుకారు -ఏమీ పెట్టుకోకపోయినా, ఏ అలంకారమూ లేకపోయినా మీ అమ్మ చాలా అందంగా ఉండేది. అది చూసి కళ్ళలో నిప్పులుపోసుకున్న మీ అత్తయ్యలు లేనిపోని అపనిందలు మోపటం కూడా
మొదలుపెట్టారు-అది భరించలేక మీ అమ్మ ఆత్మహత్య
చేసుకుంది..."
"ఈ వర్ధని వచ్చాక అందరి రోగాలూ
కుదిరిపోయాయి-మీ అత్తయ్యలందరూ అత్తారిళ్ళకు
వెళ్ళిపోయారు-రమ్మంటే కూడా ఇప్పుడు ఇక్కడికి రారు. తల్లి కొంగుపట్టుకు తిరిగే మీ నాన్న పెళ్ళాం కొంగుపట్టుకుని తల్లిని ఇంట్లోంచి
వెళ్ళగొట్టాడు-భలే ఆడది...చండిక..."
"మంచిదేగా అత్తయ్యా! అలా ఉండబట్టికదా సుఖంగా ఉంది?"
అమాయకంగా అడిగేది నీరజ-
లక్ష్మీదేవికి ఇది నచ్చేదికాదు - అసహనంతో "మంచిదా? ఆడదంటే అలా ఉంటుందా? ఛీ! ఛీ! తలుచుకుంటే కంపరమెత్తుతుంది-" అనేది.
తన తల్లి అష్టకష్టాలూపడి
ఆత్మహత్యచేసుకుంటే సానుభూతితో కన్నీళ్ళు కార్చగలిగిన లక్ష్మీదేవి, వర్ధని ఎదురుతిరిగి సుఖపడుతోంటే సహించలేక పోతోంది-లక్ష్మీదేవిలో ఈ ప్రవృత్తి ఎప్పుడూ
వింతగానే ఉంటుంది నీరజకి.
వర్ధనికి నీరజమీద ఏకోశానా అభిమానంలేదు...నీరజకు వయసువస్తున్న కొద్దీ....పరిస్థితులను అర్ధంచేసుకోగలుగుతున్నకొద్దీ....వర్ధనిమీద కోపంకంటే సానుభూతే ఎక్కువగా కలగసాగింది.
వర్ధని అందమైనది....కొద్దిగా చదువుకున్నది-కానీ బీదకుటుంబంలో పుట్టింది. అందుకే కామయ్యకు రెండో భార్యగా రావలసివచ్చింది - వస్తూనే అత్తవారింటి పరిస్థితిని ఆకళింపు చేసుకుంది-కామయ్యణు ఎవరో ఒకరు ఆడించవలసిందేననీ, అలా ఆడించే సమర్ధత ఎవరికుంటే అతను
వాళ్ళచేతుల్లో కీలుబొమ్మ అయిపోతాడనీ అర్ధంచేసుకుంది. క్షణాలలో అతన్ని తన చేతులలోనే కీలుబొమ్మను
చేసుకుంది-కామయ్యకు ఆస్తిపాస్తులున్నాయిగాని
చదువులేదు-ఆ ఆస్తిచూచే వర్ధనిని ఇచ్చారు-కానీ, ఆడపడుచులు
కుటుంబాలతోసహా సంవత్సరాలతరబడి తిష్టవేసి జల్సాఖర్చులు చెయ్యటంతో ... అత్తగారి పుణ్యకార్యాలతో, సమరాధనలతో ఆ ఆస్తి చాలావరకూ
హరించుకుపోయింది-వర్ధని చేతిలోకి వచ్చింది. అప్రయోజకుడైన భర్త...అతికష్టంమీద తిండిగడిచే కొద్దిపాటి ఆస్తి...ఎదుగుతోన్న సవతి కూతురు...
నీరజకు జ్ఞానంవచ్చిన దగ్గరనుంచీ తన
సవతితల్లి పరిస్థితులతో ఎలా ఎదిరించిపోతున్నదీ గమనిస్తోనే ఉంది - తనను ప్రేమించలేని వర్ధనిమీద నీరజకు కూడా పెద్దగా
ప్రేమలేదు... కానీ వర్ధని దగ్గిరనుండి నీరజ ధైర్యం, మొండితనం...పరిస్థితులతో తలపడే పట్టుదల, నేర్చుకుంది.
ఎప్పుడూ ఏ సందర్భంలోనూ వర్ధనిముందు
ఏడవలేదు నీరజ ...లక్ష్మీదేవి దగ్గిరకువచ్చి కూచునేది. అప్పుడు ఏడిచేదికాదు-కానీ నీరజ ముఖం చూస్తూనే లక్ష్మీదేవి సంగతి
గ్రహించేది-నీరజణు బుజ్జగించి దగ్గిరుండి అన్నం
తినిపించి ఆ తరువాతనే ఇంటికి పంపించేది - ఆ లక్ష్మీదేవి ఈనాడు అడుగుతోంది 'ఎందుకు వచ్చావు?' అని...
లక్ష్మీదేవి అలా అడిగిందంటే ఇక నీరజ
అక్కడినుండి వెళ్ళిపోవలసిందే! కానీ వెళ్ళలేదు. వెళ్ళదలచుకోలేదు-లోకంలో దేనినుండై నా సరే తనకు రక్షణ ఇస్తున్నట్లు తనను చుట్టుకొన్న ప్రభు
చేతులు తనకు ఎక్కడలేని బలాన్ని సమకూరుస్తున్నాయి.
యశోధర బయటికి
వెళ్ళినట్టుంది- అప్పుడే వచ్చింది-నీరజను చూసి మొదట ఆశ్చర్యపోయింది-తరువాత ఆనందంతో కౌగలించుకుంది.
"నేను ఊళ్ళో లేను-ఇవాళే వచ్చాను. నీ దగ్గరకి వద్దామనే అనుకుంటున్నాను- నువ్వేవచ్చావు-వస్తావని అనుకోలేదు-"
"వస్తానని అనుకోలేదా? ఒక్కరోజైనా మీ ఇంటికి రాకుండా ఎప్పుడైనా ఉన్నానా?"
"ఇదివరకు సంగతి సరే! ఇప్పుడు అందరూ చూస్తుండగా
రోడ్డుమీదనుండినడిచి..."
మధ్యలో ఆగిపోయి నవ్వేసింది యశోధర.
నీరజకు అర్దమయింది. లోపలినుండి లక్ష్మీదేవి "యశోధరా!" అని కేకపెట్టింది-
"వస్తాను-" అని యశోధర లోపలికి వెళ్ళింది.
"యశో! నువ్వు ఇదోవరకులాగ ఆ నీరజతో మాట్లాడటానికి
వీల్లేదు!"
"హుష్! నీరజకు వినిపిస్తుంది!"
"వినిపించనీ! అంతగా అవసరమయితే, నీరజముఖంమీదే చెపుతాను!"
"పాపం, నీరజ తప్పేముంది
అమ్మా?"
"తప్పుఉందని నేను అనటంలేదు-కానీ ఈ విషయం ఇంతటితో ఆగరు...వాళ్ళెవరో మళ్ళీ నీరజకోసం రాక మానరు-ఇలాటి గొడవల్లో నువ్వూ చిక్కుకుంటే నేను భరించలేను!"
"అమ్మా! నువ్వే నీరజను గురించి ఇలా మాట్లాడుతోంటే మిగిలినవాళ్ళు ఏమంటారో
చెప్పు..."
"నాకు నీరజమీద అభిమానం ఉంది ఇప్పటికీ ఉంది. కానీ అది నాకన్నబిడ్డల మీదఉన్న
అభిమానంకంటే ఎక్కువదికాదు - నీ మేలుకోరి చెపుతున్నాను. నువ్వు నీరజకి దూరంగా ఉండు..."
తమ సంభాషణ నీరజను వినిపిస్తుందని యశోధరకు
తెలుసు - వినిపించకుండా ఉండాలని తల్లి ఏమీ జాగ్రత్త తీసుకోలేదు - నీరజను ఎలా ఎదుర్కోవలసివస్తుందోనని భయపడింది. ఎప్పటి చిరునవ్వుతో ఉన్న నీరజనుచూసి ఆశ్చర్యపోయింది.
"నీరజా! నాకు లోపల కొంచెం పని ఉంది- నువ్వు ఈ పుస్తకాలు చూసుకుంటూ కూర్చుంటావా? వెళ్తావా?"
"కూర్చుంటాను!"
ఒక్కసారి నీరజముఖంలోకి చూసి లోపలకు
వెళ్ళిపోయింది యశోధర....యశోధర కళ్ళు చెమ్మగిల్లి ఉన్నాయి. ఆ కళ్ళలో సానుభూతి ఉంది. మనసులో ఆర్ద్రత ఉంది. అయినా వెళ్ళిపోయింది.
ప్రభు వచ్చేసరికి కొంచెం పొద్దుబోయింది - తన స్నేహితుడు నీలకాంత్ తో కబుర్లుచెపుతూ
కూచున్నాడు-నీలకాంత్ కూడా వస్తానంటే అతడిని కూడా
తీసుకుని వచ్చాడు.
తన ఆఫీస్ రూంలో కూచున్న నీరజను చూసి
ఆశ్చర్యపోయాడు - నీరజ తన ఇంటికిరావటం మామూలే! కానీ, ఇంతకుముందు ఎన్నడూ
ఇలా ఆఫీస్ రూంలో కూచోలేదు. వంటింట్లో లక్ష్మీదేవికి వంటసాయంచేస్తూనో - యశోధరతో ఒక మంచంమీద పడుకుని కబుర్లు
చెపుతూనో ఉండేది...
నీరజను ఎవరో టాక్సీలో తీసుకుపోయారని
విన్నప్పుడు లక్ష్మీదేవి ఎంతో బాధపడింది... ఒకరాత్రి అంతా నిద్రపోకుండా కుమిలి కుమిలి
ఏడ్చింది - కానీ, తర్వాత నీరజ తిరిగి వచ్చిందని తెలిసినపుడు
ఏ మాత్రమూ సంతోషించలేదు-
"ప్రభూ! నీరజ నా కోడలవుతుందని ఎంతో ఆనందించాను. ఇంక ఆ రాతలేదు. నువ్వు నీరజను మరచిపో?" అంది-
"నీరజ వచ్చింది కదమ్మా! ఇంక మరిచిపోవటం దేనికి?"
"వస్తేమాత్రం ? మళ్ళీ మామూలు నీరజ అవుతుందా?"
"నీరజ ఎప్పుడూ నీరజే! నీరజలో మార్పు ఎందుకు వస్తుంది?"
"ఎవరో ఎత్తుకుపోయి కొన్నిరోజులు ఉంచుకొని
తిరిగి పంపించిన అమ్మాయిని చెసుకుంటావా?"
"ఎవరో తప్పుచేస్తే దానికి నీరజను
శిక్షించమంటావా? ఎప్పటినుంచో నీరజను పెళ్ళిచేసుకుంటానని
చెప్తున్న నేను కాదంటే నీరజ కసలు పెళ్ళి అవుతుందా? ఆ అమాయకురాలి
బ్రతుకుమొత్తం బలికావలసిందేనా?"
"అందుకని ... నువ్వు చేసుకుంటానంటావా? అంత త్యాగం నేను చెయ్యలేను?"
"త్యాగం కాదమ్మా! నీరజలేకుండా నేను బ్రతకలేను. ఇది స్వార్ధమే!"
ప్రభు మాటలు లక్ష్మీదేవికి అర్ధంకాలేదు - ఆవిడకు అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో ప్రభుకు
అర్ధంకాలేదు - ముందుకు నడుస్తోన్న తరంలోని అభ్యుదయ
దృక్పథం ప్రభుది-వెనుకబడిన తరంలోని మగ్గిపోయిన
భావాలతోకూడిన మంచితనం లక్ష్మీదేవిది...
అయినా ప్రభును గట్టిగా ఏమీ అనలేదు. ఎందుకంటే ఆ కుటుంబానికంతకూ ప్రభు ఒక్కడే
ఆధారం-ప్రభు తండ్రి చంద్రశేఖరరావుకు తాతలనాటి
ఆస్తులు రాకపోయినా ఆ దర్జాలన్నీ వచ్చాయి. ఉన్న కొంచెమూ కూడా
తగలబెట్టుకున్నాడు-ఉద్యోగం చెయ్యటం చిన్నతనమని చెయ్యడు - ఎకౌంటెంట్ గా ప్రభుతెచ్చే అయిదువందలతోనే ఆ కుటుంబం నడవాలి - తనకు సరీగ్గా అన్నీ అమరటంలేదని చంద్రశేఖరరావు భార్యమీద ఎప్పుడూ చిరాకుపడుతూ
ఉంటాడు-లక్ష్మీదేవి అవన్నీ శాంతంగా సహిస్తూ
భర్తను సంతృప్తిపరచటానికే ప్రయత్నించేది - తన కష్టార్జితం తల్లి దగ్గిరనుండి
తీసుకుని తండ్రి పేకాటలో తగలెయ్యటం ప్రభు సహించలేకపోయేవాడు-
"నాన్నకు డబ్బు ఇయ్యకమ్మా!" అనేవాడు -
"ఆడుగుతోంటే లేదనటం ఎలా?" అనేది లక్ష్మీదేవి....'భర్తమాట కాదనమంటావా?' అన్న ధోరణిలో-
ఈ రకమైన మంచితనం ప్రభుకు నచ్చలేదు-రానురాను తల్లికికూడా డబ్బు అందకుండా
జాగ్రత్తపడేవాడు-
తన తల్లి చాలా మంచిది-కానీ ఆ మంచితనం ఒక శతాబ్దం వెనుకటిది!
నీరజ ఆఫీస్ రూంలో కూచుందంటే, తల్లి ఇంట్లోకి రానియ్యలేదన్న మాట! తను తల్లిని గౌరవిస్తాడు-కానీ భయపడడు.
నీరజనుచూసి ఆప్యాయంగా నవ్వాడు-సమాధానంగా నవ్వబోయిన నీరజ ప్రభు వెనకనే
వస్తోన్న నీలకాంత్ ను చూసి ఆగిపోయింది. అంతవరకూ సహనంతో కూచున్నది, అక్కడ నిలవలేనట్లు వెళ్ళడానికి లేచింది- దారికి అడ్డు తగులుతున్నట్లు గుమ్మానికి
చేతులానించి నిలబడ్డాడు నీలకాంత్. నీరజ ముఖం లోకిచూస్తూ నవ్వాడు-నించున్న నీరజ మళ్ళీ
కూలబడింది-
* * *
"కంగ్రాట్యులేషన్స్ నీరజా! గూండాల చేతుల్లో పడికూడా తప్పించుకుని
బయటపడ్డావు..."
నవ్వుతూ అన్నాడు నీలకాంత్.
పాలిపోయిన నీరజ ముఖంచూసి జాలిపడ్డాడు
ప్రభు.
"ఫర్ గెట్ ఇట్ నీలకాంత్?" అన్నాడు కటువుగా.
"ఏం? నేను అన్నదాట్లో
తప్పు ఏముందీ?"
"తప్పు ఉందనికాదు - ఎందుకు అనవసరంగా మనసుకు కష్టం
కలిగించేవిషయాలు కెలుక్కోవటం?"
"నో! నో! ఇందులో కష్టపెట్టుకోవలసింది ఏమీలేదు."
"నీరజా! ఆ గూండా లెవరో నీకేమీ తెలియదా? డర్టీ రోగ్స్! వాళ్ళను శిక్షించకుండా వదిలిపెట్టకూడదు..." నీరజ చివ్వున తలెత్తింది - ఎర్రబారిన కళ్ళు నిప్పురవ్వలను చిమ్మాయి - అంతసెగకూ తట్టుకుని నిర్లక్ష్యంగా నవ్వాడు నీలకాంత్.
"ఇంతవరకూ జరిగిందీ జరగబోయేదానితో పోలిస్తే చాలా
అల్పం నీరజా! నువ్వు ఆ గూండాలా చేతుల్లోంచి బయట పడినా, ఈ సమాజం నిన్ను మళ్ళీ వాళ్ళ దగ్గిరకు....ఇంకా అంతకంటే నీచుల దగ్గిరకు తరమక మానదు..."
'నీలకాంత్?" ప్రభు అసహనంతో అడ్డుతగిలాడు-
"సమాజమంటే అమ్మలక్కలు, స్వార్ధపరులు మాత్రమే కాదు - నువ్వూ, నేనూ కూడా ఉన్నాం...మన అండ ఉన్నంత వరకూ నీరజకు భయంలేదు !"
"అవుననుకో! కానీ ఒక్క విషయం అర్ధంచేసుకో! అసలు మూఢత్వమే ప్రమాదకరమైనది....అందులో సామూహికమైన మూఢత్వం మరింత పట్టపగ్గాలు లేనిది! ఫరవాలేదు నీరజా! ఏ క్షణంలోనయినా నేను నీకు సహాయం
చెయ్యటానికి సిద్దంగా ఉంటాను."
ఆడపులిలా చూసింది నీరజ-
"నీ సహాయం కోరే దుర్దశ నాకు కలిగిననాడు...నాకు సహాయం చెయ్యటానికి నువ్వు బ్రతికి
ఉండవు."
"నీరజా?" వారిస్తున్నట్లు
అన్నాడు ప్రభు....నీలకాంత్ స్నేహంగా ప్రభుభుజంమీద చేత్తో
పట్టి "పోనీలే ప్రభూ! నీరజ నన్ను అర్ధంచేసుకునే రోజు రాకపోదు. అప్పటి వరకూ నేను శాంతంగా ఎదురుచూడగలను. ఇప్పుడు నేను మీ మధ్య ఉండటం మంచిది కాదు - వస్తాను -" అని నవ్వుతూనే వెళ్ళిపోయాడు.
నీలకాంత్ వెళ్ళిపోగానే నీరజ ఆర్తిగా ప్రభు
రెండుచేతులూ పట్టుకుంది...
"ప్రభూ! నామాట విను! నీలకాంత్ తో స్నేహం మానెయ్యి..."
ప్రభు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. నీలకాంత్ చేసింది తప్పు కావచ్చును - కాని, తన తప్పు తనే
ఒప్పుకుని పశ్చాత్తాపపడ్డాక కూడా క్షమించకపోవటం సమంజసమేనా?
ప్రభు, నీలకాంత్
చిన్నప్పటినుండీ స్నేహితులు కాకపోయినా ఒకరికొకరు తెలుసు... నీలకాంత్ తండ్రి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తి... అంత పలుకుబడి సంపాదించిపెట్టిన డబ్బు కూడా ఉంది. సినిమాలకూ, షికార్లకూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టే నీలకాంత్ ను స్నేహితులంతా ఒక
నాయకుడి లాగా చూసేవారు. ప్రభు ఒక్కడే నీలకాంత్ డబ్బుకు లొంగేవాడు
కాదు. నీలకాంత్ ఎప్పుడూ స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడు-ఏదో ఒక ఇదంగా అల్లర్లు రెచ్చగొట్టడం ... ఆ అల్లరిలో తను నాయకుడుగా ఉండటం అతనికి బాగా ఇష్టం ... డిగ్రీ తీసుకున్నాక ప్రభు ఒక ఫరమ్ లో ఎకౌంటెంట్ గా చేరాడు. నీలకాంత్ మాత్రం స్టూడెంట్ లీడర్ కావాలని .... స్టూడెంట్ గానే ఉండాలని మరొక సబ్జెక్ట్ తో మళ్ళా యమ్.ఏ.లో చేరాడు.
ఒక రోజు తన ఫ్రెండ్స్ అందరికీ ఒక హోటల్ లో
పార్టీ ఇస్తున్నాడు నీలకాంత్....నీరజతో కలిసి హోటల్ కి వచ్చిన ప్రభును
చూసాడు. వాళ్ళిద్దరూ ఫేమిలీరూంలో కూచోగానే "హలో ప్రభూ?" అంటూ తను లోపలకు వెళ్ళాడు. నీలకాంత్ ను చూడగానే నీరజ ముఖం జేవురించింది.
నీలకాంత్ నీరజను చూస్తూ దీనంగా "నన్ను క్షమించండి! ఆ రోజు తొందరపడ్డాను. అప్పటినుంచి ఇప్పటివరకూ మీకు క్షమార్పణ
చెప్పుకోవాలని చూస్తూనే ఉన్నాను" అన్నాడు.
ప్రభు ఆశ్చర్యంగా "మీ కిద్దరికీ పరిచయం ఉందా?" అన్నాడు.
నీలకాంత్ అంతకంటే ఆశ్చర్యంగా "ఈవిడ నీ కేమీ చెప్పలేదా?" అన్నాడు.
"లేదు."
"అబ్బా ! ఎంత విశాలహృదయం! మీ ఇద్దరిముందు నేనే క్షుద్రుడిగా ఫీలవుతున్నాను, ప్రభూ! నా తప్పు నేనే నీ ముందు ఒప్పుకుంటాను. నువ్వు ఏ శిక్ష విధించినా సరే, అసహ్యించుకున్నా సరే. నీకు తెలుసుగా! నేను అప్పుడప్పుడు తాగుతాను, కొన్నిసార్లు కొంచెం ఎక్కువగా కూడా తాగుతాను. ఆరోజు ఎక్కువ గానే తాగాను. మా ఇంట్లో ఎవరూ లేనప్పుడు....శీతాకోక చిలుకలను ఇంటికి రప్పించుకోవటం
నాకు అలవాటే. ఆ రోజూ అలాంటి చిలుక కోసమే
ఎదురుచూస్తున్నాను -నీరజ నా గదిలోకి వచ్చింది - నా కోసమే వచ్చిందనుకున్నాను
చెయ్యిపట్టుకుని దగ్గిరకు తీసుకోబోయాను - చెళ్ళు చెళ్ళున నా రెండు చెంపలూ
వాయించింది. నా మైకం దిగిపోయింది. నీరజణు క్షమార్పణ కోరుకోవాలనుకున్నాను. కానీ అప్పటికే ఆవిడ వెళ్ళిపోయింది... ప్రభూ! నన్ను క్షమించు. నేను చేసింది తప్పు లేదనను. కానీ, పొరపాటున జరిగింది..."
ప్రభు చేతులు పట్టుకున్నాడు. నీలకాంత్ కళ్ళలో నీళ్ళు స్పష్టంగా
కనిపిస్తున్నాయి.
ప్రభు వెంటనే ఏమీ అనలేకపోయాడు. నీరజవంక చూసాడు. నీరజ పెదవులు బిగించుకుని కూచుంది...
"దట్సాల్ రైట్! జరిగింది మరిచిపో!" అన్నాడు, ఆ సందర్భంలో అంతకంటే ఏమనాలో అర్ధంకాక...
"థేంక్యూ!" అని ప్రభుచేతిని సంతోషంగా ఊగించి నీరజవైపు
తిరిగిమర్యాదగా తలవంచి తన స్నేహితుల మధ్యకు వెళ్ళిపోయాడు నీలకాంత్.
నీలకాంత్ వెళ్ళిపోగానే ప్రభు నీరజతో "అతను చెప్పింది నిజమేనా? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా?" అన్నాడు.
"అవును, వెళ్ళాను?"
"దేనికి?"
"ఉద్యోగం కోసం. ప్రసాదరావుగారికి చాలా పలుకుబడి ఉందనీ...ఆయనను కలుసుకుని మాట్లాడితే నాకు ఉద్యోగం తేలిగ్గా దొరుకుతుందనీ చెప్పారు. నేను ప్రసాదరావు గారింటికి వెళ్ళాను. భయపడలేదు. భయపడవలసిన అవసరం ఉంటుందని నాకు తెలియదు. నాకు నౌకరు కనిపించాడు "ప్రసాదరావు గారు ఉన్నారా?" అని అడిగాను. "పైన ఉన్నారు, వెళ్ళండి" అన్నాడు. తీరా అక్కడ ఈ నీలకాంత్..."
ఆగిపోయింది నీరజ...నీలకాంత్ పేరు ఉచ్చరిస్తున్నప్పుడు నీరజ
మనసులో మంట అంతా కళ్ళలో కనిపించింది. ప్రభు ఓదార్పుగా నీరజచేతిమీద తడ్తూ "సరేలే! మరిచిపో!" అన్నాడు.
"ఛీ! దుర్మార్గుడు!" అక్కసుగా అంది నీరజ. పకపక నవ్వాడు ప్రభు.
ఆ తర్వాత నీలకాంత్ ప్రభును వదిలిపెట్టలేదు.
"ప్రభూ! అందహ్రూ నా డబ్బుకోసం నాచుట్టూ కాకుల్లా
చేరేవారే! నాకు నిజమైన స్నేహితులు లేరు. నీ స్నేహం వదులుకోలేను..." అన్నాడు.
"అదేమిటి నీలకాంత్! ఎవరైనా నీ స్నేహం
దొరకటం అదృష్టం అనుకుంటారు."
"అవును నువ్వొక్కడీవే అలా అనుకోవు. స్నేహాన్ని స్వార్ధానికి మార్చుకునే కపటం
నీకు లేదుగనుక. అందుకే నీ స్నేహం దొరకటం నా అదృష్టమని
అనుకుంటున్నాను..."
ప్రభు తానై నీలకాంత్ స్నేహాన్ని కోరలేదు
కానీ కోరివస్తోన్న నీలకాంత్ ను పొమ్మనలేకపోయేవాడు. నీలకాంత్ రానురాను ప్రభుఇంట్లో కూడా
సన్నిహితుడైపోయాడు. లక్ష్మీదేవికీ యశోధరకూ కూడా నీలకాంత్ అంటే
ఇష్టమే. యశోధరా నీలకాంత్ ను కూడా "అన్నయ్యా!" అనే పిలుస్తుంది. నీలకామ్త్ కూడా యశోధరను సొంత చెల్లెలులాగే చూసేవాడు. యశోధరకు పెళ్ళి సంబంధాలు నీలకాంత్
చూసేవాడు. ఒక డాక్టర్ తో సంబంధం నిశ్చయించింది కూడా నీలకాంతే! నీరజ వచ్చినప్పుడు మాత్రం నీలకాంత్ చాలా సంకోచపడేవాడు. సాధారణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ప్రభు తనే బలవంతపెట్టి నీలకాంత్ ను కూర్చోబెట్టేవాడు... నీరజకు మాత్రం నీలకాంత్ ను చూసినప్పుడల్లా తేళ్ళూ జెర్రులూ పాకుతున్నట్టే ఉండేది.
"ఆ నీలకాంత్ తో స్నేహం మానెయ్యి ప్రభూ!" అనేది.
"ఏం? మళ్ళా ఏమైనా అసభ్యంగా
ప్రవర్తించాడా?"
"లేదు...కానీ..."
"నీరజా! ఆనాటి సంగతి మరిచిపో! పొరపాటు అనటానికి ఆధారముందిగా! మనుష్యులను అసహ్యించుకో కూడదు!"
ఇంకేమీ మాట్లాడలేకపోయేది నీరజ.
నీరజను గూండాలు ఎత్తుకుపోయారని
విన్నప్పుడు ప్రభు పిచ్చివాడై పోయాడు. నీలకాంత్, ప్రభు కూడా ఉండి ధైర్యం చెప్పాడు. నీరజ తిరిగి వచ్చిందన్న వార్తను ప్రభు
ఆఫీసుకే వెళ్ళి చెప్పాడు. అలాంటి నీలకాంత్ ను నీరజ నిష్కారణంగా
అనుమానించటం ప్రభుకు నచ్చలేదు.
"ఆనాటి పొరపాటేనా? మళ్ళీ నిన్ను అవమానించాడా?" అన్నాడు.
నీరజ సమాధానం చెప్పలేకపోయింది. తన ముఖం అతనికి కనిపించకుండా తల మరింత
క్రిందకు దించుకుంది.
* * *
జగమంతా చైతన్యంతో ఉన్నప్పుడు మాటుమణిగిఉండి, సూర్యుడు మాటు మణిగి లోకమంతా నిశ్శబ్దంలోకి జారుకున్నప్పుడు సందడించేవి రెండే
రెండు రంగాలు- ఒకటి వ్యభిచారగృహాలు-రెండు దొంగల గుంపులు.
రాజేశ్వరి ఆధ్వర్యాన ఆ వ్యభిచార గృహం చాలా
సందడిగా ఉంది. కొందరు గుంపులుగాచేరి పాటలు పాడుకుంటున్నారు. మరికొందరు ఇంకా చిన్న వాళ్ళు డాన్స్
నేర్చుకొంటున్నారు. మూసుకున్న తలుపులవెనుకనుంచి కిలకిలారావాలు
వినిపిస్తున్నాయి. తమ సరసుడు బానబొజ్జవాడయినా, చిడుమువంటివాడయినా, మొరటువాడయినా, అర్భకుడయినా, వాళ్ళుమాత్రం అలా నవ్వుతూనే వున్నారు, నవ్వదానికే
పుట్టినట్లు...కన్నీరు కార్చే అధికారం శాశ్వతంగా
పోగొట్టుకున్నట్లు తన పక్కనే పడుకున్న వాడి జుట్టులోకి వేళ్ళుపోనిచ్చి ఆప్యాయంగా
నిమురుతూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది సుశీల......
"ఏమిటి?" అన్నాడు బాలూ...
"ఏంలేదు. నేను చెప్పినా మీరు నమ్మరు."
బాలూ
నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నారు?"
"నేను నమ్మటం వలన నీకు లాభంగాని. నమ్మకపోవటం వలన కలిగే నష్టం గాని ఏమైనా
ఉందా!"
"ఉంది మీరు నమ్మగలిగితే నాకు ఆనందం
కలుగుతుంది."
"అయితే చెప్పు!"
"ఎందుకు? నా ఆనందంకోసం
నమ్మినట్లు అబద్దమాడతారా?"
"ఎంతపిచ్చిదానివి? మా ఆనందంకోసం మీరు అబద్దాలాడవలసిందేకాని, మాకేంకర్మ! మేం నిర్భయంగా నిజాలు చెప్పగలిగేచోటు ఇదే!"
సుశీల ఒక నిట్టూర్పు విడిచింది-నిదానంగా అంది. "పాతివ్రత్యం అంటే నాకు తెలియదు. పతివ్రతగా ఉండే అవకాశమూ రాలేదు. కానీ మీరు నాకు తెలిసిన తరువాత...ఇంకెవరితోనూ గడపలేకపోతున్నాను. మరొకరి చెయ్యినామీదపడితే నరకం
అనుభవిస్తున్నాను..."
బాలూ ఏ సమాధానమూ చెప్పలేదు. 'నామాటలు నమ్మరా?' అని సుశీల అడగలేదు...
సుశీల పక్కన పడుకున్న బాలూ చటుక్కున
లేచాడు సుశీల బిత్తరపోయి చూస్తూ ఉండగానే తన జేబులోంచి నోట్లు తీసి సుశీలకిచ్చాడు...
"ఇవి దేనికి?"
"నేను మళ్ళీ పదిహీనురోజులకి గాని రాను. అప్పటివరకూ మిగిలిన నర్సుల బారినుండి
నువ్వు తప్పించుకోవటానికి..."
"ఈ డబ్బు మీరు నాకిచ్చినంత మాత్రాన
మిగిలినవాళ్ళను నేను రానియ్యనని నమ్మకమేమిటి?"
బాలూ గట్టిగా నవ్వాడు. అప్పుడప్పుడు అతను అలాగే నవ్వుతాడు. ఎదుటి వాళ్ళ తెలివితక్కువతనాన్ని చూసి
జాలిగా నవ్వుతున్నట్లు ఉంటుంది అది. ఆ నవ్వంటే సుశీలకు చాలా ఇష్టం...
"నేను ఈ డబ్బు ఇచ్చింది నిన్ను నాతో
ఉంచుకోవటానికి కాదు. నువ్వు నరకం అనుకునే దానినుండి
తప్పించుకోవటానికి..."
"ఒకవేళ నేను మిమ్మల్ని మోసంచేస్తున్నానేమో!"...
"అయినా బాధలేదు. నేను ఈ డబ్బు మోసంతో సంపాదించినదే!"
"నేను నమ్మను? మీరు మోసం చెయ్యరు!"
"నీ కెలా తెలుసు?"
"మీరు మంచివారు! ఆ మాట మీ ముఖంమీద స్పష్టంగా వ్రాసి ఉంది..."
మనసు కలుక్కుమంది బాలూకు! అందరూ ఇదే పాట! నువ్వు మంచివాడివి అని...'కాను...కాను...కాను' అని అతడు ఎంత మొత్తుకున్నా ప్రయోజనం
లేకపోతోంది. తను మంచివాడుకాదు! ఏ మాత్రమూ కాడు! మరి, తన ముఖం ఎందుకు మంచివాడి ముఖంలా ఉండాలి? తను ఇంకా ఎంత చెడ్డవాడైతే తన ముఖం చెడ్డవాడి ముఖంలా తయారవుతుంది? "నన్ను ఎన్ని తిట్లు తిట్టినా సహిస్తాను. కాని, 'మంచివాడు' అని మాత్రం అనకు..."
చిరునవ్వుతోనే శాసిస్తున్నట్లుగా అన్నాడు. బాలూలో సుశీలకు వింతగా అనిపించేది అది
ఒకటి..... ఉండుండి అతనేదో శాసిస్తున్నట్లు అంటాడు. చిరునవ్వుతోనే అంటాడు. అయినా ఆ మాట కాదనటానికి మాత్రం ఎవరికీ
దమ్ములుండవు.
"నమ్మాను!"
"ఒక వేశ్యను! డబ్బుకోసం ఎలాటి మాటలైనా మాట్లాడగలిగిన
దానిని నా మాటలు నమ్మగలిగారా?"
"నమ్మగలిగాను - నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని
అర్ధంచేసుకున్నాను గనక..."
సుశీల ముఖం వింతకాంతితో వెలిగింది.
"నేను మిమ్మల్ని...సరే, ఎప్పుడు అర్ధంచేసుకున్నారు?"
"నీకు నేను 'సుశీల' అని పేరుపెట్టిన రోజు..." సుశీల మనసు ఆనందంతో నిండిపోయింది.
బాలూ అందగాడు. బాహ్య సౌందర్యాలకు మురిసిపోయే దశ ఏనాడో
దాటి పోయింది సుశీలకు. ఇప్పు డావిడకు, అందగాడూ, వికారీ...అందరూ ఒకటే! బాలూ తరచు వచ్చేవాడుకాదు-నెలకొకసారి వస్తే గొప్ప....వచ్చినప్పుడల్లా సుశీల
దగ్గరకే వచ్చేవాడు.
సుశీల ఒకసారి సరదాగా "ఎప్పుడూ నాదగ్గిరకే వస్తారు. నేను అంత అందంగా ఉంటానా?" అంది.
"నీకంటే అందమైన వాళ్ళను లక్షమందిని చూసాను!"
"మరి?..."
"నీలో ఏదో పోలిష్డ్ నేచర్ ఉంది. బహుశః పెద్దింటి పిల్లవు అయివుంటావు..."
"ఓహో! పెద్దింటి పిల్లననే గౌరవంతో వస్తున్నారా?" అక్కసుగా
అంది.
"కాదు. నీ దగ్గర మరొక మనిషితో....సాటి మనిషితో కాలం గడిపిన సంతృప్తి కలుగుతోంది నాకు-అందుకని వస్తున్నాను..."
తెల్లబోయి చూసింది సుశీల....'సాటి మనిషితో కాలం గడపగలిగిన సంతృప్తి....సాటి మనుష్యులతో కాలం గడపగలిగే అవకాశం ఇతనికి
లేదా? ఇంత డబ్బున్న ఆసామికి....'
మరొకసారి బాలూ సుశీలను దగ్గరకు
అదుముకోబోతోంటే 'అబ్బా' అంది సుశీల.
"ఏం?" అన్నాడు బాలూ.
"ఉదయం జారిపడ్డాను. నడుము కొద్దిగా పట్టింది. ఫరవాలేదులెండి!"
సుశీల తనే దగ్గరగా రాబోయింది. బాలూ సుశీల చేతులు మృదువుగా తొలగించి "నిద్రపో? నిద్రలో అదే సర్దుకుంటుంది" అన్నాడు.
తెల్లబోయింది సుశీల.
"అయితే మీ డబ్బు మీ కిచ్చేస్తాను."
"నేను వెళ్ళిపోవటంలేదు. ఇక్కడే ఉంటాను. అంచేత ఆ డబ్బు తీసుకోలేను..."
అటువైపు తిరిగి కొన్ని క్షణాలలోనే హాయిగా నిద్రపోయాడు
బాలూ.
నిద్రపోతున్న బాలూను చూసిచూసి నెమ్మదిగా
అతనికి మెలకువ రాకుండా మీద చెయ్యివేసింది సుశీల. తనంత తానుగా ఎవరినైనా ఆపేక్షతో స్పృశించటం, చాలా రోజుల తరవాత అదే మొదటిసారి సుశీలకు.
మూడు గంటలకు ఎవరో లేపినట్లు లేచి
కూచున్నాడు బాలూ.
సుశీల నవ్వి "న్నెఉ మిమ్మల్ని లేపకూడదని అనుకున్నాను..." అంది.
"నువ్వు నిద్రపోలేదా?"
బాలూ జాలిగా చూశాడు.
"పాపం! మమ్మల్ని ఆనందపెట్టడానికి ఎంత త్యాగం
చేస్తున్నారు మీరు!"
నిర్ఘాంతపోయింది సుశీల.
తమ వృత్తిని గురించి ఇంతవరకూ ఎందరెందరో
ఎన్నెన్ని రకాల మాటలో అన్నారు. కొందరు సమాజానికి చీడపురుగులని అన్నారు. మరికొందరు జలగలని అన్నారు. కొందరు ఉదారులు సానుభూతి చూపి, జాలిపడ్డారు. కాని 'త్యాగం' అనే మాట మాత్రం
ఇంతవరకూ ఎవ్వరూ వాడలేదు.
"ఏమన్నారు? మళ్ళీ అనండి!" అంది.
"ఏమో! మరచిపోయాను!" నవ్వి వెళ్ళడానికి లేచాడు
బాలూ.
సుశీల మంచంమీదనుంచి లేచి బాలూ రెండు
చేతులూ పట్టుకుని కళ్ళకద్దుకుంది.
బాలూ తన చేతులకయిన తడిని చూసుకున్నాడు. సుశీల చెమ్మగిల్లిన కళ్ళను చూశాడు. తలవంచుకుని వెళ్ళిపోయాడు.
అప్పటినుండే సుశీల మనసు బాలూ రాకకోసం
ఆరాటంతో ఎదురుచూడసాగింది. అతడు వెళ్ళిపోతుంటే 'అప్పుడేనా?' అనిపించేది. అయినా నోరు విప్పి ఏమీ మాట్లాడేదిగాదు. తనలాటి వ్యక్తి నోట ప్రేమ సంభాషణలు ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో ఊహించలేని
వ్యక్తికాదు సుశీల. అంతేకాదు, వెనకటిలా కృత్రిమపు అల్లరి మాటలు కూడా
మాట్లాడలేకపోతోంది.
"నీ పేరేమిటి?" అన్నాడు ఒకనాడు బాలూ.
"మాకు ఒక పేరని ఏముంది? ఇక్కడికి వచ్చే మీరంతా మీ వివరాలు చెప్పరు-మా వివరాలు అక్కర్లేదు. ఎవరికీ కావలసిన పేరుతో వాళ్ళు పిలుచుకుంటారు. రాణీ అనో జానీ అనో...మీరే చెప్పండి. నాకు ఏపేరు పెడతారో..."
"నాకు మూడ్ వచ్చినప్పుడు పెడతాను.
ఇప్పుడు కాదు?"
రానురాను సుశీల మనసు మరీ బాలూతో
నిండిపోసాగింది. అతడు తన దగ్గర ఉండే కొద్దిపాటి సమయంలో
అతనికి తన దగ్గర ఉన్నదంతా...ఇంకా...ఇంకా ఎలా అర్పించుకోగలవా అని ఆరాటపడేది.
బాలూ చేతిని తన చెక్కిలి కానించుకుని
తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న సుశీలను చూసి "నీకు పేరు పెడతాను" అన్నాడు బాలూ.
"పెట్టండి.?"
"సుశీల!"
ఉలిక్కిపడింది సుశీల.
"నన్ను వెటకారం చేస్తున్నారా?"
"లేదు! లేదు! నిన్ను నిజంగా అలా పిలుచుకోవాలని అనిపించింది."
సుశీల వెక్కివెక్కి ఏడ్చింది. సుశీల ఏడుపు మరిచిపోయి ఎన్నో రోజులయింది అన్ని రోజులుగా పేరుకున్న
దుఃఖమంతా పొంగివచ్చింది.
"ఒకప్పుడు నేను నిజంగా ఆ పేరుకు తగినదానినే
ఒక దుర్మార్గుడు అమాయకురాలిని నన్ను ప్రేమ పేరుతో మోసగించాడు. గుళ్ళో స్నేహితులందరి ముందూ పెళ్ళి కూడా
చేసుకున్నాడు. ఆ తరువాత ఈ ఊరు తీసుకొచ్చి ఈ బ్రోతల్ కి అమ్మేసాడు. ఎన్నెన్నో ప్రణయ కలాపాలకూ, అంతులేని వాగ్దానాలకూ తీయని అనునయాలకూ
మూల్యం ఇది!"
"బాధపడకు! పోనీ, ఇప్పుడు బయటపడాలని అనుకుంటున్నావా?"
"ఇప్పుడా? ఎందుకు? ఆ బయటి సమాజంలో బాధలకంటే ఈ బ్రతుకే నయం! చెడిపోయినదాన్ని అని నన్ను తరిమి తరిమి
పీక్కు తినరూ! మీరు 'సుశీల' అంటున్నారు..."
"నాకు మాత్రం నువ్వు సుశీలవే! అంతకంటే నే నేంచెయ్యగలను?"
"ఏం చెయ్యలేరూ? మీరు మంచివారు. చదువూ, సంస్కారమూ ఉన్నవారు. ఇప్పటికైనా అలాంటి దుర్మార్గుల్ని నాశనం
చెయ్యలేరూ? సమాజంలో జరుగుతోన్న
అన్యాయాలను ఎదుర్కోలేదూ?"
బాలూ ముఖం పాలిపోయింది.
తను సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను
ఎదుర్కోగలడా అంత శక్తి తనకు ఉంటే...
*
* *
బాలూ కమర్షియల్ టేక్స్ ఇనస్పెక్టరయ్యాడు.
ఇంచుమించు ప్రతి ఒక్కరూ అతని అదృష్టానికి అసూయపడుతూ కంగ్రాట్యులేట్ చెయ్యసాగారు. బాలూ ఆశ్చర్యపడుతూ "ఇది మామూలు ఉద్యోగమే కదా! అందులో అంతగా అభినందించవలసింది ఏముంది!" అన్నాడు.
"చాల్లేవయ్యా! ఉద్యోగం మామూలుదే కానీ ఈ మామూలు ఉద్యోగంలో
వచ్చే మామూళ్ళు మాత్రం మామూలుగా ఉండవు-" అని వచ్చింది సమాధానం...
లంచాలుపట్టే అవకాశం ఉన్న ఉద్యోగం దొరకటం
అదృష్టంగా భావించటం...ఆ విషయాన్నీ బాహాటంగా ప్రకటిస్తూ
అభినందించటం... ఇంకా పూర్తిగా బండబారని బాలూ మనసుకు
విడ్డూరంగానే తోచింది. తనను అభినందించే ఇందరిలో ఒక్కరికైనా 'లంచం పట్టని వాళ్ళుకూడా ఉండవచ్చు-" అనే ఊహకూడా రావటంలేదు.
ఉద్యోగంలో చేరాక ఈ లంచాలు తీసుకోవడం ఎంత 'మామూలు' విషయమో మరింత బాగా అర్ధంకాసాగింది బాలూకు.
మొదటిసారి బాలూ ముఖం చిట్లించుకుని "నా దగ్గర ఈ ప్రస్తావన తేకండి" అన్నప్పుడు అవతలి వ్యక్తి బాలూ లంచం వద్దని అంటున్నాడని ఊహించుకోలేక పోయాడు.
"ఈ రేటు మీకు గిట్టుబాటు కాదా? పోనీ మీ మనసులో ఏముందో చెప్పండి-ఆలోచిద్దాం;" అన్నాడు దర్జాగానే.
"దయచేసి మరొకసారి ఇలాటి మాటలు మాట్లాడకుండా
వెళ్ళిపోండి-లేకపోతే ఈ వ్యవహారం చాలా దూరం వెళ్తుంది." అన్నాడు కోపంగా.
అప్పటికి అవతలి వ్యక్తి కొంచెం ఆశ్చర్యంగా
"మీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెపితే..." అంటూ నాన్చాడు.
"గెటవుట్" అని అరిచాడు బాలూ గట్టిగా, ఆఫీస్ ప్రతిధ్వనించేలా...
అప్పటికికాని ఆ పెద్దమనిషికి బాలూ నిజంగా
లంచం వద్దంటున్నాడని అర్ధంకాలేదు-అర్ధమయ్యేక "వెధవ్వేషాలు!" అని సణుక్కుంటూ వెళ్ళిపోయాడు బాలూ
మామూళ్ళు తీసుకునే మనిషి కాదని అందరికీ తెలిసిపోయింది. అందరికీ బాలూ అంటే ఒక చులకన భావం
ఏర్పడిపోయింది-అంతటా అవినీతి విచ్చల విడిగా
నాట్యంచేస్తున్న మాట నిజమే! కానీ ఇటీవల కొందరు పనికిమాలిన అధికారులు
బాలూ లాంటి పైత్యకారులూ....అవినీతిని నిర్మూలించటానికీ...లంచగొండులను పట్టుకోవటానికీ కూడా
పూనుకుంటున్నారు! బాలూ లాంటి వాళ్ళ మూలంగా పట్టుబడితే
పరువుపోతుంది. ఉద్యోగమూ పోతుంది
.
ఒకసారి బాలూకు కొంచెం తలనొప్పిగా ఉండి ఫ్యూన్ ని కాఫీ తెమ్మన్నాడు. "నేను తేలేను సార్! అది పావని కాదు!" అన్నాడు వాడు విసురుగా.
పక్కకు వెళ్ళి బాలూకు వినపడేలాగానే "రూపాయి మామూలు దక్కనియ్యడు కాని కాఫీ కావాలట, కాఫీ..." అన్నాడు అక్కసును.....మిగిలిన వాళ్ళంతా ఘోల్లున నవ్వారు...
తనను చూసి ఎందురు నవ్వుతున్నారో బాలూకు తెలుసు-ఎందుకు నువ్వుతున్నారో అర్ధంకావటంలేదు.
మొదటి నెల జీతం అందుకుని తల్లి చేతిలో పెట్టినప్పుడు బాలూ ఆనందానికి అంతులేదు-అతనికి ఈ లోకంలో ఉన్నది తల్లి ఒక్కత్తే!
బాలూ తల్లి అందమైనదే! గుణవంతురాలు కూడా! అయినా బాలూ తండ్రి మరొకతను తెచ్చుకున్నాడు -బాలూతల్లిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. ఈ కథ తల్లినోటనే విన్నాడు బాలూ. ఆ సంగతి చెప్తున్నప్పుడు బాలూ తల్లి ఏనాడూ భర్తను నిందించేది కాదు....ఏదో కథ చెప్తున్నట్లు చెప్పేది-ఆ తర్వాత బాలూ తల్లి అన్నగారి పంచనచేరింది. అన్నగారికీ, వదినగారికీ కూడా బాలూతల్లిపట్ల ఎలాంటి ఆదర భావమూ లేదు. ఆర్ధికంగా బాలూ తల్లి అన్నమీద ఆధారపడిలేదు-ఆవిడ సంగీతం నేర్చుకుంది. మెట్రిక్ పాసయింది. భర్త దగ్గరనుండి విడిపోగానే ఒకస్కూల్ లో సంగీతం టీచర్ గా చేరింది-తన మావ, అత్త అనే మాటలు భరించలేక, బాలూ "అమ్మా, ఇక్కడినుండి వెళ్ళిపోదాం!" అనేవాడు జ్ఞానం వచ్చిన దగ్గరనుండే...
"వద్దు బాలూ! వయసులో ఉన్న ఆడదాన్ని ఒంటరిగా ఉండటం మంచిది కాదు-ఎన్ని గొడవలున్నా మనం మామయ్య దగ్గరే ఉండాలి?" అనేది.
బాలూ చదువు విషయంలో తల్లి ఏమాత్రమూ అశ్రద్ద చెయ్యలేదు-చదువు కోవటంలో బాలూకూడా అశ్రద్ద చెయ్యలేదు.
అన్న పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక, బాలూ ప్రయోజకుడయ్యాక, వృద్దాప్యం మీదపడ్డాక అప్పుడు అన్నదగ్గరనుండి విడిపోయింది బాలూతల్లి...
తల్లి చేతిలో తన జీతమంతా పెట్టిన ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు బాలూకి. ఆ మరునాడే తల్లి అందమైన నూటుబట్ట బాలూకోసం కొని తెచ్చింది.
"చూడు! బాగుందా?" అంది.
బాలూ చాలా బాధపడ్డాడు...
"అలా అయిపోయావేం? నా సెలక్షన్ నీకు నచ్చలేదా?" చిరునవ్వుతో అంది. అతడు ఎందుకు బాధపడుతున్నాడో అర్ధమయినా...
"అది కాదమ్మా! నిన్ను చీరలు కొనుక్కోమన్నాను..."
"అన్నావు-నాకు సూటుగడ్డ కొనాలనిపించింది, నేను స్వార్ధపరురాలినిరా! నా ఆనందమే నాకు ప్రధానం..." నవ్వుతూ అంది బాలూ తల్లి.
చిన్నప్పటినుండి కష్టాలనే అనుభవిస్తూ చిరునవ్వు నవ్వుతోన్న ఆ "స్వార్ధ పరురాలి' ముఖంలోకి చూస్తూ మరేమీ మాట్లాడలేకపోయాడు బాలూ.
తన తల్లి కళ్ళలో ప్రతిఫలిస్తోన్న ఆనందం....అది చాలు అతనికి!.
సేఠ్ రమణ్ లాల్ పేరు తెలియనివాళ్ళు ఉండరు-అతనికి అనేక రకాల వ్యాపారాలున్నాయి. లెక్కలేనన్ని మేడలున్నాయి. అందమైన కార్లు ఉన్నాయి-
అలాంటివాడు బాలూ దగ్గరకొచ్చాడు.
మొట్టమొదట అందరూ ఈర్ష్యపడ్డారు-కానీ మరుక్షణం బాలూ స్వభావం గుర్తుకొచ్చి స్థిమితపడ్డారు.
బాలూ జ్ఞానవంతుడే కాని లోకజ్ఞానం లేనివాడు-రమణ్ లాల్ పేరు విన్నాడు-అతని పలుకుబడి గ్రహించాడు-కానీ, అతన్ని ఎదిరిస్తే ఏమవుతుందో మాత్రం తెలుసుకోలేకపోయాడు.
అందరి ముందు లాగనే అతనిముందు తల అడ్డంగా ఆడించాడు.
రమణ్ లాల్ బాలూను పరిశీలనగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు.
"నా పని నేను ఎలా అయినా సాధించగలను-చిన్నవాడివని దయతో చెప్తున్నాను-మరొకసారి ఆలోచించు..."
"ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదండీ! ఇలాంటి పనులు నావల్ల కాదు!"
కచ్చితంగా చెప్పాడు బాలూ.
రమణ్ లాల్ విసుగ్గా దర్జాగా వెళ్ళిపోయాడు. తర్వాత రమణ్ లాల్ కమర్షియల్ టేక్స్ ఆఫీసర్ నే డైరెక్టర్ గా కలుసుకున్నాడు. అతని పని నిముషాలలో తెమిలిపోయింది. బాలూ విషయం సూచనగా ఆఫీసర్ తో అన్నాడు రమణ్ లాల్.
ఆ తర్వాత కొంచెం రోజులలోనే బాలూమీద విపరీతంగా లంచాలు తీసుకుంటున్నాడని నేరం మోపబడింది. ఆఫీస్ లో అందరూ ఏకగ్రీవంగా బాలూ లంచగొండి అని సాక్ష్యం చెప్పారు. బాలూను ఉద్యోగంలోంచి డిస్ మిస్ చేసారు...
"బాలూ! నువ్వు లంచం తీసుకున్నావా? అడగలేక అడగలేక అడిగింది తల్లి...ఎంత శాంతంగా అడిగినా ఆవిడ కంఠధ్వనిలో బాధ
స్పష్టంగా వినిపిస్తోంది.
"లేదమ్మా లేదు! నేను ఎప్పుడూ ఏ అన్యాయమూ చెయ్యలేదు..."
అంతవరకూ పరిస్థితులను ఎంతో స్థైర్యంగా
ఎదుర్కొన్న బాలూ కన్నీళ్ళతో దీనంగా అన్నాడు.
కదిలిపోయింది తల్లి...
"ఫరవాలేదులే బాబూ! నువ్వు నిజాయితీగా ఉన్నావు. అంతే చాలు! మరొక ఉద్యోగం దొరుకుతుందిలే" అంది. కానీ అది అంత తేలిక కాదని బాలూ అనుభావంతో
తెలుసుకున్నాడు. చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకున్నాడు, అదీ బ్లాక్ మార్క్ తో మరొక ఉద్యోగం
ఎవరిస్తారు?
అతను దారిలో వెళ్తోంటే "అదిగో, అతని గురించే మొన్న పేపర్లో పడింది. లంచాలు తీసుకోవటం వల్ల ఉద్యోగం పోయిందిట!" అని స్పష్టంగా బాలూకి వినిపించేలాగ చెప్పుకునేవారు.
"మంచి పని జరిగింది. ఇలా పదిమందికి జరిగితేకాని దేశంలో
లంచగొండితనం పోదు," అని సంతోషిస్తూ నీతినిజాయితీల పట్ల తమకు గల అభిమానాన్ని ప్రకటించుకునేవారు.
మూడు నెలలు గడిచిపోయాయి. ఉద్యోగం దొరకలేదని బాధ...సమాజంలో వెలివేసినట్లు చూడబడుతున్నానని బాధ....ఆర్ధికమైన ఇబ్బందులకు తట్టుకోలేక బాధ. అన్ని బాధలనూ మించిన బాధ...తన తల్లి కళ్ళలో దైన్యం చూడలేని బాధ...
తట్టుకోలేకపోయాడు బాలూ...తిన్నగా రమణ్ లాల్ దగ్గరకు వెళ్ళాడు. బాలూను చూసి ఆశ్చర్యపోయాడు రమణ్ లాల్
"ఇదేమిటి? నా దగ్గరకు ఎందుకు
వచ్చారు?"
"మీ మూలంగానే నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు నాకు మీరే ఉద్యోగం ఇప్పించాలి?"
"అప్పుడు మీరు నామాట వినలేదు. ఇప్పుడు నేను మీకు ఎందుకు సహాయం చేస్తాను?"
"మీరు సహాయం చెయ్యగలరు, చేస్తే ఈసారి మీమాట కాదనను ఎలాంటి దైనా సరే! ఏ సందర్భంగా అయినా సరే!"
రమణిలాల్ కళ్ళు మెరిసాయి...
"సరిగా ఆలోచించుకుని అంటున్నాణు. నేను ఇంతవరకూ అబద్దాలాడలేదు..."
"ఇంకముందు నేను అబద్దాలే ఆడమంటే?"
"ఆడతాను!"
"గుడ్! మీకు నేను ఉద్యోగం ఇయ్యగలను. జీతం కూడా చాలా ఉంటుంది. మీరు ఆశించినదానికంటే....మీ డిగ్రీతో సంపాదించ గలిగిన దానికంటే చాలా చాలా ఎక్కువగా ఉంటుంది..."
"థాంక్స్!..."
"ఆగండి ఈ ఉద్యోగంలో మీరు ఒకచోట స్థిరంగా
ఉండరు. ఈ ఊరు నుంచి ఆ ఊరికి తిరుగుతూ ఉండాలి."
బాలూ ఒక్క క్షణం సమాధానం చెప్పలేకపోయాడు.
"ఏం? ఇష్టంలేదా?"
"ఇష్టమే!"
"ఊళ్ళవెంట తిరిగేటప్పుడు మీరు ఒంటరిగానే
ఉండాలి. మీకు అప్పుడప్పుడు ఆఫ్ వస్తూ ఉంటుంది, అప్పుడు మాత్రమే కుటుంబాలతో ఉండవచ్చు..."
తను ఒక్కరోజు కనపడకపోయినా తల్లడిల్లిపోయే
తల్లి ముఖం కళ్ళముందు మెదిలింది బాలూకి...
"ఏం? ఈ ఉద్యోగం వద్దా?"
"కావాలి?"
"మరొక మాట? మీరు ఎక్కడెక్కడ
తిరుగుతారో ఆ చిరునామాలన్నీ మీ ఇంట్లోవాళ్ళకి తెలియకూడదు ...ఏదో ఒక హోటల్ అడ్రస్ ఇస్తాము. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఆ అడ్రస్ కే జరగాలి..."
"అలాగే?"
"ఎక్కడ ఏ కొంచెం హెచ్చుతగ్గు వచ్చినా మీకే
ప్రమాదం?"
"ఆ భయం అక్కర్లేదు. మరోసారి ఎలాంటి ప్రమాదంలోనూ చిక్కుకోను!"
రమణ్ లాల్ పకపక నవ్వాడు.
బాలూ తల్లికి బాలూ ఉద్యోగం ఏ విధంగాను
సంతోషాన్ని కలిగించలేదు.
"నిన్ను విడిచి నేను ఉండలేను బాలూ!" అంది
కన్నీళ్ళతో.
"తరచు సెలవులు వస్తూ ఉంటాయమ్మా! అప్పుడు మనం కలిసే ఉండవచ్చును..."
"ఏమో!" కృంగిపోతూ అంది...
అంతకంటే కృంగిపోతున్నాడు బాలూ...
"అమ్మా! నువ్వు గట్టిగా
వద్దు అంటే నేను వెళ్ళను. ఈ ఉద్యోగం కూడా వదులుకోమని అనకు..."
"వద్దు! వద్దు! ఇది వదులుకోకు! వెంటనే చేరిపో! నువ్వన్నట్లు సెలవులు ఇవ్వగానే కలుసుకోవచ్చును..."
ఆలోచనల కన్నింటికీ స్వస్థిచెప్పి రమణ్
లాల్ దగ్గిరకు వచ్చేసాడు బాలూ...
రమణ్ లాల్ కు స్మగ్లింగ్ వ్యాపారాలు చాలా
ఉన్నాయి. ఆ గేంగ్ లో బాలూని కూడా చేర్చుకున్నాడు. విషయం అర్ధమయ్యాక కూడా బాలూ పెద్దగా బాధపడలేదు. మంచికీ చెడ్డకీ అతనికి భేదం లేకుండా పోయింది. తను చాలా డబ్బు సంపాదిస్తాడు. తన తల్లిని చివరిరోజులోనయినా సుఖపెడ్తాడు. అది చాలు...
తన చేతికి డబ్బురాగానే తల్లికి మనియార్డర్
చేసాడు...ఇంచుమించు నెలరోజుల తర్వాత ఆ మనియార్డర్ బాలూకే తిరిగివచ్చింది....నిర్ఘాంతపోయాడు బాలూ. ఏమయిపోయింది తన తల్లి? ఇంటికి వెళ్ళాడు. తను వెళ్ళగానే తల్లికి జబ్బుచేసిందనీ
మేనమావ తీసికెళ్ళాడనీ తెలిసింది. హోటల్ వాళ్ళకి మేనమావ అడ్రస్ తెలీదు. తెలుసుకోవలసిన అవసరం వాళ్ళకు లేదు. అందుకే డబ్బు తిరిగి వచ్చింది.
మేనమావ దగ్గరకు వెళ్ళాడు. బాలూను చూస్తూనే మండిపడ్డాడు మేనమావ...
"ఆహా! ఏం సుపుత్రుడివిరా నాయనా! ఎంత తీరిగ్గా వచ్చావు?" అన్నాడు.
"అమ్మ ఏది?"
"ఇంకెక్కడి అమ్మ? తల్లి చావుబ్రతుకులలో ఉంటే పత్తా తెలియకుండా పోయావు. ఏం ఉద్యోగంరా, బోడి ఉద్యోగం. మీ అమ్మ నిన్ను కలవరించి కలవరించి ప్రాణాలు
వదిలింది. చివరికి కర్మలు కూడా నేనే చెయ్యవలసి
వచ్చింది..."
'అమ్మ చచ్చిపోయింది...' బాలూ మనసు హోరుమంటుంది. అతనికి కన్నీళ్ళు రావటంలేదు. అలా కూర్చున్నాడు. మేనమావా కంగారుపడి కుదుపుతూ "బాలూ!" అన్నాడు.
"అమ్మ ఎలా పోయింది?"
"దరిద్రులంతా ఎలా పోతారో అలాగే!
రెండుమూడు నెలలుగా నీకు ఉద్యోగం లేదటగా! ఉన్నదేదో నీకు పెట్టి తను ఉపవాసాలు
చేసిఉంటుంది. బాగా నీరసించింది. గుండెనొప్పి వచ్చింది. దానికి తోడు నీకోసం మనోవ్యధ..."
బాలూ కూచున్నచోటినుంచి లేచి బయలుదేరాడు.
"ఎక్కడికిరా?" అన్నాడు మేనమావ.
వెనక్కు తిరిగకుండానే "శ్మశానానికి!" అన్నాడు బాలూ.
మేనమావ విసుక్కుని ఊరుకున్నాడు. బాలూ శ్మశానంలో తన తల్లి తగలబడిన చోటు
చూశాడు. అక్కడి మంటలను చూస్తూ అక్కడే
కూర్చుండిపోయాడు.
మరునాడు పీక్కుపోయిన ముఖంతో ఇంటికివచ్చిన
బాలూనుచూసి "స్నానం చేసి భోజనానికి రా!" అన్నాడు మేనమావ ముఖం చిట్లిస్తూ.
"నేను వెళ్ళిపోతున్నాను."
"వెళ్ళు!"
"చిన్నమాట!"
"స్నానం చెయ్యకుండా నేను నిన్ను ముట్టుకోను!"
"ముట్టుకోకుండా ఈ డబ్బు తీసుకో!"
డబ్బుమాట వినగానే మేనమావ గభాలున ముందుకువచ్చాడు. డబ్బుకు మైలలేదు.
బాలూ ఇచ్చిన డబ్బు ఆత్రంగా లెక్కపెట్టుకుని నిర్ఘాంతపోయాడు.
రెండువేలు!
"వద్దురా బాలూ! నామీద ఇంత అభిమానం చూపించకు. అందుకు నేను
అర్హున్ని కాను."
"నా తల్లిని చివరిరోజులలో ఆదుకున్నావు. అంతకంటే ఏం చెయ్యాలి
మావయ్య!"
"ఒరేయ్ బాలూ! నీ ముందు అబద్ద మాడలేకపోతున్నానురా! మీ అమ్మను, నాచెల్లెలిని నేనేం
ఆదుకున్నానురా! దానికి పళ్ళూ, పాలూ, టానిక్కులూ ఇచ్చి మంచి వైద్యం
చేయిస్తే బ్రతికేదేమో! అవన్నీ నేనెక్కడ తేగలనురా!"
"అయితే అమ్మ పోషణలేక, సరిఅయిన వైద్యంలేక
చచ్చిపోయిందంటవా మావయ్యా?"
"అక్షరాలా అంతేరా! చచ్చిన దానిమీద అబద్దాలాడి నీ డబ్బు
గుంజుకో లేను. నీ డబ్బు నువ్వే తీసుకో!"
"వద్దులే మావయ్యా! ఉంచుకో! ఆడబ్బు దగ్గరపెట్టుకుని నేను
బ్రతకలేను!"
"ఎంత మంచివాడివిరా!"
"ఆ మాట మాత్రం అనకు మావయ్యా!" కసురుతున్నట్లు ఆని చర చర
వెళ్ళిపోయాడు బాలూ.
ఎవరైనా తనను 'మంచివాడు' అంటే మాత్రం సహించలేడు సుశీల
మళ్ళీ ఆ మాట అనగానే "నీకు తెలియదు. నేను చాలా దుర్మార్గున్ని" అన్నాడు.
"నేను నమ్మను. ఒకవేళ మీరు ఏదైనా కానిపని చేసినా అది
పరిస్థితుల ప్రభావంవల్ల కావచ్చు."
విరగబడి నవ్వాడు బాలూ.
"మైడియర్! 'మంచివాడు' అని తేలిగ్గా అనేస్తారు.మంచివాడు
కావటం మాటలుకాదు. అందుకు చాలా చాలా శక్తి కావాలి! పరిస్థితులు సవ్యంగా ఉంటే అందరూ
మంచివాళ్ళే! ప్రతికూలించినప్పుడే వ్యక్తిత్వాలు పరీక్షకు వచ్చేది- మంచి అంటే ఏమిటో
అర్ధంచేసుకుని...మంచిగా బ్రతకాలనుకొని....చివరకు పరీక్షకు నిలబడలేనివాళ్ళే హీనులు; హీనాతిహీనులు!"
తనను తను శపించుకొంటున్నట్లు కసిగా అన్నాడు బాలూ
* * *
"మిస్ నీరజా! మిమ్మల్ని సిస్టర్ ట్రోజా రమ్మంటున్నారు."
అటెండర్ వచ్చి చెప్పింది. టీచర్స్ రూంలో కూచుని పిల్లల హోంవర్కులు చూస్తున్న నీరజ
ఆశ్చర్యంగా "నన్నా?" అంది.
సిస్టర్ ట్రోజా ఆ కాన్వెంటులో హెడ్ మిస్ట్రెస్ గా ఉన్నారు తగినంత
ప్రత్యేకమైన కారణముంటే తప్ప తన గదిలోకి ఎవ్వరినీ పిలిపించుకోదు.
"మిమ్మల్నే! నాకు చెవుడులేదు!" చికాగ్గా అని
వెళ్ళిపోయింది అటెండర్.
పిల్లల హోంవర్క్ పుస్తకాలు షెల్ఫ్ లో సర్ది సిస్టర్ ట్రోజా రూంలోకి
వెళ్ళింది నీరజ...
సిస్టర్ ట్రోజా నీరజను చూడగానే అనవసరంగా కంగారుపడుతూ "రా! రా!
కూర్చో" అంది, అలవాటుకు
మించిన ఆదరంతో.
నీరజ వచ్చి కూర్చుంది.
"మిస్ నీరజా! నువ్వు చాలా సిన్సియర్ టీచర్ వి. పిల్లలకు కూడా
నువ్వంటే చాలా యిష్టం. పిల్లల మనస్సులో అలాంటి స్థానాన్ని పొందగలిగిన టీచర్లను
నేను చాలా గౌరవిస్తాను."
సిస్టర్ ట్రోజా పొగుడుతోంది. కాని ఆవిడ ముఖభంగిమ మాట్లాడుతూన్న
ధోరణి ఏదో సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లుగా ఉన్నాయి.ఒక టీచర్ని పనికట్టుకుని పిలిపించి
ఇలా పొగడటం కూడా ఆవిడ స్వభావానికి విరుద్దమే? దడదడలాడుతున్న గుండెలతో ఆవిడ
చెప్పబోయేదానికోసం ఎదురు చూస్తూ కూచుంది. సిస్టర్ నీరజముఖంలోకి ఒకసారి చూసి
చూడలేనిదానిలా ముఖం తిప్పుకుని మళ్ళీ ప్ర్రారంభించింది.
"ఇటీవల మన కాన్వెంట్ పరిసరాలలో పోలీసులు తిరుగుతున్నారు.
పోలీసు ఆఫీసర్ మురళి వాళ్ళను నియమించాడని తెలిసింది. మురళిగారితోనే
మాట్లాడాను..." ఒక్క నిముషం ఆగి గొంతు సవరించుకుంది సిస్టర్...మురళి పేరు
వినగానే నీరజ రక్తం చల్లబడిపోయింది. సిస్టర్ గబగబ చెప్పుకుపోసాగింది.
"నీ గురించి చెప్పారు. నడిబజారులో నిన్ను టాక్సీలో
తీసుకుపోగలిగిన ఆ గూండాలు చాలా సమర్దులయి ఉండాలి అన్నారు. అంతకంటే విడ్డూరం నువ్వు
వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకు రావటం అంటున్నారు. నువ్వు వాళ్ళను కలవటమో...వాళ్ళు
నీకోసం రావటమో...జరిగే అవకాశం ఉందనీ....అందుకే నిన్ను కనిపెట్టి ఉంటున్నామనీ
అన్నారు. మన కాన్వెంట్ సంగతి నీకూ తెలుసు. గూండాలు, పోలీసులు......ఇలాంటి
వ్యవహారాలు ఇక్కడ పనికిరావు..."
ఆ కాన్వెంట్ లో చదువుకునేవాళ్ళంతా చాలా పెద్దింటి పిల్లలు. చదువు
చాలా బాగుంటుంది. క్రమశిక్షణా ఉంటుంది. కానీ ధనిక వర్గాలవారు మాత్రమే భరించగలరు. ఆ
కాన్వెంట్ లో ఒక పక్క ఇలా ధనికవర్గాల దగ్గరనుండి డబ్బు వసూలు చేస్తారు. మరొకవంక
అనాధలను ఆదుకుంటారు.
"నీకు జరిగినట్లే ఇక్కడి పిల్లల కెవరికైనా జరిగితే కాన్వెంట్
కి ఎంత అప్రతిష్టో ఆలోచించు..."
నీరజ ఏమని సమాధానం చెప్పగలదు.
తను అనదలచుకొన్న ఆఖరి వాక్యం అనేసింది సిస్టర్. "నువ్వెక్కడైనా
ఉద్యోగ ప్రయత్నం చెయ్యి. నేను మంచి టెస్టి మోనియల్ ఇస్తాను. ఉద్యోగం దొరికేవరకూ
నీకు ఇబ్బంది లేకుండా ఒక నెల జీతం కూడా ఇస్తున్నాను." అతి తియ్యని ఈ మాటల
సారాంశం 'నిన్ను
ఉద్యోగంలోంచి తీసేస్తున్నాము.' అని.
అటెండర్ సిస్టర్ దగ్గిరకు వచ్చి 'అయ్యగారు వచ్చారు.' అంది.
సిస్టర్ ముఖం చిట్లించి "ఏ అయ్యగారు?"
అంది.
"మన కాన్వెంట్ కు బాగా విరాళాలు ఇస్తారే, ఆయన..."
సిస్టర్ ముఖం వికసించింది.
"రమ్మను."
దర్జాగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు బాలూ. కూర్చున్న నీరహ గభాలున
నిలబడింది. నడుస్తూన్న బాలూ లిప్తమాత్రం ఆగిపోయి అంతలో నిర్లక్ష్యంగా తలతిప్పుకుని
సిస్టర్ చూపించిన కుర్చీలో కూర్చున్నాడు ఆలస్యం చెయ్యకుండా తన జేబులోంచి డబ్బుతీసి
సిస్టర్ ముందుంచి, "వెళ్తాను," అని లేచాడు.
"ఒక్క క్షణం కూచోండి! మీరు వచ్చినప్పుడు నాదగ్గిర మరెవరూ
ఉండకూడదన్నారు. గుప్తదానమంటేనే మీ కిష్టమని అన్నారు. కానీ, ఇవాళ మీరు ఆ అమ్మాయికి ఏమైనా
సహాయం చెయ్యగలరేమో కనుక్కుందామని ఇక్కడే కూచోనిచ్చాను..."
బాలూ ఆశ్చర్యంగా "ఎలాంటి సహాయం?" అన్నాడు.
ఈ మధ్య ఈ అమ్మాయిని గూండాలు ఎత్తుకుపోయిన సంగతి మీరు పేపర్లో చూసే
ఉంటారు. ఆ గొడవలతో ఈవిడని ఉద్యోగంలోంచి తీసెయ్యవలసి వచ్చింది. మీరు మరొక ఉద్యోగం
చూసిపెట్టగలరా? చాలా
మంచిమనిషి. విధి లేక తీసేస్తున్నాను. కాని, చాలా బాధపడుతున్నాను."
నీరజ రెప్ప ఆర్పకుండా బాలూనే చూస్తూ కూచుంది. బాలూ ముఖం తిప్పుకుని
"ప్రయత్నిస్తాను." అని చటుక్కున లేచి వెళ్ళిపోయాడు.
సిస్టర్ ఆనందంతో "నీరజా! ఇతడు నీకు సహాయం చేస్తాడు. చాలా
మంచివాడు. మీరు మంచివారు అంటే ఇతనికి చాలా కోపం వస్తుంది. అంత మంచివాడు!"
అంది.
నీరజ పకాలున నవ్వింది. సిస్టర్ తెల్లబోతూ "ఎందుకు
నవ్వుతున్నావు?" అంది.
"ఏం లేదు. వస్తాను మేడమ్! ఇవాళే నా రాజీనామా ఇచ్చేస్తాను."
"అయామ్ సారీ నీరజా! కానీ ఆయన నీకు మరొక మంచి ఉద్యోగం
చూస్తారు. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్!"
"థాంక్యూ మేడమ్!"
చేతులు జోడించింది.
సాధారణంగా ప్రభు నీరజ ఇంటికి రాడు. నీరజే ప్రభు దగ్గరకు వెళ్ళేది.
లక్ష్మీదేవి దగ్గర ఉన్న చనువుతో ప్రభు ఉన్నప్పుడూ లేనప్పుడూ కూడా వెళ్ళి అక్కడే
ఉండిపోయేది. కానీ ఇటీవల లక్ష్మీదేవి పూర్తిగా మారిపోయింది. నీరజ వెళ్తే
పలకరించనుకూడా పలకరించకుండా లోపలకు వెళ్ళిపోసాగింది. తల్లికి భయపడి యశోధరకూడా
స్నేహంగా ఉండలేకపోతోంది....ప్రభు ఇంట్లో ఉంటే నీరజ దగ్గిరకువచ్చి కూచునేవాడు. కానీ
ఆ సమయంలో లక్ష్మీదేవి కళ్ళలో కనిపించే వ్యధకూ, తిరస్కారానికీ, నీరజ తట్టుకోలేకపోయేది. కాని
ప్రభుకోసం ఆరాటం మానుకోలేకపోయింది. ఏరోజు కారోజు ప్రభు తనదగ్గరకు వస్తాడని
ఎదురుచూస్తూనే ఉంది. వస్తాడు! ప్రభు తప్పకుండా తన కోసం వస్తాడు. ఎవరికోసమూ ప్రభువు
తను వదులుకోలేదు. అంత స్వార్ధ త్యాగం తనలో లేదు.
ఆరోజు ప్రభువు చూడగానే నీరజ ఆనందం పట్టలేకపోయింది.
"పద, ఎక్కడైనా
బయటికిపోయి మాట్లాడుకుందాం!" అంది.
అక్కడే ఉన్న వర్ధని సహించలేకపోయింది.
"సిగ్గులేకపోతే సరి? ఈ దశలో షికార్లుకూడానా? దమ్ముంటే పెళ్ళిచేసుకుని, ఆ తరువాత వెళ్ళండి షికారుకి..." అంది కోపంగా...
ప్రభు ముఖం ముడుచుకుని అక్కడి చాపమీద
కూర్చున్నాడు.
"పోనీలే ఇక్కడే మాట్లాడుకుందాం!" అన్నాడు.
'నేను నీరజను పెళ్ళి చేసుకుంటాను. మేం ఇక్కడే బయటికి వెళ్తాము' అని ప్రభు అంటే బాగుండునని నీరజ ఎంతగానో
అనుకుంది. కానీ ప్రభు అలా చాపమీద కూచునేసరికి తనూ ఒక వారకి
కూచుంది. వర్ధని కదలకుండా అక్కడే ఉంది. నీరజను వర్ధనిని లక్ష్యపెట్ట దలచుకోలేదు.
"ఇన్నాళ్ళు కనపడలేదు!" అంది.
"అవును నాకు ఎన్నో రోజులు గడిచిపోయినట్లుగా
ఉంది.
ప్రతి క్షణం నిన్ను
తలుచుకుంటూనే ఉన్నాను. యశు పెళ్ళి నిశ్చయమయిపోయింది. ఎల్లుండి నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలని
అనుకుంటున్నారు. ఆ హడావిడిలో రాలేకపోయాను"
క్షమించమని ప్రాధేయపడుతున్నట్లుగా ఉన్న
ప్రభు ధోరణికి నీరజ మనసు చల్లబడింది. కళ్ళతోనే నవ్వింది.
"ఫంక్షన్ గొప్పగా చేయాలని అనుకుంటోంది అమ్మ. చాలా మందిని పిలుస్తోంది!"
నీరజ భయపడింది. ఈ పరిస్థితిలో అందరిముందుకూ తను వెళ్ళగలదా? రానంటే ప్రభు ఊరుకుంటాడా? అతనికి ఎలా నచ్చచెప్పాలి?
ప్రభు కొంచెంసేపాగి అన్నాడు:
"యశుకు కాబోయే భర్త డాక్టర్! అతనికి చాలామంది స్నేహితులున్నారు. వాళ్ళంతా గొప్పవాళ్ళు....బాగా పలుకుబడి ఉన్నవారు....అందరి మధ్యా నువ్వు...అదే...నీకు ఇబ్బంది అవుతుందేమో! ఏమీ అనుకోకు! నిన్ను మరోసారి వాళ్ళిద్దరూ ఉండగా పిలిచి
ప్రత్యేకంగా పార్టీ ఇస్తాను. సరేనా..."
ప్రభు తనను రావద్దని అంటున్నాడు! నీరజ మనసు మొద్దుబారిపోయింది. నీరజ ముఖం చూస్తూ తడబడ్డాడు ప్రభు-
"నీరజా! నువ్వు రా! అందుకు కాదు-నేను....నీకోసమే..."
"ఫరవాలేదు ప్రభూ! నేను రానులే!"
శాంతంగా అంది నీరజ.
ప్రభుకు ఇంక మాటలు దొరకలేదు...." మళ్ళీ వస్తాను" అని వెళ్ళిపోయాడు.
'వాళ్ళంతా గొప్పవాళ్ళు.....పలుకుబడి ఉన్నవాళ్ళు.....వాళ్ళ మధ్యకు నువు రావద్దు...'
ఈ మాటలు హోరుమంటున్నాయి నీరజ మనసులో...
నీరజ మనసులో ఘోషను మించి విరగబడి నవ్వింది
వర్ధని.
"ఆహా! ఏం ప్రేమ! ఏం అనురాగం! నలుగురిలో తనకు తెలిసిన మనిషి అని
చెప్పుకోలేకపోతున్నాడు? ఇక పెళ్ళి చేసుకుంటాడు! నమ్మవలసిందే?" ఎంత ఆనందం, ఆ వికటాట్టహాసంలో-
* * *
కరెంట్ పోయింది. వీధిలో విధ్యుద్దీపాలు కూడా ఆరిపోయాయి. రాత్రి పదిగంటల సమయంలో ఒంటరిగా నిలబడిన నీరజకు భయంవేసింది.
"నీరజా! అన్న చిరపరిచితమైన పిలుపు వినిపించింది. ఆ పిలుపు -- నీరజ మనసులో పేరుకునే దుఃఖాలన్నిటినీ
క్షణాలలో కరిగించగలిగిన ఆ పిలుపు నీరజ మనసులో భయాన్ని ఎగరగొట్టి మరేదో లోకాలలోకి
తీసుకుపోయింది.
ప్రభు నీరజ పక్కన నించుని నీరజచేతిని
పట్టుకుని "నీరజా?" అన్నాడు మళ్ళీ...
"ఇంత చీకట్లో నన్ను ఎలా గుర్తుపట్టగలిగావు?"
"దాదాపు రెండుగంటలనుంచీ నీకోసం రోడ్డుమీద
కాచుకుని ఉన్నాను- -"
"ఎందుకూ?"
"అది తెలియకనే! నన్ను ఎందుకిలా తప్పుకు తిరుగుతున్నావో
చెప్పు!"
"నీకు అడ్డు రాకూడదనుకున్నాను!"
"పచ్చి అబద్దం. అనుక్షణం నా ఊహలకు చివరికి నా ఊపిరికి
అడ్డుపడుతూనే ఉన్నావు."
నీరజ నవ్వింది.
"ముందు ఇది చెప్పు! నేను క్లబ్ లో రిసెప్షనిస్ట్ గా
జాయినయ్యాను- తెలుసా?"
"తెలియకుండా ఇక్కడెలా కాచుకుని ఉంటాను?"
"ప్రభూ! అలాంటి ఉద్యోగాలలో పరువుగల ఆడవాళ్ళు ఎవరూ
చేరరు!"
"నువ్వు చేరావుగా! ఇంక ఆ మాట అనటానికి వీల్లేదు!"
"నేను చేరింది..."
"నీరజా! ప్లీజ్! ఇక్కడ కాదు! ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాం!"
"ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తాం?"
"నా ఫ్రెండ్ కొక ఇల్లు ఉంది. అక్కడ ప్రస్తుతం ఎవరూ లేరు-అక్కడికి
నీరజ కాదనలేకపోయింది.
ఇంట్లో అడుగు పెట్టగానే విధ్యుద్దీపాల కాంతిలో
నీరజను చూసి "నువ్వు చాలా మారిపోయావు!" అన్నాడు ప్రభు-క్లబ్ లో ఉద్యోగానికి అత్యంత అధునాతనంగా
అలంకరించుకుంది నీరజ...
"అవును మారిపోయాను-అలంకరణలో మాత్రమే కాదు- అంతరంగంలో కూడా...."
"ఎన్ని మారినా ఒక్కటి మాత్రం మారలేదు-మారదు-నువ్వు నా దానివి నీరజా!..."
ప్రభు నోట ఇలాంటి మాటలు విన్నప్పుడు
ఇదివరకు పరవశించిపోయేది నీరజ ఇప్పుడు అలా ఆనందించలేకపోయింది. వెటకారంగా నవ్వింది.
"ఏమో ప్రభూ! ఆ నమ్మకం నాలో నిలవటం లేదు- అదే ఉంటే నేను ఈ క్లర్క్ ఉద్యోగానికి కక్కుర్తి పడేదానిని కాను!"
"తొందర పడ్డావు నీరజా! ఉద్యోగంలో చేరకుండా ఉండవలసింది!"
"తొందర పడ్డానా! లేదు ప్రభూ! బాగా ఆలోచించుకునే చేరాను! ఎందుకో తెలుసా?...గొప్పవాళ్ళతో ... పలుకుబడిగలవాళ్ళతో ... కలిసి తిరగవచ్చు నని..."
నీరజ దెప్పిపొడుపు అర్ధమయింది ప్రభుకు-కానీ తను ఎలాంటి పరిస్థితుల్లో అలా
మాట్లాడవలసి వచ్చిందో-అది నీరజకు అర్ధమయ్యేలా ఎలా చెప్పాలో
మాత్రం అర్ధంకాలేదు.
ఆహ్వాన పత్రికలమీద పేర్లు రాస్తున్న ప్రభు
"అమ్మా! నీరజకు కూడా ఇన్విటేషన్ పోస్ట్ చేస్తే బాగుండదు? నేనే స్వయంగా పిలుస్తాను" అన్నాడు.
"నీకు మతిపోయిందా?" ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి-ప్రభుకు నిజంగా మతిపోయినట్లే అయింది.
"ఏం?"
"ఫంక్షన్ కు నీరజణు రమ్మంటావా?"
"నీరజ రాకుండా మనింట్లో వేడుక ఏమిటమ్మా!"
లక్ష్మీదేవి మాట్లాడలేదు-ప్రభు కోపంగా తన చేతిలో ఇన్విటేషన్
కార్డ్స్ కింద పడేసాడు.
"ప్రభూ! నీతో నేను వాదించలేను, నీ జీవితం నీయిష్టం! కానీ నీ చెల్లెలి బ్రతుకు పాడుచేసే
అధికారం కూడా నీకు ఉందా?"
"ఏం మాటలమ్మా!"
"పరిస్థితి బాగా అర్ధంచేసుకుని ఆలోచించి
మాట్లాడుతున్న మాటలు ప్రభూ! నీరజను నేను ఎంతగా అభిమానించేదాన్నో నీకు
తెలియదా? కానీ, ఈ సందర్భంలో నీరజ ఇక్కడికి వస్తే....అందరి కళ్ళూ నీరజవైపు తిరిగితే...నీరజ గురించి గుసగుసలు నలుగురూ
చెప్పుకోవటం మొదలుపెడితే...అదంతా ఎవరికి సుఖమో ఆలోచించు? మరొక సంగతికూడా ఉంది. నీది-విశాల హృదయమని అనాలో...విపరీత మనస్తత్వమని అనాలో...నువ్వొక్కడివి ఇలా ఆలోచిస్తున్నావు-నువ్వు నీరజను చేసుకోవటం అందరూ హర్షించలేరు- యశోధరకు కాబోయే భర్తకు కూడా ఇలాంటివి ఇష్టం ఉండకపోవచ్చు...ఈ కారణంగా నిశ్చయతాంబూలాలవరకు వచ్చిన
పెళ్ళి ఆగిపోతే ఎవరికీ నష్టమో ఆలోచించు. యశోధర పెళ్ళి అయిపోయాక నీయిష్టం వచ్చినట్లు చేసుకో! నేనేమీ మాట్లాడను!"
ప్రభు సమాధానం చెప్పలేకపోయాడు
-- ఈ విషయంలో పట్టుబట్టి అంతా నిస్చయమయిపోయిన చెల్లెలి పెళ్లి చెడగొట్టడానికి అతని
మనసు అంగీకరించలేదు.
"నీరజ దగ్గరకు నేనే వెళ్ళి పరిస్థితి అంతా వివరించి రావద్దని
చెపుతాను." అంది లక్ష్మీదేవి.
"వద్దు వద్దు నేనే చెపుతాను?" అన్నాడు ప్రభు....
ఆరోజు "పరవాలేదు ప్రభూ! నేను రానులే!" అని ప్రశాంతంగా
అన్న నీరజ మాటల్లో అంతర్లీనమై ఉన్న పదును ప్రభు మనసును కోస్తూనే ఉంది. నీరజతో
ఒక్కసారి మనసు విప్పి మాట్లాడాలని ఎంతగానో ప్రయత్నించాడు -- ప్రభు. ఎప్పుడు
ఎక్కడికి రమ్మన్నా ఆ సమయంలో 'ఊ!' అనేది నీరజ -- కానీ వచ్చేది
కాదు- నీరజ కోసం పడిగాపులు పడి విసిగిపోవటమే ప్రభుకు దక్కేది. నీరజకు కాన్వెంట్ లో
ఉద్యోగం పోయిందని విని బాధపడ్డాడు - క్లబ్ లో జాయినయిందని విని భయపడ్డాడు-- ఆరోజు
ఏమైనా సరే నీరజను కలుసుకుని తీరాలని క్లబ్ ముందు పడిగాపులు పడుతూ నించున్నాడు
.....
నీరజ దగ్గరగా వచ్చి అనునయంగా నీరజ చేతులు తన చేతుల్లోకి
తీసుకున్నాడు ప్రభు.
నీరజా ! నా అనందం కోసం మిగిలిన వాళ్ళ జీవితాలు చికాకు చేసేటంత
స్వార్ధం లేకపోయింది నాకు -- అందుకే ఆరోజు నిన్ను రావద్దని అనవలసి వచ్చింది --
అర్ధం చేసుకోలేవా?"
అర్ధం చేసుకుంటోంది నీరజ -- అర్ధమవుతోన్న కొద్దీ తన సమస్య మరింత
భయంకరంగా ప్రత్యక్షమవుతోంది -- సమాజం ఎన్నటికీ తనను ఎప్పటిలా స్వీకరించలేదు --
తనతో కలిసి ప్రభు అడుగడుగునా ఎలాంటి సమస్యను ఎదుర్కోవలసి వస్తుందో? అంత సంఘర్షణకు అతణ్ణి
గురిచెయ్యటం తనకు న్యాయమేనా?" అంత స్వార్ధం ఉందా తనలో .....
"ప్లీజ్ నీరజా!"
చేతులు జాపాడు ప్రభు -- తనమీద తనకేమీ అధికారం లేనట్లు తూలి ఆ
చేతులలో వాలిపోయింది నీరజ ........ మాటలకందని మహాశక్తి ఏదో తమను బందించినట్లు
ఒకరికొకరు హత్తుకుపోయారు.
"ఆయామ్ సారీ!" అన్న మాటలు విని ఉలికిపాటుతో ప్రభుకు
దూరంగా జరిగింది నీరజా ------- ఎదురుగా నీలకాంత్ ను చూసి నిర్ఘాంత పోయింది.
నీలకాంత్ నవ్వుతూ "ప్రభూ! నీరజను ఇక్కడికి తీసుకోస్తున్నానని
నాకు చెప్పి ఉండవలసింది. నేను వచ్చేవాణ్ణి కాదు!" అన్నాడు.
"దట్సాల్ రైట్ " సిగ్గుపడుతూ అన్నాడు ప్రభూ....
"ఈ ఇల్లు నీలకాంత్ దా?" పాలిపోయిన ముఖంతో అడిగింది
నీరజ.
"ఏం? తెలిస్తే
వచ్చేదానివి కాదా?"
కవ్విస్తున్నట్లు అడిగాడు నీలకాంత్.
'కంఠంలో ప్రాణం ఉండగా వచ్చేదాన్ని కాదు"
"నీరజా......." మందలిస్తున్నట్లుగా ఏదో అనబోయాడు ప్రభు
........ నీలకాంత్ కల్పించుకున్నాడు.....
"ఆవిడ భయమంతా తన రహస్యం నేను నీకు చెప్తానని ప్రభూ ! నీరజా!
భయపడకు. ఆ రహస్యం నానోటి నుండి రాదు"
నీరజ మాట్లాడలేదు- పెదవి మాత్రం పళ్ళ కింద నలిగిపోతుంది.
ప్రభు ముఖం జేవురించింది .
"నీరజ నా దగ్గర రహస్యంగా ఉంచవలసిన విషయాలేమీ లేవు --
భయపడవలసిన అవసరం అసలే లేదు . అదేమిటో చెప్పు నీలకాంత్ "
"నేను చెప్పలేను ప్రభూ! నీరజనే అడుగు"
"నీరజా! నీ రహస్యం తెలుసుకోవాలని నాకేవిధమయిన కుతూహలమూ లేదు
-- ఎలాంటి విషయమయినా మన మధ్య అడ్డుగా నిలవలేదనీ -- నీ విషయంలో నేను
క్షమించలేనిదంటూ ఏదీ లేదనీ ....... రుజువు చేసుకోవటానికి అదేదో చెప్పెయ్యి నీరజా!
ఈ తెరలు చీల్చేసుకుంటే కాని మనకు శాంతి ఉండదు"
జీవం లేని తన ముఖాన్ని పైకెత్తింది నీరజ.
"నాదగ్గిర నుంచి వెళ్ళిపో ప్రభు! శాశ్వతంగా వెళ్ళిపో"
ఆ చిమ్మచీకట్లోకి పిచ్చిదానిలా పరుగు పెట్టింది.
*
* *
ప్రతిరోజూ
అక్లబ్ ఎదురుగా నీరజ కోసం ఎదురు చూస్తూ నిలబడుతున్నాడు ప్రభు ..... వారం రోజులు
గడిచాయి. నీరజ జాడలేదు -- ప్రభు ఆందోళనను అనచుకోలేకపోయాడు - క్లబ్ కు
వెళ్ళాడు. ఎంక్వయిరీలో "మిస్ నీరజను కలుసుకోవాలి ! ఆవిడతో చెప్పగలరా?"
అన్నాడు.
అక్కడి క్లర్క్ "మిస్ నీరజను ఇక్కడ ఉద్యోగం లోంచి తీసేశారు. ఇప్పుడు ఇక్కడ
లేదు -" అన్నాడు.
"ఉద్యోగంలోంచి తీసేశారా?"
"ఆవిడ వెనక పోలీసులు తిరుగుతున్నారని తెలిసింది. ఇది పెద్ద
మనుష్యులు వచ్చే క్లబ్ - అలాంటి వాళ్ళను ఎలా ఉంచుకోగలం?"
అది పెద్దమనుష్యులు వచ్చే క్లబ్ -- ఆ పెద్ద మనుష్యులకు న్యాయమైనవీ, అన్యాయమైనవీ అనేక
వ్యవహారాలుంటాయి. ఆ క్లబ్ లో .......... పోలీసుల దృష్టి ఆ క్లబ్ మీద పడటం ప్రమాదమే
మరి.
చేసేది లేక నీరజ కోసం ఇంటికే వెళ్ళాడు ప్రభు .....వర్ధని
చిరునవ్వుతో ఆప్యాయంగా ఆహ్వానించింది.
"నీరజ ఏం చేస్తోంది అత్తయ్య?"
వర్ధని విస్తుపోయి చూసింది -- కంగారు పడ్డాడు ప్రభు.
"అయితే, నీకు నిజంగానే తెలీదా?"
"ఏమిటి అత్తయ్యా?"
"నీరజ ఇక్కడెక్కడ ఉంది "
"ఎక్కడికి వెళ్ళింది?"
"ఏమో! ఎక్కడకు వెళ్లిందో. ఎలా వచ్చిందో , తెలియదు. మళ్ళీ ఎక్కడకు
వెళ్ళిందో , ఎప్పుడు
వస్తుందో అసలు తెలియదు. నేనేం చెప్పగలను?"
వర్ధని చిన్న కూతురు కల్పించుకుని "కాదు ! అమ్మ
వెళ్ళిపొమ్మంది?" అంది.
"నోరు మూసుకో!" అని కూతుర్ని కసిరింది వర్ధని. ప్రభును
చూస్తూ "అవును నేనే వెళ్లి పొమ్మన్నాను. నేను సామన్యురాలినే! నాకు పెళ్ళి
కావలసిన పిల్లలున్నారు. ఇన్ని గొడవలతో ఉన్న ఆ పిల్లను రొమ్ముల మీద కుంపటిలా ఎలా
భరించగలను?" అంది.
"వస్తానత్తయ్యా" అని లేవబోయాడు. వెళ్ళ నివ్వలేదు
వర్ధని.....
"కూచో , కూచో! అన్నట్లు ఈ మధ్య మా రాధను
చూసావా నిముషాలలో ఎదిగి కూర్చుంది -- ఈ ఆడపిల్లలు కాదు గాని - అంటే దృష్టి
కొడుతుందని భయంగా ఉంది. ఎంత అందంగా తయారయిందనుకున్నావ్! నీరజ కంటే ఎంతో అందంగా
ఉంది. ఇప్పుడు దీని పెళ్ళి చెయ్యాలి ..... నీలాంటి వాళ్ళు కట్నం తీసుకోకుండా
చేసుకుంటే ఏదో చెయ్యగలం కాని, లేకపోతే మాబోటి వాళ్ళం ఆడపిల్లల
పెళ్ళిళ్ళు చెయ్యగలమా? అమ్మాయ్
రాదా! బావకి కాస్త వక్కపొడి పట్రా
అమ్మా!"
రాధ
సిగ్గుపడుతూ వక్కపొడి పట్టుకువచ్చింది. ప్రభుకు తల తిరిగి పోసాగింది. వర్ధని
ఉండమంటున్నా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేసాడు.
నీరజ కోసం
ఎక్కడ వెతకగలడు?
యశోధర పెళ్ళి
చాలా వైభవంగా జరిపించాడు ప్రభు. మనసు ఎంత మధనపడుతోన్నా అన్ని పనులూ యాంత్రికంగా
యధావిధిగా చేస్తోనే ఉన్నాడు.
యశోధరకు ఒక
చిన్న పార్శెల్ కానుకగా వచ్చింది ..... ఒంటి ముత్యం పొదిగిన బంగారు ఉంగరంతో పాటు
ఒక చిన్న వుత్తరం కూడా ఉంది అందులో ....
"ప్రియమైన
యశోధరకు ప్రేమతో ......" అంత మాత్రమే!
ఎవరిది? సంతకం కూడా లేదు?"
అంటోన్న యశోధర ఏదో గుర్తు వచ్చినట్లు ఆగిపోయింది. భయంగా ప్రభు
వంక చూసింది. ప్రభు యశోధర చేతిలోంచి ఆ ఉత్తరం తీసుకున్నాడు . గుండెలు
ఝల్లుమన్నాయి. సందేహం లేదు. అది నీరజ దస్తూరి ...... ఆత్రుతగా పార్శేల్ మీద అడ్రస్
చూసాడు . ఆ ఊరి పేరు నోట్ చేసుకున్నాడు. ఆ రాత్రి బయలుదేరాడు.
ఆ ఊరంతా
గాలిస్తూ వారం రోజులు తిరిగాడు ప్రభు. ఎక్కడా నీరజ జాడ లేదు. నిరాశ చేసుకుని మళ్ళీ
ఇంటికే ప్రయాణమయ్యాడు. టికెట్ కొనుక్కుని ప్లాట్ ఫాం మీద నిలబడ్డాడు. ఒక యువతి
చేతిలో చిన్న సూట్ కేస్ పట్టుకుని హడావుడిగా ప్లాట్ ఫాం మీదకు వచ్చింది. ప్రభును
చూస్తూనే గిర్ర్రున తిరిగి వెళ్ళిపోబోయింది. ప్రభు వెంటనే నీరజను గుర్తుపట్టాడు.
"నీరజా!" అన్నాడు నీరజ పరుగులాంటి నడకతో స్టేషన్ బయటకు నడిచింది. ప్రభు
సర్వమూ మరిచి "నీరజా?" అని పిలుస్తూ
వెంటపడ్డాడు. నీరజ నడకవేగం హెచ్చించింది. ప్రభు నీరజనే చూస్తూ పరిగెత్తి నీరజను
అందుకోబోయాడు. అంతలోనే ఒక కారు ప్రభును గుద్దేసింది. "నీరజా!" అని ఒక
వెఱ్రి కేక పెట్టాడు
ప్రభు
ప్రభు కళ్ళు తెరిచేసరికి నీరజ ఎదురుగా
ఉంది. "ప్రభూ!" అంది ఆందోళనగా.......
"హమ్మయ్యా!
ఇక్కడే ఉన్నావా? మళ్ళీ నిన్ను పోగొట్టు'కుంటానేమోనని ఎంత ఆరాటపడిపోయానో తెలుసా?" నీరజ మాట్లాడలేదు..... ప్రభు తన చుట్టూ
పక్కల చూసుకున్నాడు - హాస్పిటల్.
"ఏమిటిది! నాకు
ఏక్సిడెంట్ అయింది కదూ! అయితే అయిందిలే నిన్ను కలుసుకున్నాను...."
నీరజ ప్రభు
హృదయం మీద తల వాల్చి ఏడ్చింది. ..... నీరజ చేతిని తన చేతిలోకి తీసుకుని "
ఇన్నాళ్ళూ ఏమయిపోయావు నీరజా! ఎంతగా వెతికాను నీ కోసం?" అన్నాడు ....
క్లబ్బులో
ఉద్యోగం పోయాక ..... వర్ధని నిర్దాక్షణ్యంగా ఇంట్లోంచి పోమ్మన్నాక నీరజకు
దిక్కుతోచలేదు. ఆ సమయంలో భగవంతుడి పిలుపు లాగా కనిపించింది పత్రికలలో
ప్రకటన.......
ఊరికి దూరంగా
కొండ ప్రాంతంలో ప్రత్యేకించి గిరిజనుల కోసం ఒక పాఠశాల నడుపుతున్నారు. అందులో
పనిచెయ్యటానికి టీచర్ కావాలని .... అక్కడి హెడ్మాస్టర్ కు యాభై యేళ్ళ పైన వయసు
ఉంటుంది. ఆయనను అందరూ "స్వామీజీ' అని
పిలుస్తారు. అలా అని ఆయనకు గేడ్డాలూ మీసాలూ ఏమీ లేవు. లుంగీ కట్టుకుని లాల్చీ వేసుకుని
పరమ నిరాడంబరంగా ఉంటారు. ఏ మాత్రం స్వార్ధం లేకుండా, ఆ గిరిజనులను
పైకి తేవడానికి పాటుపడుతున్నారు. అందుకే అందరికీ అయన అంటే గౌరవం. ఆస్కూల్ లో
పనిచేసేది అయన, నీరజ, ఇద్దరే! నీరజ
దాపరికం లేకుండా ఆయనకు తన కధ అంతా చెప్పి......."
"మీరు ఉండమంటే
ఇక్కడ ఉంటాను . లేకపోతే వెళ్ళిపోతాను ." అంది.
"నేనెందుకు
వెళ్ళమంటానమ్మా! కానీ, నీకు ఆ గూండాలతో లావాదేవీలు ఏవీ
లేవుగా!"
"నేను
దౌర్భాగ్యురాలినే కాని దుర్మార్గురాలీని కాను బాబుగారూ?"
అయన
నొచ్చుకుని "సరేనమ్మా. సరే! ఇక్కడి కొచ్చి పనిచేసే వాళ్ళు ఎవరున్నారు ? నువ్వు ఉంటానంటే మా అందరి అభిమానమూ
సంపాదించుకోగలిగింది. స్వామీజీ చెప్పిన మీదట అక్కడి చిన్నపిల్లలందరూ నీరజను
"అక్కా!" అని పిలవటం కూడా మొదలుపెట్టారు.
ఒకరోజు బడికి
ఒక్కళ్ళు కూడా రాలేదు. నీరజకూ స్వామీజీకి ఆశ్చర్యం కలిగింది. ఇద్దరూ
కనుక్కోవటానికి వెళ్ళారు. వాళ్ళంతా నీరజను చూస్తూనే గబగబ గుడిసెల్లో దూరి తడికెలు
బిగించుకున్నారు. నివ్వెరపోయింది నీరజ. స్వామీజీ ఒకటి రెండు సార్లు పిలవగా
పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చారు.
"అయమ్మ మీద
పోలీసుల నిఘా ఉందటగా సామీ! ఓయ్ నాయినోయ్! యములాల బాధలన్నా పడొచ్చు గాని, ఆ పోలీసోల బాధలు పడలెం సామీ?"
ఏడుస్తూ , రాగాలు పెడుతూ అన్నారు వాళ్ళు....... స్వామీజీ
ఎన్ని విధాల నచ్చజెప్పాలని ప్రయత్నించినా లాభం లేకపోయింది.
ఆ సాయంత్రం
నీరజ తన చిన్న సూట్ కేస్ సర్దుకుని స్వామీజీకి నమస్కరించి "నేను
వెళ్తున్నాను" అంది.
అయన
తలవంచుకున్నారు.
అంతా విని
ఒక్క నిట్టుర్పూ విడిచాడు ప్రభు....
"పోనీలే నీరజా!
అంతా మన మంచికే జరిగింది ..... నువ్వు ఆకొండకోనల్లోనే ఉంటే నిన్నసలు కలుసుకోలేక
పోయేవాడిని .... మనం ఎప్పుడు వెళ్దాం?"
"నన్నూ నీతో
రమ్మంటావా?"
"మళ్ళీ అదేపాటా?"
"డాక్టర్ ని
కనుక్కుంటాను . నిన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో ......"
కారు డ్రైవర్ సడెన్ బ్రేక్
వెయ్యటంవల్ల ప్రభు ప్రాణాలకు ప్రమాదం లేకపోయింది కాని దెబ్బలు మాత్రం బాగానే
తగిలాయి. కారులో ఉన్నవ్యక్తి నీరజకు సహకరించి ప్రభును హాస్పిటల్ లో చేర్పించాడు.
డాక్టర్ రౌండ్స్ కి వచ్చినప్పుడు ప్రభును ఎప్పుడు డిశ్చార్జ్
చేస్తారని నీరజ అడిగింది...
"రెండు మూడు రోజులలో వెళ్ళిపోవచ్చు. కానీ, ఈయనకు గుండె దగ్గర బలమైన దెబ్బ
తగిలింది. ఆ కారణంగా ముందుముందు ఎప్పుడైనా గుండెనొప్పి రావచ్చును. కొంచెం
జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి!"
డాక్టర్ వెళ్ళిపోయాక నీరజతో అన్నాడు ప్రభు. "విన్నావుగా! నాకు
గుండెనొప్పి రావచ్చుట! నన్ను విడిచిపెట్టి వెళ్ళవుగా..."
కన్నీళ్ళు ఆపుకుంటూ "వెళ్ళను" అన్నట్లు తల ఆడించింది
నీరజ.
* * *
లక్ష్మీదేవి ఏది జరగకూడదని
వెయ్యిదేవుళ్ళకు మొక్కుకుంటుందో, అదే జరిగింది. ప్రభు నీరజతో కలిసి
ఇంటికి వచ్చాడు. చలనంలేని బొమ్మలా నిలబడిపోయింది.
"అమ్మా! నీరజ కనిపించింది. రానంటే రానంది_మన నీరజ మన దగ్గరికి రాక
ఏమయిపోతుందమ్మా! నేను బలవంతంగా..."
పేలవమైన నవ్వుతో సంజాయిషీ ఇచ్చుకొంటున్నట్లు, నచ్చజెప్పుతున్నట్లు ఏదో
అనబోతున్న ప్రభు మాటలు, లక్ష్మీదేవి
గిర్రున తిరిగి లోపలికి వెళ్ళిపోవటంతో ఆగిపోయాయి...దిగులుగా తనను చూసే నీరజ చెయ్యి
గట్టిగా పట్టుకొని లోపలకి నడిపించుకుని వెళ్ళాడు ప్రభు...
క్షణాలలో నీరజ అక్కడికి వచ్చిన వార్త చుట్టుపక్కల ఇళ్ళకు వ్యాపించింది.
అందరూ చేస్తున్న పనులు లాగే వదిలేసి లక్ష్మీదేవి ఇంటికి చేరుకున్నారు. నీరజ
గదిలోకి పారిపోయి తలుపు గట్టిగా బిగించుకుంది. అమ్మలక్కలకు లక్ష్మీదేవి మాత్రమే
దొరికింది.
"ఇదేమిటి లక్ష్మీదేవీ! ఇంత బ్రతుకు బ్రతికి దాన్ని కోడలిగా
తెచ్చుకుంటున్నావా? ఇంక ఈ
ఇంటి పరువుప్రతిష్ఠలు..."
"పరువు ప్రతిష్టల సంగతి సరేలే! ముందు ప్రాణమానాల సంగతి
ఆలోచించుకోండి! దానికోసం ఆ గూండాలు ఇంటిమీదకూడా పడితే మీగతేమిటి?"
"ఎందుకైనా మంచిది! దాన్ని నీ కొడుకు గదిలోకి రానియ్యకు!"
"ఇంకా నయం! ఇప్పుడది ఉన్నది ఎక్కడనుకుంటున్నావు?"
"ఏమిటి? ఇంకా పెళ్ళికాకుండానే ఇద్దరూ ఒక్క
గదిలో ఉంటున్నారా?"
"సరేలే! దానికి పెళ్ళి, కార్యం, ఈ తతంగాలన్నీ తక్కువయ్యాయా?"
అన్నీ వింటూ శిలలా కూర్చుంది లక్ష్మీదేవి_వచ్చినవాళ్ళకెవరికీ సమాధానంగా
లేదు.
"అయ్యో! లక్ష్మీదేవీ! నీ బ్రతుకు ఇంతకు దిగాజారిందే
తల్లీ!" అంటూ లక్ష్మీదేవిని కౌగిలించుకుని బావురుమంది ఒకావిడ ... లక్ష్మీదేవి
అతిప్రయత్నంమీద ఆ కౌగిలి వదిలించుకుని కాస్త దూరంగా జరిగికూర్చుంది.
"పర్వాలేదులే! ఇప్పుడేదో మోజులో దాన్ని తీసుకొచ్చాడేగాని ఈ
మోజు నిలుస్తుందా, పాడా? నాలుగురోజులు పోతే తనుచేసిన
దానికి తనే పశ్చాత్తాపపడి దాని దారిన దాన్ని పంపించేస్తాడు. అప్పుడు లక్షణంగా మరో
సంబంధం చూసి పెళ్ళిచెయ్యొచ్చు..."
ఆశాభావం వ్యక్తంచేస్తూ ఓదార్పుగా అంది మరొక వ్యక్తి...
లక్ష్మీదేవి దగ్గరినుంచి తగినంత ప్రోత్సాహం రాకపోవటంతో విసిగి
వెళ్ళిపోయారు అమ్మలక్కలు...
నీరజ ఆపుచేస్తోంటే బలవంతాన నిగ్రహించుకుంటూ లోపల కూర్చున్న ప్రభు
విసురుగా బయటకు వచ్చాడు...
తల్లిముఖం చూడగానే అతని విసురంతా ఎక్కడిదక్కడ ఎగిరిపోయింది.
ఎంతగానో కుమిలిపోతూ దానిని అణచుకునే ప్రయత్నం లక్ష్మీదేవి ముఖంలో స్పష్టంగా
కనిపిస్తోంది. ఎన్నెన్నో అందామని వచ్చిన ప్రభు కొంతసేపటివరకు మాట్లాడలేకపోయాడు.
"వాళ్ళందరినీ పొమ్మనకపోయావా అమ్మా!" అన్నాడు.
"పొమ్మన్నను_నీకు పుణ్యం ఉంటుంది నువ్వూ పొమ్మని
అనకు"
"అలా వాగుతుంటే..."
"పర్వాలేదు! ఎన్ని సాధింపులైనా భరిస్తూ సమాజంలో ఉండటమే సుఖం!
సమాజానికి వెలివడి బ్రతకలేము. నువ్వు చేసే పనుల ఫలితాన్ని నీముందు తరంలో
తల్లిదండ్రులూ, నీ
తరువాతి తరంలో సంతానము అనుభవించక తప్పదు..."
లక్ష్మీదేవి అంత శాంతంగా దృఢంగా మాట్లాడుతోంటే ప్రభు మనసులో ఏదో
అవ్యక్తమైన భయం కలిగింది కొంచెంసేపు.
అప్పుడే పేకాటలోంచి వచ్చాడు చంద్రశేఖరరావు.
"ఏరా ప్రభూ! నీరజను తీసుకొచ్చావా? వీల్లేదు! ఆ చెడిపోయినదాన్ని మన
ఇంట్లో ఉంచటానికి వీల్లేదు!" అన్నాడు గట్టిగా అరుస్తూ.
ఏనాడూ ఇంటి బాధ్యత పట్టించుకోకుండా, తను చెమటోడ్చి సంసారం
నడుపుతోంటే విలాసాల్లో, మునిగితేలుతూ
ఈనాడు ఇలా ఆజ్ఞాపిస్తున్న తండ్రిని చూస్తోంటే జుగుప్స కలిగింది ప్రభుకు.
"ఈ ఇంటికోడలు! ఈ ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తుంది?"
అన్నాడు.
"ఈ ఇంటికోడలా? దాన్ని పెళ్ళిచేసుకుంటావా? అలా జరగటానికి వీల్లేదు."
"నేను తప్పకుండా నీరజను పెళ్ళిచేసుకుతీరతాను."
"ఇడియట్! కని పెంచి ఇంతవాణ్ని చేసినందుకు ఇదా నువ్వు చూపించే
కృతజ్ఞత?"
ప్రభులో సహనం నశించిపోయింది...
"మీరు కనబోయేముందు నన్ను అడిగి ఉండవలసింది ... కన్నంత మాత్రాన
ఎదిగాక కూడా వ్యక్తిత్వం పెంచుకోకుండా మీకు బానిసలా పడిఉండలేననీ... నన్ను
కనవద్దనీ... చెప్పి ఉండేవాణ్ని!"
వెటకారంగా అన్నాడు ప్రభు. బిత్తరపోయి చూసాడు చంద్రశేఖరరావు.
లక్ష్మీదేవి సహించలేకపోయింది...
"అవును ప్రభూ! పెద్దవాడివయ్యావు_నిన్ను శాసించే అధికారం
మాకులేదు_బయటకుపోయి
మా బ్రతుకులు మేము బ్రతకగలిగే సామర్థ్యమూ లేదు. దయతలిచి గుప్పెడు మెతుకులు
పడేస్తున్నావు. తిని పడిఉండక నీకు బుద్ధులు చెప్పటంకూడానా? క్షమించు!..."
భర్త చెయ్యిపట్టుకుని లోపలకు లాక్కుపోయింది. ప్రభుకు తల
తిరిగినట్లయింది? నీరజకు
పిచ్చెక్కినట్లే అవుతోంది!
"నేను వెళ్ళిపోతాను ప్రభు!" అంది
బ్రతిమాలితున్నట్లుగా...
నీరజ రెండుచేతులూ గట్టిగా పట్టుకున్నాడు.
"వద్దు! ఆ మాటమాత్రం అనకు! ఈ బాధలన్నీ నీతోకలిసి సుఖంగా
అనుభవించగలను. నువ్వు వెళ్ళిపోతే మాత్రం నరకమే నాకు!"
లక్ష్మీదేవికి వంటపనుల్లో సాయం చెయ్యటం మొదటినుంచీ అలవాటే నీరజకు_ఎప్పటిలా వంటలో సాయం చెయ్యబోయింది.
"వద్దులే! నువ్వు కూచో! నేను చేసుకోగలను!"
మామూలుగా అంది లక్ష్మీదేవి...
లక్ష్మీదేవిలో తనపట్ల వెనుకటి ఆదరభావంలేదని అర్థమయినా తనే
కల్పించుకుని కూడాకూడా తిరుగుతోంది నీరజ___
"నువ్వే కూర్చో అత్తయ్యా! ఈమాత్రం వంట నేను చెయ్యలేనా?"
ఇంచుమించి
బలవంతంగా వంటలో జొరబడింది నీరజ. లక్ష్మీదేవి వంటిల్లు వదిలి బయటకు వచ్చేసింది...
నీరజ వంటంతా చాలా చక్కగా చేసింది. కానీ ఆరోజు లక్ష్మీదేవి అన్నం
తినలేదు.
"వంట్లో ఏదోగా ఉంది. అన్నం తినాలని లేదు" అంది.
"డాక్టర్ని పిలుచుకురానా?" అంది నీరజ.
"ఈ మాత్రందానికి డాక్టరెందుకు! కళ్ళుమూసుకు పడుకుంటే అదే
తగ్గిపోతుంది..."
"పోనీ, పాలుతాగు
అత్తయ్యా!"
"తీసుకురా!" విసుగ్గా అంది లక్ష్మీదేవి.
ఆ మరునాడు అలాగే జరిగింది. ఆరోజు పక్కింటి పిన్నిగారు
లక్ష్మీదేవిని చూడటానికి వచ్చింది.
"అలా ఉన్నావేం? చాలా నీరసంగా..." అంది.
"రెండు రోజుల్నించీ అన్నం తినటంలేదు!" అని చెప్పింది
నీరజ.
పిన్నిగారు లక్ష్మీదేవి నుదురూ చెంపలూ ముట్టుకుచూసి ముఖం
చిట్లించింది.
"వంట ఎవరు చూస్తున్నారు? నువ్వేనా?"
అంది
నీరజతో.
"అవును" అంది నీరజ తెల్లబోతూ.
పక్కింటి పిన్నిగారు వెంటనే ఇంటికివెళ్ళి ఒక కారియర్ లో భోజనం సర్ది
తీసుకొచ్చి లక్ష్మీదేవిని బలవంతపెట్టి దగ్గిరుండి తినిపించింది.
నీరజకు అప్పటికి అర్థమయింది. నిర్ఘాంతపోయింది.
ఆ మరునాడు నీరజ తనే లక్ష్మీదేవితో "అత్తయ్యా! వంట నువ్వే
చేసుకో! నేను ఏమీ ముట్టుకోను!" అంది.
లక్ష్మీదేవి ఏమీ మాట్లాడలేదు. వంటింట్లోకి నడిచింది. లక్ష్మీదేవి
వంట పూర్తిచేసి ప్రభుకు, చంద్రశేఖరరావుకు
వడ్డించి తను పెట్టుకుతిన్నాక నీరజ తినేది.
ఒకరోజు లక్ష్మీదేవి వంట ఇంకా పూర్తికాకుండానే పొరుగింట్లో ఎవరో
సత్యన్నారాయణవ్రతమని తీసికెళ్ళారు. ప్రభుకు ఆఫీస్ కు టైమయిపోయింది.
"నీరజా! టైమయిపోయింది వడ్డించు" అన్నాడు. ఏదో పుస్తకం
చదువుకుంటున్న నీరజ తలెత్తి అమాయకంగా చూసింది.
"అలోచిస్తావేమిటి? త్వరగా వడ్డించు..."
అన్నాడు.
నీరజ నవ్వటానికి ప్రయత్నిస్తూ "అబ్బా! నేను ఈ పుస్తకం
వదలలేను. నువ్వు పెట్టుకు తిందూ!" అంది.
విస్తుపోయి చూశాడు ప్రభు_నీరజ చేతిలోంచి పుస్తకం లాగి
అవతల పారేశాడు.
"చాల్లే! త్వరగా పెట్టు!"
"ఏమిటా మొండితనం! ఒక్కరోజు పెట్టుకుతింటే అరిగిపోవులే!"
"అదేం కుదరదు! పెట్టవలసిందే!"
"నేను పెట్టను"
"పెట్టవూ?"
"ఉహు!"
"అయితే సరే! నేను అన్నం తినకుండానే వెళ్ళిపోతాను." కోపంగా
బూట్లు తొడుక్కుని ప్రయాణమయ్యాడు. ఎప్పటికప్పుడే నీరజ తనను ఆపుచేస్తుందని ఆశతో
ఎదురుచూసి నీరజ చలనం లేని బొమ్మలా కూర్చునేసరికి కోపంగా వెళ్ళిపోయాడు.
తరవాత కంగారుపడుతూ వచ్చింది లక్ష్మీదేవి. నీరజను చూసి "ప్రభు
వెళ్ళిపోయాడా?" అంది.
"వెళ్ళిపోయాడు."
"అన్నం తినలేదా?"
"పెట్టమన్నాడు. నేను పెట్టలేదు."
"నన్ను పిలవకపోయావా?"
"పూజ జరుగుతున్నచోటికి నేను రావచ్చునా? దేవుడు మైలపడిపోడా?"
లక్ష్మీదేవి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆవిడకూడా అన్నం తినలేదు.
చేతులలో ముఖం దాచుకుని ఏడుస్తున్న నీరజ తలమీద చెయ్యిపడేసరికి
ఉలిక్కిపడి తలెత్తి ప్రభునుచూసి గబగబ కళ్ళు తుడుచుకుంది...
ఆఫీస్ కు వెళ్ళాడేగాని ప్రభు స్థిమితంగా ఉండలేకపోయాడు. నీరజ
అహంకారంతో తనకు వడ్డించలేదని అనుకోలేకపోయాడు. అక్కడ ఉండలేకపోయాడు. అతడు
అనుమానించినట్టే నీరజ ఏడుస్తోంది.
"అన్నం పెట్టకుండా పంపించి తీరిగ్గా ఏడుస్తూ కూచో!
బుద్ధిలేకపోతే సరి, ఇప్పుడైనా
పెట్టు!" అన్నాడు.
నీరజ గబగబా కళ్లు తుడుచుకుని "అత్తయ్యా! ప్రభు వచ్చాడు. అన్నం
పెట్టండి." అంది.
అప్పటికి ప్రభుకు అర్థమయింది. "నీరజా..." అన్నాడు
ఆశ్చర్యంగా.
పొంగివచ్చే దుఃఖాన్ని అణచుకుంటూ తల తిప్పుకుంది నీరజ.
రెండు చేతులూ జాపి ఓదార్పుగా నీరజను తన గుండెలలోకి తీసుకున్నాడు
ప్రభు.
*
* *
సుశీల
గర్భవతి అయింది. ఆ గర్భాన్ని కాపాడుకోవటానికి సుశీల చాలా యాతన పడవలసివచ్చింది.
"నేను మీకొక అపురూపమైన కానుక ఇయ్యబోతున్నాను" అంది
సుశీల.
"నువ్వు కానుక ఇస్తావా?" ఆశ్చర్యంగా అడిగాడు బాలూ.
"ఏం? మీకు
కానుక ఇయ్యగలిగే శక్తిలేని నిర్భాగ్యురాలినని కదూ..."
"అదికాదు! ఇయ్యగలిగినంతా ఇచ్చావు_ఈ జీవితంలో మరెక్కడా నేను
పొందలేని ఆనందాన్ని నీదగ్గిర పొందగలిగాను_అంతకుమించిన కానుకఈయగలవా?"
"ఆ! అంతకుమించినదే!"
"ఏమిటోఅది?"
"అల్లరి అబ్బాయి కావాలా? అందాల పాపాయి కావాలా?"
"ఏమిటి నువ్వనేది?"
"ఏం? నా
మాటల్లో మీకు నమ్మకం లేదా? ఈ సంతానం
మీదేనని అనుకోలేరా?"
"అదికాదు_లాభంలేదు సుశీలా! ఇది పోయేమార్గం
చూడు!"
సుశీల కన్నీళ్ళతో రోషంగా చూసింది.
"పోయేమార్గం చూడనా? ఎంత కష్టపడి దానిని
నిలుపుకున్నానో, మీరు ఊహించగలరా?"
"ఆ సంతానం
ఎక్కడ పెరుగుతుంది ? ఎలా పెరుగుతుంది ?"
"ఆ భయం నాకు
లేదు. ఇది నా మనసులో చిగురించిన పవిత్రమైన ప్రేమ ఫలం - మనుష్యులలో మంచితనం
ఎప్పటికీ నాశనం కాదని రుజువుచేస్తూ నాబాబు తప్పకుండా, హాయిగా పెరుగుతాడు. మీరేమీ భయపడకండి! నా శిశువు
బరువు భాద్యతలేవీ మీమీద పెట్టను..."
బాలూ చిత్రంగా
నవ్వాడు "పిచ్చీ సుశీ....." అన్నాడు జాలి పడుతున్నట్లు.
ఆ క్షణంలో
సుశీల ముఖం చూస్తోంటే బాలూ మనసులో మమత పొంగివచ్చింది....
"ఇలాటి సమయంలో
ఆడవాళ్ళ మనసులో ఏవేవో కోరికలు ఉంటాయని అంటారు -- నీకేం కావాలో అడుగు ...."
"అనవసరంగా ఆశ
పెట్టకండి ! న కోరికలు మీరు తీర్చలేరు?"
"ఈ బాలూ సంగతి
నీకు అర్ధం కావటం లేదు! అడిగి చూడు...."
"సరే!
అడిగేస్తున్నాను- నన్ను ఒక్కరోజు ఒక్క గంట ఎక్కడికైనా బయటికి
తీసికెళ్ళండి...."
నివ్వెరపోయి
చూశాడు బాలూ.
"చూసారా? అప్పుడే ఎలాగ అయిపోయారో..."
"అదికాదు .....
ఇలాంటి కోరిక ...."
"భయపడకండి! ఏ
విధంగానూ మిమ్మల్ని బంధించను- ఎప్పుడూ ఇలా ఈ మారుమూల గదిలో మీతో గడపడం నాకు ఎలానో
ఉంది. విశాలమైన ప్రకృతి ఒడిలో మీదాన్నిగా -- స్వేచ్చగా -- ఒక్క క్షణం ఊపిరి
తీసుకోవాలని ఉంది ...."
ఆర్తితో
అంటున్న సుశీల చెయ్యి ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకున్నాడు బాలూ.
"తప్పకుండా
తీసికేల్తాను...."
సుశీల కళ్ళు
మెరిశాయి.
సుశీలను బయటకు
తీసి కెళ్తనని రాజేశ్వరితో చెప్పాడు. బాలూ ....... రాజేశ్వరి ఎంతమాత్రమూ
ఒప్పుకోలేదు -- బాలూ ఎంత ఇస్తానన్నా ఒప్పుకోలేదు.
"నేను సుశీలను
తీసుకు వెళ్తున్నాను. ఏం చేస్తారో చేసుకోండి -----"
మొండిగా అని
సుశీల చెయ్యి పుచ్చుకుని తీసుకువచ్చాడు బాలూ.....
వీధి
గుమ్మానికి అడ్డుగా యమభటుడిలా నించున్నాడు, ఆ బ్రోతల్ ని
కాపలా కాసే గూండా . బాలూ ఆగిపోయాడు.
రాజేశ్వరి
వెక్కిరింతగా నవ్వి , "తీసుకు వెళ్ళండి
...." అంది.
బాలూ
విచిత్రంగా ఈల వేశాడు - మరుక్షణం ఎక్కడి నుంచి వచ్చారో , ఎలా వచ్చారో నలుగురు మనుష్యులు చేతిలో పిస్టల్ తో
సహా అక్కడికి హకరయ్యారు.
బాలూ
రాజేశ్వరిని చూసాడు.
"ఇప్పుడు
చెప్పండి! తీసుకు వెళ్ళనా? ఇంకా ఏమైనా అభ్యంతరాలా?"
రాజేశ్వరి
ముఖం పాలిపోయింది. బాలూను దెయ్యాన్ని చూసినట్లు చూస్తూ అస్పష్టంగా ఏదో గొణిగింది.
బాలూ సుశీలను
చూసి "రా!" అన్నాడు.
సుశీల ముఖం
రాజేశ్వరి ముఖాన్ని మించి పాలిపోయింది- ఆ ప్రయత్నంగా ఒక్క అడుగు వెనక్కు వేసింది.
"ఓ ! .... సరే? ఇప్పుడు నేనెవరో తెలిసిపోయింది కదా? నీకు ఇష్టం లేకపోతే రానక్కరలేదు -- ఎలాంటి
పరిస్తితులోనూ నేను ఎవరినో ఎవరికీ తెలియనివ్వను -- నీకోసమే ఇంత సాహసం చేసాను --
లోపలికి వెళ్ళిపోతావా?"
"లేదు ! మీతో
వస్తాను..."
సుశీల ముందుకు
నడిచి బాలూ చేతిలో చెయ్యి వేసింది.
బాలూ తిన్నగా
హోటల్ కి తీసుకువెళ్ళాడు.
"మళ్ళీ
ఇక్కడికా ...." అంది సుశీల చిరాగ్గా....
"ఇక్కడ మనం
ఉండేది కొన్ని గంటలే! నువ్వు తయారవ్వటానికి.... ముందు ముందు ఏదెలా జరుగుతుందో
చెప్పలేను -- కానీ ఇవాళ ఒక్కరోజు .... డబ్బు వల్ల లభ్యమయ్యే అన్ని రకాల ఆనందాలూ
నీకూ రుచి చూపించగలను...."
బాలూ వెళ్ళి
కొన్ని నిమిషాల్లోనే బట్టలు, వాటికి
సరిపోయే నగలూ తీసుకుని వచ్చాడు.
"త్వరగా
అలంకరించుకో! గొప్పింటి పిల్లలాగ ఉండాలి." బాలూ తెచ్చిన చీర ఎంతో బాగుంది -
ఆకుపచ్చ రంగు మీద జరీ పువ్వులు ..... పచ్చలూ, ముత్యాలూ
పొదిగిన దుద్దులు, నెక్లెస్, ఉంగరం .....
ఆకుపచ్చ బొట్టు కూడా చూసి " యెంత తెలుసు !" అని నవ్వుకుంది సుశీల ....
శ్రద్దగా అలంకరించుకుంది.
పై అలంకరణ
కంటే మనసు నిండిన తృప్తి ఎక్కువగా మెరుస్తోంది సుశీల ముఖంలో ..... సుశీల ముఖంలో ఆ
అనందం అర్ధం చేసుకుని లోలోపల నిట్టూర్చాడు బాలూ. సుశీలను తీసుకుని పెద్ద పెద్ద
హోటళ్ళకూ, షాపులకూ తిరిగాడు బాలూ ....... ప్రతిచోటా
బాలుకూ , అతనితో పాటు తనకు జరుగుతోన్న మర్యాదలకూ, సత్కారాలకూ నివ్వెరపోసాగింది సుశీల ...... బాలూ
లోలోపల నవ్వుకున్నాడు- సుశీలను కాన్వెంట్ కు తీసుకు వెళ్ళాడు -- సిస్టర్ ఎంతో
సంభ్రమంగా, ఆదరంగా ఆహ్వానించింది.
"ఈవిడ మీ
......." అని ఆగిపోయింది.
"భార్య : -
"టక్కున చెప్పాడు బాలూ ......... సుశీల బాలూ ముఖంలోకి చూపి తల దించుకుంది.
"అలాగే
అనుకున్నాను - ఇంతమంది అనాధ శిశువులకు అండగా నిలబడుతున్నారు. మీ బాబు తప్పకుండా
చాలా గోప్పవాడవుతాడు...."
సుశీల
అప్రయత్నంగా రెండు చేతులూ జోడించింది -- సిస్టర్ ఆప్రతిభురాలై పోయింది- సుశీల
గర్వంగా నవ్వినా, సిగ్గుగా తల వంచుకున్నా, ఆవిడ అర్ధం చేసుకోగలిగేది -- ఇలా చేతులు
జోడించటం......
"గొప్పవాళ్ళలో
ఇంత నిరాడంబరంగా .......ఇంత మంచిగా ఉండెవాళ్ళను ఎక్కడా చూడలేదు ....." అంది.
"డబ్బున్నంత
మాత్రాన గొప్పవాళ్ళు కారు సిస్టర్! నిజానికి మీకంటే గొప్పవాళ్ళు ఎక్కువమంది ఉండరు
..." మరింత ఆశ్చర్యపోయింది సిస్టర్. బాలూ వైపు తిరిగి నవ్వుతూ
"ఇన్నాళ్ళూ మీరే మంచివారని అనుకునేదానిని. మీ శ్రీమతి అన్ని విధాల మిమ్మల్ని
మించిపోయారు -- ఇలాంటి సంస్కారమూ సహృదయమూ , ఎక్కడా
చూడలేదు ---- మీరిద్దరూ చాలా అదృష్టవంతులు
-" అంది.
బాలూ సిస్టర్ కి
"థాంక్స్" చెప్పి సుశీలతో వచ్చేసాడు - చెమ్మగిల్లిన సుశీల కళ్ళను చూస్తూ
'ఇవాళ
నాతొ సంతోషంగా గడపాలని బయలుదేరావు ....." అన్నాడు ....
"ఇప్పుడు నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు ? కొన్ని కొన్ని సందర్భాలలో వచ్చే
కన్నీళ్ళలో ఎంత అనందం ఉంటుందో తెలుసా?"
తెలిసింది బాలూకి. కళ్ళు చెమ్మగిల్లినా , ఏదో అపూర్వమైన కాంతితో
వెలిగిపోయే సుశీల ముఖం చూస్తోంటే ........
సుశీలతో కలిసి నదిలో బోట్ మీద తిరిగాడు బాలూ. పట్టరాని ఆనందంతో
పసిపిల్లలా పకపకలాడింది సుశీల........
"నేనెవరో తెలుసా ? మీ భార్యను- " గర్వంగా
అంది.
"కొంపతీసి తాళి కట్టమంటావేమిటి? ఆ తాళి వల్ల కట్టిన నాకు కాని, కట్టించుకున్న నీకు కాని ఎలాంటి
ప్రయోజనమూ లేదు."
"మీకేం తెలియదు -- భార్య అంటే తాళి కట్టించుకున్నది కాదు --
ప్రేమించిన స్త్రీ."
రెండు చేతులూ జాపి సుశీలను ఆదరంగా గుండెల్లోకి తీసుకున్నాడు
బాలూ..........
*
* *
యశోధర , భర్త
వేణుతో కలిసి వస్తున్నానని ఉత్తరం రాసింది. నీరజ వెలవెలపోతూ "పోనీ నేను
కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఉండనా?" అంది....
"కొన్ని రోజులు కాదు గదా, కొన్ని క్షణాలైనా నువ్వు ఈ
ఇంట్లోంచి వెళ్ళడానికి వీల్లేదు -- యశోధరకు పెళ్ళి అయిపొయింది -- కాబట్టి నా
కారణంగా నా చెల్లెలి జీవితం పాడవుతుందేమోనని భయపడక్కర్లేదు. ఇంక ఏది ఎలా జరిగినా
ఎదుర్కోగలను."
తీవ్రంగా అన్నాడు ప్రభు .....లక్ష్మీ దేవి ఏమీ మాట్లాడలేదు....
మొత్తం మీద యశోధర వేణుల రాకతో ఇంట్లో వాతావరణం కొంత ఉత్సాహంగా
ఉంది.... వేణు ప్రభును మనసారా అభినందించాడు , "ఇలాంటి భార్య దొరకటం మీ అదృష్టం
....." అని.....
యశోధర , వేణు రోజూ సాయంత్రం ఎక్కడికో ఒకచోటికి
షికారుగా బయలుదేరేవారు - ఒకరోజు వేణు ప్రభుతో "మీరూ రండి?"
అన్నాడు.
నీరజ కంగారుపడి "మీ మధ్య మేమెందుకు ? మీరు వెళ్ళి రండి?"
అంది.
వేణు నవ్వుతూ -" అంత కంగారెందుకు చెల్లెమ్మా ! మీ ఇద్దరికీ
మేం అడ్డురాములే, సరదాగా
వెళ్దాం రండి ...." అన్నాడు.
యశోధర, వేణు
సరదాగా తెరుగుతోంటే ప్రభులో తను కూడా నీరజతో అలా తిరగాలనే కోరిక కలగసాగింది-
నీరజను పక్కకు పిలిచి "మనమూ వెళ్దాం నీరజా! ఎంతకాలమని ఇలా ఇంట్లో మగ్గిపోతాం? సంఘాన్ని లెక్కచెయ్యకుండా
నిలబడాలని నిర్ణయించుకున్నాం ! నిలబడదాం ...." అన్నాడు.
గుమ్మం కదలకుండా ఏదో అపరాధం చేసి బందీ అయినట్లు ఇంట్లోనే ఉండిపోవటం
నీరజకు కష్టంగానే ఉంది -- తయారయి బయలుదేరింది.
నలుగురూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడవసాగారు- కానీ ఆ సంతోషం
ఎక్కువసేపూ నిలవలేదు -- ఆ నలుగురికీ వినపడేలాగా జనం మాటలు విసరసాగారు........
"ఆ అమ్మాయి నీరజ కదూ."
"ఆ మధ్య ఎక్కడికో వెళ్ళిపొయిందన్నారు...."
"వెళ్ళటం....రావటం .....ఆవిడకు అలవాటే కదూ...."
"ఈసారీ మళ్ళీ అక్కడికే నంటావా?"
"దేవుడికి తెలియాలి!"
"చిత్రంగానే ఉంది ."
"అంతకంటే చిత్రం! ప్రభు ఆ అమ్మాయిని చేసుకుంటానని అనటం
....."
"ఎంత సాహసం?"
"నెమ్మదిగా అంటున్నావా ? శీలం సింగినాదం వదిలెయ్యి
.....ఆ గూండాలతో లావాదేవీలు...... ప్రాణాలకు సుఖం ఉంటుందా?"
"ప్రభుకు అంత ప్రేమ ఉందా ఆవిడ మీద?-"
"వెఱ్రి వేయి విధాలు...."
నీరజకు తల తిరిగిపోసాగింది. ప్రభు చెయ్యి గట్టిగా పెట్టుకోకపోతే తూలీపోయేదే!
వేణు మొదట ఈ మాటలు తమను ఉద్దేశించినవని అనుకోలేదు .... కానీ అవతలివాళ్ళు కావాలని
రెట్టించి రెట్టించి అనటమూ, యశోధర
కంగారు పడటమూ, నీరజ
ముఖం పాలిపోవటమూ , ప్రభు
బాధపడటమూ అతనికి అనుమానం కలిగించాయి. నీరజను మళ్ళీ పరీక్షగా చూశాడు అతనికి గుర్తు
వచ్చింది అవును -- ఆ మధ్య పేపర్లలో వచ్చిన వార్త ఈ అమ్మాయిని గురించే.
ఆ రాత్రి భార్యను నిలదీసి అడిగాడు వేణు..... చేసేది లేక యశోధర
సమస్తమూ చెప్పేసింది.
"ఏవిటీ? అలాంటిదాన్ని .....ఆ గూండాల చేతుల్లో
పడి తిరిగివచ్చినదాన్ని ..... మీ అన్నయ్య చేసుకుంటున్నాడా ?"
అన్నాడు
ఆశ్చర్యంగా వేణు.
"అవును పాపం! ఇందులో నీరజ తప్పు ఏముందీ? నీరజ ఎంత మంచిదో నాకు బాగా
తెలుసు."
"ఛీ! ఛీ! సిగ్గు లేకపోతే సరి." చీదరించుకుంటూ అన్నాడు
వేణు.
ఒక రాత్రివేళ తన పక్కన ఎవరో పడుకున్నట్లు అయి మెలకువ వచ్చింది
నీరజకు.
ఎవరో మొగవాడు తన పక్కన పడుకుని తనను గట్టిగా కౌగలించుకుంటున్నాడు.
ప్రభు కాదు! ప్రభు ఎప్పటికీ అలా ప్రవర్తించడు.
"ఎవరూ ?" అంది భయంగా .... గట్టిగా.
ఆ ఆకారం నీరజ నోరు నొక్కేసింది.
"హుష్ నేనే?"
వేణు కంఠ స్వరం గుర్తు పట్టింది నీరజ -- నిర్ఘాంతపోయింది.
తనను చెల్లమ్మా అని నోరారా పిలిచినా వేణు .... ప్రభును ఎంతగానో
అభినందించిన వేణు .......ఇంత నీచంగా ..... చెప్పుడు మాటలకు ప్రభావం ఉంటుందా?
"వెళ్ళిపొండి -" అంది కోపంతో - చికాకుతో వణికిపోతూ.
"పెద్ద ప్రతివ్రతా వేషాలు వేయకు."
నీరజ అసహ్యం అవధులుదాటింది.
వెళ్ళిపోతారా ? అరవనా?" గట్టిగానే అంది.
వేణు భయపడి
లేచిపోయాడు.
జరిగిన సంగతి
ఎవరికైనా చెప్పాలో. చెప్పకూడదో కూడా నిర్ణయించుకోలేకపోయింది నీరజ.
ఏమీ జరగనట్లే
ఊరుకుంది నీరజ -- కానీ వేణు -- ఊరుకోలేదు -- ప్రభును పిలిచి "నేను ఒక్కసారి
నీరజను పరీక్ష చేయాలి?" అన్నాడు.
ప్రభుకు చాలా
కోపం వచ్చింది.
"పరీక్ష
చెయ్యవలసిన అవసరం లేదు -- ఏమీ జరగలేదని నీరజ చెప్పింది."
"ఆవిడ అలా కాక
ఇంకెలా చెప్తుంది?"
"నాకు నీరజ
మాటల్లో నమ్మకముంది. అదీ కాక పోలీసులు నియమించిన డాక్టర్ కూడా నీరజకు ఏ ప్రమాదమూ
జరగలేదని చెప్పాడు."
"దానిదేముందీ? కాస్త లంచం పడేస్తే ఎలా అంటే అలా చెప్తాడు."
ప్రభు కోపం
అణచుకోలేకపోతున్నాడు.
"అయినా మీకెందు
కాబాధ? పెళ్ళి చేసుకోబోతున్నది నేను?" వెటకారంగా నవ్వాడు ప్రభు.
"అవును నువ్వే!
ఇంతటి మహాకార్యం మరొకరు చెయ్యలేరు- కానీ ఇది ఒక్క శీలానికి సంబంధించినది కాదు.
ఆరోగ్యానికి కూడా సంబంధించినది ..... ఆవిడకు ఏవైనా జబ్బులు పట్టుకునే అవకాశం ఉంది.
వెంటనే చెక్ చేయించుకోకపోతే, ఇంట్లో అందరి
ఆరోగ్యాలూ పాడవుతాయి."
ప్రభు నోట
మాటరాలేదు - ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు వేణు?
"నాకు నీరజలో
నమ్మకం ఉంది. ఏ పరీక్ష చెయ్యవలసిన అవసరం లేదు - ఎవరికీ ఎలాంటి జబ్బులూ రావు."
"పోనీ, ఒక్కసారి పరీక్ష చేస్తే వచ్చిన నష్టం ఏముందీ?"
"నావల్ల కాదు
-- నీరజను అలా అవమానించలేను."
"అయితే నేను
ఇక్కడిక ఉండలేను. మీకు ఉన్నంత త్యాగబుద్ది నాకు లేదు."
"మీ
యిష్టం."
ఈ సంభాషణ అంతా
రహస్యంగా జరగలేదు..... నీరజ , ల,లక్ష్మీదేవి, యశోధర ఉండగానే
జరిగింది.
"నాకు చావు
ఎందుకురాదో !" అని తల కొట్టుకుని లక్ష్మీదేవి అక్కడి నుండి వెళ్ళిపోయింది.
"త్వరగా నీ
సామానులు సర్దుకో!" అన్నాడు యశోధరతో వేణు.
"సర్దుకునే
ఉన్నాను!"
శాంతంగా
చెప్పింది యశోధర.
"నిజంగానా?" ఆశ్చర్యంగా అడిగాడు.
"ఎందుకంత
ఆశ్చర్యం? మా అందరి మేలూ కోరి మీ రింతగా చెప్తోంటే
కాదంటానా? ఎంత స్వార్ధత్యాగం మీది? మీకు ఏం వచ్చినా పరవాలేదనుకొని అర్ధరాత్రి పక్క
దగ్గరకే వెళ్ళగలరు- మిగిలిన వాళ్ళు ఆరోగ్యం గురించి మాత్రం ఎక్కడ లేని శ్రద్దా
తీసుకోగలరు ?" స్థాణువై
నిలబడిపోయాడు వేణు.
"ఎవరు చెప్పారు
ఈ సంగతి ? నీరజేనా?"
"కాదు! నీరజకు
అంత మంచి బుద్ది లేదు - జరిగిందంతా మింగేసి సహనంతో నోరు మూసుకుంది -- ఆరోజు నీరజ
గట్టిగా అరిచేసరికి నాకే మెలకువ వచ్చింది. నేనే అంతా విన్నాను."
"విని ."
"విని కూడా
నోరు మూసుకున్నాను -- ఈ ప్రస్తావన మళ్ళీ మీ దగ్గర లేవటానికి కూడా అసహ్యం వేసింది
-- కానీ, ఇవాళ మీ ఔదార్యం
చూసాక......"
వేణు తల
వంచుకుని వెళ్ళిపోయాడు - మళ్ళీ వెళ్ళిపోతానని అనలేదు -- కానీ వాతావరణంలో మాత్రం
వెనకటి ఉల్లాసం పూర్తిగా లోపించింది.
యశోధర , వేణు వచ్చిన దగ్గరనుండి, లక్ష్మీదేవి , నీరజ వీధి గదిలో పడుకుంటూన్నారు- ఒక రాత్రి వేళ
లక్ష్మీదేవికి ఎందుకో మెలకువ వచ్చింది. వీధి తలుపులు తెరిచి ఉన్నాయి. లక్ష్మీదేవి
గుండెలు ఝల్లుమన్నాయి.
"దొంగ!
దొంగ!" అని గట్టిగా అరిచింది -- ఆ గోలకు ఇట్లో అందరూ లేచారు -- కంగారుగా
వెతుకున్నారు -- అన్ని వస్తువులూ ఉన్నాయి. ఏమీ పోలేదు.
"అన్నట్లు నీరజ
ఏదీ?" అన్నాడు వేణు.
అందరూ నీరజ
కోసం చూసారు -- ఎక్కడా లేదు.
ఎవ్వరూ ఏమీ
మాట్లాడలేదు -- ఎవరి మటుకు వారికే నోరు విప్పడానికే భయంగా ఉంది -- కానీ ఎవరూ
నిద్రపోలేదు -- అందరూ హాలులోనే కూర్చున్నారు.
"ఆ రాక్షసి నా
కొడుకు గుండెలు పగలకొట్టడానికే పుట్టింది ....." అంటూ ఏడ్చింది లక్ష్మీదేవి.
ఆ ఏడుపు
విన్నాక మాట్లాడటానికి వేణుకు ధైర్యం వచ్చింది.
"ప్రభూ! మీరా
అమ్మాయిని మరచిపోవటమే మంచిది -- ఎప్పటికప్పుడే ఇలాంటి
ఉపద్రవాలను ఎదుర్కొంటూ ఎన్నాళ్ళని సహించగలరు ?" అన్నాడు.
"అసలు నీరజ
మళ్ళీ వస్తుందా?" బెంగగా అంది యశోధర.
"పీడా
వదిలిపోతుంది -- అది రాకపోతే వెయ్యి దేముళ్ళకు కొబ్బరికాయలు కొట్టుకుంటాను ."
కసిగా అంది లక్ష్మీ దేవి.
సరిగ్గా ఆ
సమయంలో ఇంట్లోకి అడుగు పెట్టింది నీరజ.
ముఖంలో కంగారు, భయమూ, ఆరాటమూ
స్పష్టంగా కనిపిస్తున్నాయి . ఎంతో దూరం నుండి నడిచి వచ్చినదానిలా అలసటగా ఉంది --
అందరి ముఖాలలోకి ఒక్కసారి చూసి తలవంచుకుని నిలబడింది.
"ఎక్కడికి
వెళ్లావు నీరజా?" అనునయిస్తున్నట్ట్లుగా
అడిగాడు ప్రభు.
నీరజ
మాట్లాడలేదు.
అలాంటి
పరిస్థితిలో కూడా ప్రభు నీరజతో అంత ఆప్యాయంగా మాట్లాడటం లక్ష్మీదేవి మనసు
మండించింది.
"నీరజా! నిన్ను
నమ్మి కళ్ళు మూసి పడుకున్నందుకు తలుపులు బార్లా తీసి పోయావెందుకు ? దొంగలు పడి ఇల్లు దోచుకు పొతే ఏం జరిగేది?"
వేణుకు అవకాశం
దొరికింది.
"ఏమిటండీ మీ
పిచ్చి! నీరజ ఇక్కడ ఉండగా మీ ఇంటికి దొంగలేందుకు వస్తారు ?" అన్నాడు.
నీరజ ఎవరి మాటలకూ సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో ఇంటి ముందు కారు ఆగింది. అందులోంచి నీలకాంత్ దిగాడు. నీరజ దెయ్యాన్ని చూసినట్లు బెదిరింది. నీలకాంత్ నీరజను చూసి కనపడీ కనపడనట్లు నవ్వీ, "ఇదేమిటి? ఇంత రాత్రి వేళ అందరూ ఇలా కూర్చున్నారేం?" అన్నాడు.
"మీరు ఎలా వచ్చారు ఈ సమయంలో -----" ఆశ్చర్యంగా అడిగింది యశోధర.
"రెండో అట సినిమా చూసి వస్తున్నాను. ఇంట్లో లైట్లు వెలుగుతోంటే మెలకువగా ఎందుకున్నారోనని ఆశ్చర్యపోతూ కనుక్కుందామని వచ్చాను."
నీలకాంత్ మాటలకూ వేణు సమాధానం చెప్పాడు.
"నీరజ అర్ధరాత్రి ఇంట్లోంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. దొంగలు పడతారని అత్తయ్యగారు ఆందోళన పడుతోంటే .... నీరజ ఉండగా ఆ భయం లేదని నేను చెప్తున్నాను...."
నీలకాంత్ వేణు వంక చురుగ్గా చూసాడు. వేణు కళ్ళల్లో నీలకాంత్ కేదో కనిపించింది.
"వేణూ మీరు నీరజ పైన లేనిపోనీ అభాండాలు వేస్తున్నారు. నీరజ నాకు బాగా తెలుసు. పోనీ, మీరన్న మాటలు నిజమయితే, ఇంత రాత్రివేళ ఎక్కడికో వెళ్ళి వచ్చిన నీరజ దగ్గిర డబ్బో, దస్కమో ఏదో ఒకటి ఉండాలి గదా ...."
నీరజ చేతిలో ఉన్న చిన్న బేగ్ వైపు వేణు సైగ చేస్తూ అన్నాడు నీలకాంత్.
వేణు పులిలా ముందుకు దూకి నీరజ చేతిలో బేగ్ లాక్కుని తెరచి చూశాడు.
అందులో బేంక్ బుక్ ఉంది. ఆ బుక్ లో అంతకు ముందు రోజే నీరజ పేర యాభైవేలు డిపాజిట్ చెయ్యబదినట్లుగా ఉంది.
ఆ బుక్ అందరికీ చూపిస్తూ విరగబడి నవ్వాడు వేణు.
నీలకాంత్ ఆశ్చర్యం నటిస్తూ "నేను ఏదో యధాలాపంగా అంటే నిజంగా జరుగుతుందని అనుకోలేదు. అయాం సారీ నీరజ!" అన్నాడు.
నిస్సహాయంగా ఉన్న వ్యక్తిని నిష్కారణంగా గుండెల్లో పొడుస్తుంటే ఆ వ్యక్తీ ముఖం ఎలా ఉంటుందో అలా ఉంది నీరజ ముఖం.
"ఛీ! ఛీ! ఇంక ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండను ....." అని యశోధర చెయ్యి పట్టుకుని బరబర ఈడ్చుకుపోయాడు వేణు. లక్ష్మీదేవి వంటింట్లోకి పోయి దేముడి ముందు కూలబడిపోయింది.
"డోంట్ వర్రీ ప్రభూ! ఇప్పటికీ నాకు నీరజలో తప్పు ఉందని అనిపించటం లేదు. అనవసరంగా నీరజను కష్టపెట్టకు. ఇద్దరూ అన్ని విషయాలు స్పష్టంగా మాట్లాడుకుని అపార్దాలన్నీ తొలగించుకుని అన్యోన్యంగా ఉండండి...." అని ప్రభు భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు నీలకాంత్.
తలెత్తి నీరజ ముఖంలోకి చూసిన ప్రభు మనసు కరిగిపోయింది. అంత దీనంగా ఎవరి ముఖమూ అతనెప్పుడూ చూడలేదు.
నీరజా! నీకు నా దగ్గర భయమెందుకు? ఏం జరిగిందో ....." ప్రభు మాటలు పూర్తి కాకుండానే అడ్డు తగిలింది నీరజ.
"నన్ను క్షమించు ప్రభూ! నీకేమీ చెప్పలేను. కానీ నావల్ల నీకు ఇబ్బంది రానియ్యను. వెళ్ళిపోతాను...."
గుమ్మం దాకా వెళ్లిన నీరజను చెయ్యి పుట్టుకుని బలవంతంగా లోపలకు లాగి తలుపులు డభాలున మూసాడు ప్రభు.
* * *
ప్రభు
కాలుకాలిన పిల్లిలా ఇల్లంతా తిరుగుతున్నాడు. వెతికినవే మళ్ళీ మళ్ళీ డ్రాయర్లన్నీ
వెతుకుతున్నాడు. లక్ష్మీదేవి ఎన్నోసార్లు..... "ఏం జరిగింది?"
అని
అడిగింది . నీరజ కూడా "ఏమిటి ప్రభూ!" అంది.
కంపెనీ డబ్బు అయిదువేల రూపాయలు బేంక్ లో జమ చెయ్యాలి. కొంచెం
అశ్రద్ధ చేసి ఆ మరునాడు వేద్దామని డ్రాయరు లో పెట్టి తాళం వేసాను. ఇప్పుడది
పోయింది. ఆ డబ్బు జమకట్టక పొతే ఉద్యోగం పోతుంది. పైగా బ్లాక్ మార్క్...."
నీరజ ముఖం పాలిపోయింది.
"జాగ్రత్తగా చూసావా?"
"ఆ! అన్ని విధాలా అన్ని చోట్లా వెతికి నిరాశ చేసుకున్నాకే
నీకు చెపుతున్నాను...."
నీరజ ఇంకేమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాలు నీరజ సమాధానం కోసం ఎదురు
చూసి, రాకపోవటంతో
తల్లి దగ్గిరకు వెళ్ళి సంగతంతా చెప్పి "ఎలా అయినా ఆ ఐదువేలు పుట్టించగలమా
అమ్మా!" అన్నాడు.
"అయిదు వేలు? ఎక్కడ్నించి వస్తాయి? యశో పెళ్ళి ఈ మధ్యనేగా చేసాము!
ఇంకా ఆ అప్పు తీరనే లేదు.... పోనీ ఎక్కడైనా అప్పుగా దొరుకుతుందేమో చూడు.
"ఎవరిస్తారమ్మా!"
"ఛ! ఛ! అన్నీ శనిరోజులే! ఆ నీరజది మొదటి నుండీ శని జాతకమే? తల్లిని మింగింది. పోనీ ఎలాగో
బ్రతుకుతుందనుకుంటే ఎప్పటికప్పుడే ఉపద్రవాలు. దాన్ని ఈ ఇంటికి తెచ్చావు. ఇక్కడా
శని పట్టుకుంది ...."
"అమ్మా!" బిగ్గరగా , కోపంగా మందలించాడు ప్రభు.
"అన్నట్లు నీరజ దగ్గర యాభై వేలు ఉండాలి కదా, అడిగి తీసుకో"
ప్రభు మాట్లాడలేదు. లక్ష్మి దేవికి చికాకులేసింది. తనే నీరజను
కేకేసింది.
"ప్రభుకు అర్జంట్ గా అయిదు వేలు కావాలి. లేకపోతే వాడి
ఉద్యోగమే పోతుంది...."
"చెప్పాడు అత్తయ్యా! అది తలచుకునే బాధపడుతున్నాను."
"బాధపడటం దేనికి? నీ దగ్గిర యాభై వేలున్నాయిగా? అయిదువేలియ్యి....."
"అత్తయ్యా? అది నా డబ్బు అయితే నువ్వు చెప్పేవరకూ
అగేదానినా?"
"ఏం నంగనాచివే? నీ డబ్బు కాకపొతే నీ పేరు మీద
బేంక్ లో ఎందుకుందీ?"
"ఆ సంగతులేవీ నేను చెప్పలేను ?"
"పోనీ , నీ పేరు మీద ఉందిగా! ప్రస్తుతం
తీసియ్యి. తరువాత చూసుకోవచ్చును...."
"ఆపని నేను చెయ్యలేనత్తయ్య! ఏ పరిస్థితుల్లోనూ ఆ డబ్బు నేను
వాదననే నమ్మకంతోనే దానిని నా పేరుమీద ఉంచారు."
"ఛీ ఛీ! అందరి కందరూ స్వార్ధపరులు. డబ్బుదగ్గిర ఎవరి మటుకు
వాళ్ళే గట్టివాళ్ళు! వంకలకేం ..... కావలసినన్ని."
"అమ్మా........." ప్రభు ఏదో అనబోయాడు.
"ప్రభూ! అమ్మా అమ్మా' అంటూ నా నోరు మయ్యడానికి
ప్రయత్నించకు. నీకోసం ......నీ క్షేమం కోసం..... నా మనసు అల్లాడి పోతోంది. దీని
కోసం నువ్వెంత చేసావు? ముష్టి
అయిదు వేలు ఇవ్వలేదూ? అంత
కాపీనమా? దాని
కర్మాన దాన్ని వదిలి లక్షణంగా మరో మంచి పిల్లను చూసుకుంటే కట్నంగా అయిదు కాదు, పదివేలు వస్తాయి....."
"ఇదంతా జరిగేపని కాదులే అమ్మా!...."
"అంటే...ఈ శనిగొట్టు
దరిద్రదేవతకోసం...ఈ పాషాణపు పిసినిగొట్టు కోసం...ఈ స్వార్థపిశాచి కోసం నీ ఉద్యోగం
కూడా పోగొట్టుకుంటావా?..."
"ఏదో ఆలోచిద్దాంలే!"
వెళ్ళిపోయాడు ప్రభు.
"ఛీ!ఛీ! ఇంత నరకం పగవాళ్ళకి కూడా వద్దు ... ఇంతకింతా
అనుభవిస్తుంది. అనుభవించి తీరుతుంది..." కసిగా శపించింది లక్ష్మీదేవి.
లక్ష్మీదేవి ఆవేదన నీరజకు అర్థమవుతోంది. తను చెయ్యగలిగినది ఒకటే
ఉంది.
"ప్రభూ! అత్తయ్య చెప్పిన ఉపాయమే బాగుంది..."
"ఏమిటది?"
"నువ్వు ఎవరినైనా పెళ్ళిచేసుకో! కట్నంగా బోలెడు
డబ్బువస్తుంది. అన్ని సమస్యలూ తీరిపోతాయి..."
"ఏం? నన్ను
చేసుకోవాలని లేదా నీకు?"
"లేదు..."
"అవును, నాకు ఉద్యోగం పోతే, ఈ బీదవాడితో నువ్వూ కష్టాలు
పడవలసివస్తుంది..."
"సరిగ్గా ఊహించావు - నాకు సుఖపడాలని ఉంది...బోలెడు సుఖం."
నీరజ ఆ మాటలన్న ధోరణికి ప్రభు నవ్వాడు.
"నీరజా! నేను మరొకరిని చేసుకుని సుఖపడగలనని నువ్వు
అనుకోగలవేమో, కానీ
నన్ను వదిలి నువ్వు సుఖపడతావని నేను ఒక్కనాటికీ అనుకోలేను. నీదగ్గిర నిజంగా డబ్బు
ఉంటే నాకు కాకుండా దాచుకుంటావని కూడా ఊహించలేను. అసలే నా మనసు చికాగ్గా ఉంది. ఈ
ప్రస్తావన వదిలి మనకు అయిదువేలు ఎక్కడ అప్పుగా దొరుకుతుందో ఆలోచించు..."
నీరజ ఏం ఆలోచించగలదు?
ఆ సాయంత్రమే నీలకాంత్ ప్రభుదగ్గరకు వచ్చాడు.
"ప్రభూ! అయిదువేలకోసం అనవసరంగా ఇబ్బందులలో చిక్కుకుంటున్నావా?"
అన్నాడు.
"నీకెవరు చెప్పారు?"
"నువ్వు చెప్పకపోయినా నాకు నీ సంగతులు తెలుస్తూనే ఉంటాయి_ఇవిగో, అయిదువేలు తీసుకువచ్చాను."
ప్రభు కళ్ళు నీరజ కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళలో అంత భయం...దేనికి?
"వద్దు నీలకాంత్ ఏదో ఉపాయం ఆలోచిస్తాలే!"
"పోనీ అప్పుగానే తీసుకో ప్రభూ! నెమ్మదిగా తీర్చుకోవచ్చు_ఆపదలో నిన్ను ఆదుకోలేకపోతే, ఆ తర్వాత స్థిమితంగా
ఉండలేను..."
ప్రాధేయపడుతున్నట్లు అన్నాడు నీలకాంత్ - లక్ష్మీదేవి ముఖం ఆవిరులను
చిమ్ముతోంది... తను ఇంకా అభ్యంతరపెడితే తల్లి నీరజను ఇంకా ఎన్నెన్ని మాటలంటుందోనని
భయపడ్డాడు ప్రభు. అదీగాక తనకైనా మరొక మార్గం తోచటంలేదు. చెయ్యిజాపి నీలకాంత్ దగ్గర
డబ్బు తీసుకున్నాడు. "థాంక్యూ!" అన్నాడు గొణుగుతున్నట్లు. నీలకాంత్
నీరజను చూసి నవ్వి వెళ్ళిపోయాడు.
ప్రభు ఉద్యోగం పోలేదు_కానీ గుసగుసలు చెలరేగాయి_అటు ఆఫీసులోను, ఇటు ఇంట్లోను స్థిమితంలేక ప్రభు
గుండెనొప్పి తిరగబెట్టింది.
ఏమాత్రం లేవలేని స్థితిలో అడ్డంపడిపోయాడు.
"ఇది ఏమాత్రమూ అశ్రద్ధచెయ్యటానికి వీల్లేదు అత్తయ్యా! వెంటనే
హాస్పిటల్లో చేర్పించాలి" అంది నీరజ.
"నీకెలా తెలుసు?"
"ఈ నొప్పి రావటానికి ఒకరకంగా కారణం నేనే! అప్పుడు నాకోసం
వస్తూనే కారుక్రిందపడి దెబ్బతగిలించుకున్నాడు..."
ఈ సంగతి వినేసరికి లక్ష్మీదేవి కోపం, ఉద్రేకం పట్టలేకపోయింది.
"దౌర్భాగ్యులారా! వాడి ప్రాణానికి నువ్వెక్కడ దొరికావే!
వాడిని మింగి నా కడుపున చిచ్చుపెట్టి...ఛీ! ఛీ! ఏం మాట్లాడుతున్నాను నేను?"
దేనికీ చలించలేదు నీరజ...ఎక్కడలేని ధైర్యమూ తెచ్చుకుంది. హార్ట్
స్పెషలిస్ట్ నారాయణరావుగారి హాస్పిటల్ లో ప్రభును చేర్పించింది. డాక్టర్
నారాయణరావుకు చాలా మంచిపేరు ఉంది. అయితే అతడి హాస్పిటల్ లో సామాన్యులు చేరలేరు.
డాక్టర్ ఫీజు, రూం
రెంట్ అన్నీ చాలాచాలా ఎక్కువగా ఉంటాయి.
"ఇప్పుడెలా చేర్చావు ఆ హాస్పిటల్ లో ... వాడి ప్రాణంమీదకు
వచ్చాక, ఇప్పుడు...ఆ
డబ్బు నీదయిందా?..."
లక్ష్మీదేవి మాటల్లో ఏ ఒక్కదానికీ ఎలాంటి సమాధానము చెప్పలేదు నీరజ.
ప్రభు సిక్ లీవ్ పెట్టి నాలుగయిదు నెలలు విశ్రాంతి తీసుకోక తప్పదు.
తను ఏంచెయ్యాలో నిర్ణయించుకుంది.
*
* *
ప్రాక్, బాబ్డ్ హెయిర్, లిప్ స్టిక్...ఈ వేషంలో నీరజను
చూసి తన కళ్ళను తను నమ్మలేకపోయింది లక్ష్మీదేవి.
"అత్తయ్యా! నేను ఉద్యోగ ప్రయత్నంమీద వెళ్తున్నాను" అంది
నీరజ.
లక్ష్మీదేవికి కంపరమెత్తింది.
"వాడు అలా పడివుంటే నువ్వింత విడ్డూరంగా సింగారించుకుని
ఉద్యోగానికంటూ బయలుదేరుతున్నావా? ఇలా సింగారించుకోకపోతే ఆ ఉద్యోగం
దొరకదా?"
"దొరకదు!"
"అదేలాంటి ఉద్యోగమో!"
"చెప్పుకోదగినంత పరువైనది కాదు."
నీరజ వెళ్ళిపోయింది ... వెనుకటి అనుభవాలతో మళ్ళీ నీరజ పేరుతోనే
ఉద్యోగ ప్రయత్నం చేయటానికి భయపడింది నీరజ.
నీరజ క్లబ్ లో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నరోజులలో
కొన్నికొన్ని విషయాలు తెలుసుకుంది. ధనిక కుటుంబాలలో కొందరు ఆడవాళ్ళు ఇంటి విషయాలు
ఏవీ పట్టించుకోరు. పిల్లల విషయం చూసుకోవటానికి ఇంటి వ్యవహారాలూ నిర్వహించుకోవటానికి
మంచి జీతాలిచ్చి, వాళ్ళు
చదువూ, సంస్కారమూ
ఉన్న తనలాంటి వాళ్ళను పెట్టుకుంటారు. అలాంటి ఉద్యోగాలు నాలుగయిదు ఉన్నాయని
తెలుసుకుంది. ఒక్కొక్కచోటికీ వెళ్ళి విచారించింది. సేఠ్ రమణ్ లాల్ ఇంట్లో
అన్నివిధాలా అనుకూలంగా తోచింది ...అతని భార్య రోగిష్టిది_ అదేం రోగమోకాని ఎప్పుడూ మంచంలో
పడుకుని మూలుగుతూ ఉంటుంది... అతనికి ఇద్దరు పిల్లలు_ఒక ఆడపిల్ల ___ ఆ పిల్లకు మనస్థిమితం లేదు.
పెద్ద మొద్దుగా ఉంటుంది. ఒక మగపిల్లవాడు ... వాడికి రెండు కాళ్ళూ లేవు. వీల్ చైర్
లో దిగాలుగా కూర్చుని ఉంటాడు.
"అంతకుముందు ఉన్నమనిషికి మూడువందలిచ్చాను. నీకు నాలుగు
వందలిస్తాను..." అన్నాడు రమణ్ లాల్.
పని చాలా ఎక్కువ...అనారోగ్యంతో ఉన్న గృహిణిని, వెర్రిబాగుల పిల్లను, కుంటిపిల్లవాడిని
చూసుకోవాలి...ఏరోజుకారోజు ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటూ లెక్కలన్నీ రమణ్ లాల్ కు
అప్పగించాలి...వేళకు మందులియ్యటంలో కాని, అన్నపానాదులలోకాని, ఎక్కడా ఏ పొరపాటూ జరగటానికి
వీల్లేదు... కానీ, నాలుగువందల
జీతం బాగా ఆకర్షణీయంగా
ఉంది.
లక్ష్మీదేవి మొదట్లో నీరజను ఎంత
చీదరించుకున్నా రానురాను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. పగలంతా పనిచేసివచ్చినా, రాత్రి ఒక్క నిముషమయినా
విశ్రాంతి తీసుకునేదికాదు నీరజ ... ప్రభు మంచం పక్కనే కూర్చునేది ... డాక్టర్
ఇయ్యమన్న మందులు తనే స్వయంగా ఇచ్చేది ... నీరజ మనిషా, యంత్రమా అని ఆశ్చర్యపడేది
లక్ష్మీదేవి.
నెలరోజులు హాస్పిటల్ లో ఉండేసరికి ప్రభు ఆరోగ్యం చెప్పుకోదగినంత
బాగుపడింది.
"నువ్వు ఉద్యోగం చేస్తున్నావా?" అన్నాడు ప్రభు.
నీరజ బ్రతిమాలుతున్నట్లు "నీకు పుణ్యం ఉంటుంది-ఇప్పుడేమీ
అనకు... ఇప్పుడిప్పుడే అత్తయ్యకు నామీద కోపం పోతోంది. పైగా..."
ఏదో చెప్పబోయి ఆగిపోయింది నీరజ.
"పైగా...ఏమిటి?" రెట్టించాడు ప్రభు.
"మనం నీలకాంత్ అప్పు తీర్చుకోవద్దా!..." తలవంచుకుని అంది
నీరజ.
ప్రభు నవ్వి నీరజ చేతిని ఆదరంగా నొక్కాడు.
డాక్టర్ నారాయణరావుగారు ఆపరేషన్ చేస్తానన్నారు.
"ఆపరేషన్ చేస్తే ఇంక ఈ నొప్పి మళ్ళీమళ్ళీ రాకుండా పూర్తిగా
తగ్గిపోయే అవకాశం ఉంది-కానీ కనీసం రెండునెలలైనా నా అబ్జర్వేషన్ లో హాస్పిటల్ లోనే
ఉండాలి."
ప్రభు ఆపరేషన్ చేయించుకోవటానికి ఒప్పుకున్నాడు. ప్రభు నచ్చజెప్పగా
లక్ష్మీదేవికూడా ధైర్యం తెచ్చుకుంది. దిగాలుగా కూర్చున్న నీరజ చెక్కిలిమీద కొట్టి
"ఏమిటా పోజు! నువ్వు పక్కన ఉండగా నాకేం భయం!" అన్నాడు ప్రభు.
నీరజ నవ్వేసింది.
డాక్టర్ నారాయణరావుగారు ప్రభుకు ఆపరేషన్ చేశారు. సక్సెస్ అయింది.
నీరజ చేస్తున్న సేవను చూసి లక్ష్మీదేవి మనసులో కోపమంతా పోయింది.
నీలకాంత్ అప్పుడప్పుడు ప్రభును చూడటానికి వస్తూనే వున్నాడు.
నీలకాంత్ రాగానే అదొకవిధంగా మారిపోయే నీరజను చూస్తుంటే ప్రభుకు జాలిగానే ఉంది. ఆ
రహస్యమేదో తనకు చెప్పకుండా ఎందుకు ఉండాలని కష్టంగానూ వుంది.
ఆ రోజు
ఒక యువతి, యువకుడు
వచ్చారు. వాళ్ళతో కలిసి రమణ్ లాల్ తన గదిలోకి వెళ్ళాడు. తనకు ఆలస్యమవుతుందని నీరజ
లోలోపల చికాకు పడింది. పది, పదకొండు
దాటినా రమణ్ లాల్ క్రిందకు రాలేదు. అసహనంగా ఎదురుచూస్తున్న నీరజకు సన్నని మూలుగు
వినిపించింది. ఆ గదిలోకి ఎవ్వరూ రాకూడదని రమణ్ లాల్ ఆర్డర్. ఆ కారణంచేత మూలుగు
వినిపించినా వెళ్ళలేకపోయింది నీరజ... మూలుగు మళ్ళీ వినిపించింది... శక్తినంతా
కూడదీసుకుని ఎవరో గొంతెత్తి పిలుస్తున్నట్లుగా ఉంది. నీరజ ఉపేక్షించి
ఊరుకోలేకపోయింది. సాహసించి పైకి వెళ్ళింది. తలుపులు వేసిఉన్నాయి. కిటికీలోంచి
చూసింది. రమణ్ లాల్ కిందపడి ఉన్నాడు. వాళ్ళిద్దరూ అతనిదగ్గర ఏదో వెతుకుతున్నారు.
గౌను లోపలి జేబులోంచి పిస్టల్ తీసి పిచ్చిగా పేల్చింది. అదాటుగా ఉన్న వాళ్ళిద్దరూ
అదిరిపడ్డారు.
"డర్టీ రోగ్! వాడి జాగ్రత్తలో వాడు ఉన్నాడు..." అంటూ
యువకుడు యువతి చెయ్యిపట్టుకుని మెరుపులా పారిపోయాడు-నీరజ గదిలోకివచ్చి రమణ్ లాల్
ను చూసింది. స్పృహ లేకుండా పడిఉన్నాడు. బలమైన దెబ్బలు తగిలాయి.
అతిప్రయత్నం మీద రమణ్ లాల్ ను సరిగ్గా పడుకోబెట్టింది నీరజ.
దెబ్బలకు కట్లు కట్టింది. ముఖంమీద చన్నీళ్ళు జల్లింది. ఒక్కసారి కళ్ళు తెరచి
నీరసంగా ఏదో గొణిగి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు రమణ్ లాల్.
ఏంచెయ్యాలో తోచక అక్కడే అలాగే కూర్చుండిపోయింది నీరజ.
దాదాపు రెండు గంటల తర్వాత స్పృహ వచ్చింది రమణ్ లాల్ కి. తన ఎదురుగా
కూర్చున్న నీరజను ప్రశ్నార్థకంగా చూసాడు.
"వాళ్ళు వెళ్ళిపోయారు..." అంది నీరజ.
ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకువచ్చింది రమణ్ లాల్ కి. ఒక్క ఉదుటున
లేచికూర్చుని 'స్కౌండ్రల్స్' అన్నాడు పళ్ళు నూరుతూ... తనను
తను నిగ్రహించుకుని ఆశ్చర్యంగా నీరజను చూస్తూ "నువ్వు వాళ్ళను
వెళ్ళగొట్టగలిగావా?" అన్నాడు.
"తప్పు చేసేవాళ్ళకు వాళ్ళ మనసే పెద్ద శత్రువు_పైగా వాళ్ళు ఏవైపునుండీ ఏ ఆపదా
శంకించకుండా ప్రమత్తులై ఉన్నారు. నేను కిటికీలోనుండి పిస్టల్ పేల్చేసరికి
కంగారుపడి పారిపోయారు."
"పిస్టల్! నీదగ్గర పిస్టల్ ఉందా?"
"వయసులోఉన్న ఆడపిల్లను. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని పిస్టల్
ఎప్పుడూ నాదగ్గర ఉంచుకుంటాను."
అకస్మాత్తుగా ఏదో గుర్తుకువచ్చినట్లు రమణ్ లాల్ తన జేబు
తడుముకున్నాడు. పర్స్ తగిలేసరికి వికసించిన ముఖంతో పైకితీసి ఆత్రంగా నోట్లు
లెక్కపెట్టుకున్నాడు. సంతృప్తిగా నిట్టూర్పు విడిచాడు.
పకపక నవ్వింది నీరజ... సిగ్గుపడినట్లు తలవంచుకున్నాడు రమణ్ లాల్.
తన పర్స్ లోంచి కొన్ని నోట్లు తీసి "ఇంద!" అన్నాడు.
"దేనికి?"
"వెయ్యి రూపాయలు!"
"ఎంత? అని
అడగలేదు. 'దేనికి?' అన్నాను."
"ప్రతి మనిషికి ఒక్కొక్క భాష ఉంటుంది. ఏ భావాన్నయినా అతను ఆ
భాషతో మాత్రమే వ్యక్తీకరించగలడు. ఇవాళ నన్ను కాపాడినందుకు నీకు నేను కృతజ్ఞతలు
చెప్పుకోగలిగిన భాష ఇదే!"
అప్పటికీ నీరజ చెయ్యిజాపలేదు.
"నా ప్రాణం విలువ నా దృష్టిలో వెయ్యిరూపాయలేనా అని
ఆశ్చర్యపడుతున్నావా? అది అంతే? బ్రతికి బయటపడ్డానుగా! డబ్బు
తేలిగ్గా వదులుకోలేను. తీసుకో! డబ్బును చులకనగా చూడకు! దానితో చాలా అవసరాలు ఉంటాయి."
ముందు ముందు అవసరాల మాట ఎలా వున్నా, అప్పటికప్పుడు డబ్బు కావలసిన అవసరమే ఉంది నీరజకు__నారాయణరావుగారి ఫీజు చెల్లించాలి... ఆ డబ్బు
తీసుకుంది.
"బాగా పొద్దుబోయింది
పద! నిన్ను మీ ఇంటిదగ్గర దింపి వస్తాను" అన్నాడు రమణ్ లాల్.
రాత్రి
రెండుగంటలకు రమణ్ లాల్ కారులోంచి దిగిన నీరజను పైనుండి క్రిందకు కాల్చేసేలా
చూసింది లక్ష్మీదేవి.
లక్ష్మీదేవికి
సమస్తమూ చెప్పాలనుకునే వచ్చింది నీరజ...కానీ ఆ చూపులతో నీరజ నోరు మూతబడిపోయింది.
ప్రభు మనసుకు
చాలా ఆహ్లాదంగా ఉంది. అతడు ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నాడు కాని లేచి అటూ ఇటూ
తిరుగుతున్నాడు.
ఎక్కడికీ
కదలకుండా ప్రభు దగ్గరే ఉండిపోవాలని ఉంది నీరజకి...కానీ రమణ్ లాల్ ఇంటికి
వెళ్ళవలసిన సమయం దగ్గరపడుతోంది.
"నిన్ను
ఇంకొక్క వారంరోజుల్లో డిశ్చార్జ్ చేస్తానన్నారు డాక్టర్ గారు."
"అవును! ఆ
తరవాత ఇంక గుండెనొప్పి రాదనికూడా అన్నారు...నీరజా! ఒక రహస్యం చెప్పెయ్యనా? నిన్ను మా యింటికి తీసుకురాగానే
పెళ్ళిచేసుకోవాలని అనుకున్నాను కానీ, ఈ
గుండెనొప్పికి భయపడి అందుకు సాహసించలేకపోయాను...ఏమో! ఏది ఎలా జరుగుతుందో?"
"ప్రభూ!..."
ఆశ్చర్యపోయింది నీరజ, రోషంగా అంది.
"ఒకవేళ
గుండెనొప్పి తగ్గలేదనే అనుకుందాం! నేను నిన్ను వదిలి వెళ్ళగలనని అనుకున్నావా?"
"అనుకోలేదు_అందుకనే నా ఆలోచన నీకు చెప్పలేదు."
ఉల్లాసంగా నవ్వాడు ప్రభు.
"ఇప్పుడు మనం
ఇంటికి వెళ్ళగానే పెళ్ళిచేసుకుందాం ... హాయిగా నిశ్చింతగా బ్రతుకుదాం."
అనురాగంతో
ప్రభు జుట్టులోకి చెయ్యి పోనిచ్చి దువ్వింది నీరజ.
నీలకాంత్
సకిలించటంతో నీరజ ఉలిక్కిపడి దూరంగా జరిగింది.
ఆ సమయంలో
నీలకాంత్ రాకకు ప్రభు ఏమంత సంతోషాన్ని కలిగించలేదు.
"హలో!"
అన్నాడు పొడిగా.
"సారీ! రాకూడని
సమయంలో వచ్చినట్లుగా ఉన్నాను-నేను ఇంకొక అరగంటలో బొంబాయి వెళ్తున్నాను ప్రభూ!
పదిరోజులవరకు రాను-అందుకే నిన్ను చూడటానికి వచ్చాను!"
"వెళ్ళిపోతున్నావా?" ఆందోళనగా అన్నాడు ప్రభు.
"అవును, ఏం?"
ప్రభు వెంటనే
సమాధానం చెప్పలేకపోయాడు. అంతకు నాలుగురోజుల క్రిందట ప్రభు డాక్టర్ తో తన ఆరోగ్యం
గురించి మాట్లాడాడు.
"యు ఆర్
ఫర్ఫెక్ట్ లీ ఆల్ రైట్! మీకీ జబ్బు ఇంక జన్మలో రాదు..." అన్నాడు నారాయణరావు.
"బిల్ ఎంతయింది
డాక్టర్?"
"ఆఫీస్ లో
కనుక్కోండి-ఎకౌంట్స్ వేసి ఉంచుతారు."
ఆరోజే ఆఫీస్
లో కనుక్కున్నాడు ప్రభు-వెయ్యి రూపాయలపైన ఉంది... ఇంత డబ్బు నీరజ ఎలా తీర్చగలదు?
మళ్ళీ
నీలకాంత్ నే అడగాలని అనుకున్నాడు-నీరజ ఎదురుగా నీలకాంత్ ను అడగటం ఇష్టంలేదు-కానీ, వ్యవధానం లేదు.
"నీలకాంత్? ఇప్పటికే నీకు చాలా ఋణపడి ఉన్నాను-మరో వెయ్యి అప్పుద్గా
ఇయ్యగలవా? ఇదంతా వీలైనంత త్వరలో తీర్చుకుంటాను."
ఉలిక్కిపడింది
నీరజ-విస్తుపోయి చూశాడు నీలకాంత్.
"నీకు సహాయం
చెయ్యటానికి ఎప్పుడూ సిద్ధమే కానీ, ఎందుకు నీకు
డబ్బు?"
"డాక్టర్ బిల్
ఇయ్యాలి."
"అది నీరజ
ఇచ్చేసిందిగా."
"నీరజ ఇచ్చిందా?"
"పిచ్చివాడా!
నీరజ ఉండగా నీకేం లోటు? నీరజ నీకోసం ఎంత త్యాగమన్నా చెయ్యగలదు ...
తన శరీరాన్ని అమ్ముకుని అయినా నీకు ఖరీదైన హాస్పిటల్స్ లో వైద్యం
చేయించగలదు."
"షటప్!"
నీలకాంత్ చెంప పగిలిపోయేలాగ కొట్టాడు ప్రభు.
అప్పుడే
వచ్చిన లక్ష్మీదేవి ఆశ్చర్యంగా "ప్రభూ?" అంది.
అంత దెబ్బ
తగిలినా నీలకాంత్ కష్టపెట్టుకోలేదు. కోపం తెచ్చుకోలేదు. చిరునవ్వుతోనే ఉన్నాడు.
"సారీ ప్రభూ!
నీకు తెలుసుననే అనుకున్నాను...ఇదివరకు దొంగల చేతుల్లోపడి తరిగివచ్చినా ఎలా
సహించావో...ఇప్పుడు అలాగే అంతా అర్థం చేసుకుని ఊరుకున్నావనుకున్నాను_అయినా అమ్మగారికి అంతా తెలుసునే! నీకు తెలియకుండా
ఎలా ఉంది?" ప్రభు తల్లి
ముఖంలోకి చూశాడు.
ఆనాడు రమణ్
లాల్ కారులోంచి రాత్రి రెండు గంటలకు ఫ్రాక్ తో దిగుతోన్న నీరజ స్వరూపం లక్ష్మీదేవి
కళ్ళముందు కదిలింది. కంపరంతో శరీరం జలదరించగా తల వంచుకుంది.
నీలకాంత్ కనీ
కనిపించకుండా నవ్వాడు.
"ప్రభూ!
టేకిటీజీ! పాపం నీరజ నీకోసమేగా ఇంత చేసింది?... నీ ఆరోగ్యం
కోసం...నువ్వు సుఖపడాలని."
"షటప్!
షటప్!" అరిచాడు ప్రభు.
నీలకాంత్
మాట్లాడలేదు.
నీరజ శిలలా
అలానే కూర్చుంది_ప్రభులో సహనం నశించిపోసాగింది_దెబ్బతిన్న పిట్టలా ఆర్త స్వరంతో "నీరజా!
ఎందుకు చేశావు ఇలాంటి పని?" అన్నాడు.
ఏం సమాధానం
చెప్పాలి? ఏ ప్రాంతాలకు పారిపోయినా ఈ నీలకాంత్ తనను
వదులుతాడా? ఈ శాపం నుండి తనకు విముక్తి లేదు_తెలిసి తెలిసి తనతోపాటు ప్రభును కూడా ఈ
సుడిగుండాలలోకి లాగటం తనకు న్యాయమేనా? అంత స్వార్థమా
తనకు! ప్రభులాంటి అమృతమూర్తికి తను అందించే ప్రేమ విలువ అంతమాత్రమేనా?
నీరజ
మాట్లాడకుండా అలానే కూర్చుంది.
"ఛీ! ఛీ!
ఇంతకంటే నేను గుండెనొప్పితో చచ్చిపోయినా ఆనందించేవాడిని."
నీరజ లేచి
నించుని "వెళ్తాను..." అంది.
"వెళ్ళు! మళ్ళీ
ఎన్నడు ఇక్కడికి...నా దరిదాపులకి తిరిగి రాకు"
నీరజ ముందుకు
కదిలింది.
"వెళ్ళగలుగుతున్నావా?" కోపంగా
అన్నాడు ప్రభు.
నీరజ ఆగి శాంతంగా అంది.
"వెళ్ళగలుగుతున్నాను_ఇంక నీకు ఆ గుండెనొప్పి రాదని
తెలుసుకున్నాను_ ఎక్కడ
ఉన్నా...నువ్వు సుఖంగా_సంతోషంగా...ఉంటావన్న
ధైర్యంతో_ వెళ్ళిపోగలను."
నీరజ గుమ్మం దాటకుండానే వచ్చి అడ్డుగా నిలబడ్డాడు ప్రభు.
"నిన్ను వెళ్ళనివ్వను__నాకు నిజం చెప్పు నీరజా?"
"మాటలలోకి మార్చి చెప్పగలిగినదంతా నిజంకాదు ప్రభూ! అంతకు
మించిన నిజం...మనసుతో అర్థంచేసుకోగలిగినది_వేరే ఉంది...నన్ను వెళ్ళనియ్యి_అదే మన ఇద్దరికీ మంచిది."
ప్రభును తప్పించుకుని వెళ్ళిపోయింది నీరజ.
* *
*
నీరజ తనదగ్గర ఉండిపోవటానికే
వచ్చిందని తెలుసుకుని చాలా సంతోషించాడు రమణ్ లాల్ ... కుంటిపిల్లవాడు ఆనందంతో చప్పట్లు
చరిచాడు... చివరకు వెఱ్ఱిబాగులపిల్లకూడా "నువ్వు ఇక్కడే ఉండిపోతావా?"
అని
వెఱ్ఱిగా నవ్వింది.
కుంటిపిల్లవాడిని వీల్ చైర్ లో కూర్చోబెట్టి సాయంత్రం వేళ అటూ ఇటూ
తిప్పుకుని వస్తుంది నీరజ_ అలాంటి
సమయంలో ఒకనాడు తనను ఎవరో పరిశీలనగా చూస్తున్నట్లు తోచి, తనూ ఆ వ్యక్తిని పరీక్షగా
చూసింది_ తనూ
చూడటం మొదలుపెట్టగానే ఆ యువకుడు అక్కడినుండి వెళ్ళిపోయాడు_ ఎక్కడో బాగా చూసిన ముఖం
అనిపిస్తోంది_ ఎంత
ఆలోచించినా గుర్తుకురాలేదు. ఇంటికి వచ్చాక గుర్తుకు వచ్చింది_ పోలీస్ ఆఫీసర్ మురళి! కలుసుకుని
చాలా రోజులు కావటం వల్ల_మఫ్టీలో ఉండటం
వల్ల...వెంటనే గుర్తుపట్టలేకపోయింది...అయితే మురళి ఇంకా తనను అనుసరిస్తూనే
ఉన్నాడన్నమాట!
రమణ్ లాల్ భార్య ఆరోగ్యం నానాటికీ దిగజారుతూ ఏ క్షణంలో ఏం
జరుగుతుందో అన్నట్లుగా ఉంది.
ఆ రోజు ఆవిడ మరీ మూసిన కన్ను తెరవకుండా పడిఉంది_రమణ్ లాల్ ఎప్పటిలాగే ప్రయాణమయ్యాడు.
"ఇవాళ వెళ్ళకండి! ఆవిడ స్థితి మరీ ప్రమాదకరంగా ఉంది..."
అంది నీరజ.
రమణ్
లాల్ ముఖం చిట్లించుకున్నాడు.
"నేను ఉండిమాత్రం ఏంచెయ్యాలి?"
రమణ్ లాల్ ను తను ఆపుచెయ్యలేనని గ్రహించింది నీరజ.
"పోనీ, మీరిక్కడికి
వెళ్తున్నారో చెప్పండి! అవసరమయితే కబురు చేస్తాను." అంది.
రమణ్ లాల్ కొంచెంసేపు ఆలోచించి చిన్న కాగితంమీద ఫోన్ నంబర్ వేసి
"ఈ నంబర్ రింగ్ చెయ్యి అత్యంత అవసరమయితేనే..." అని వెళ్ళిపోయాడు.
రమణ్ లాల్ భార్య ఊపిరాడక అవస్థపడుతోంది_ప్రాణాలు ఉగ్గబట్టుకుని రోగి
దగ్గరే కూర్చుంది నీరజ.
కాలింగ్ బెల్ మోగింది.
రమణ్ లాల్ వచ్చేశాడా? ఎంతైనా అతనూ ఒక మనిషేగా.
వెళ్ళి తలుపు తీసింది నీరజ_ఎదురుగా మఫ్టీలో మురళి.
"మీరా..." అంది.
"గుర్తుపట్టారన్నమాట!"
కూర్చోమని అనకుండానే కూర్చుంటూ అన్నాడు మురళి, తాపీగా సిగరెట్ వెలిగించుకుంటూ
"కూర్చోండి!" అన్నాడు.
వణుకుతోన్న చేతులను ఒకదానిలో ఒకటి చేర్చి నిబ్బరాన్ని కూడదీసుకుంటూ
కూర్చుంది నీరజ.
"నాతో ఏంపని?"
"పని మీతో కాదు, రమణ్ లాల్ గారితో."
"ఆయన ఇంట్లో లేరు."
"ఎక్కడికి వెళ్ళారు?"
"నాకు తెలియదు!"
"నిజం చెప్పండి!"
"నిజంగా తెలియదు."
"ఆయన భార్య చావు బ్రతుకుల మీద ఉంది. ఇలాంటి
పరిస్థితుల్లో...మీతో కూడా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారా?"
"ఈ సంగతులు మీకెలా తెలుసు?"
"ఏం ప్రశ్న? నేనెవరో మీకు తెలియదా! అన్ని సంగతులూ
తెలుసుకోవటమే నా వృత్తి. చెప్పండి! ఆయన ఎక్కడికి వెళ్ళారు? అత్యవసరంగా కలుసుకోవాలి."
"నిజంగా ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. ఫోన్ నెంబర్ మాత్రమే
ఇచ్చారు ఫోన్ చెయ్యనా?"
ఫోన్ దగ్గరకు నడిచింది నీరజ_ఫోన్ చెయ్యబోతున్న నీరజ చేతిని
గట్టిగా పట్టుకున్నాడు మురళి.
"వద్దు! ఫోన్ చెయ్యకండి. అ నంబర్ ఇయ్యండి చాలు." తన
దగ్గరున్న ఫోన్ నెంబర్ మరొక కాగితంమీద వేసి మురళికి ఇచ్చింది నీరజ.
ఆ కాగితం జేబులో పెట్టుకుని చిరునవ్వుతో వెళ్ళిపోయాడు మురళి.
కొన్ని క్షణాలు అయోమయంగా కూర్చుండిపోయింది నీరజ.
రమణ్ లాల్ కు ఈ విషయం ఫోన్ చెయ్యాలా? వద్దా? తను అతని దగ్గర పనిచేస్తోంది.
ఫోన్ చెయ్యటమే తన కర్తవ్యం.
ఫోన్ చెయ్యబోయింది - ఆర్డర్ లో లేదు_అంతవరకు బాగానే ఉంది!
అకస్మాత్తుగా ఎలా పాడయింది? మురళి
డిస్ కనెక్ట్ చేయించి ఉండాలి!
ఎందుకు? ఏం
జరగబోతోంది?
మరొక్క అరగంటకే రమణ్ లాల్ భార్య కన్ను మూసింది.
మురళి రమణ్ లాల్ ని అతని గ్యాంగ్ తో సహా పట్టుకున్నాడు. నీరజను
కూడా కస్టడీలోకి తీసుకున్నాడు.
వివరాలన్నీ ఆ మరునాటి వార్తాపత్రికలన్నింటిలోనూ వచ్చాయి.
నీరజ గ్యాంగ్ చేతుల్లో పడటమూ, ఏ అపాయమూ జరగకుండా
తప్పించుకోవటమూ-మురళికి విచిత్రంగా తోచింది_ ఆ గ్యాంగ్ లో ఎవరితోనైనా నీరజకు
ఏదో ఒకవిధమైన సంబంధం ఉండవచ్చునని అనుమానం తోచింది_అప్పటినుండీ నీరజను రహస్యంగా
అనుసరిస్తూనే ఉన్నాడు.
నీరజను తన గ్యాంగ్ వాళ్ళు ఎత్తుకుపోయిన సంగతి రమణ్ లాల్ కు
తెలియదు...నీరజ విషయం పేపర్లలో చూశాడు కాని అప్పుడే మరిచిపోయాడు. నీరజ వేషమూ, పేరూ కూడా మార్చుకోవటంతో అసలు
అనుమానించలేదు_ నీలకాంత్
కు తెలిసినా రమణ్ లాల్ కు చెప్పలేదు_చెప్పవలసిన అవసరం అతనికి
తోచలేదు_ నీరజను
అనుసరించే మురళికి అప్రయత్నంగా రమణ్ లాల్ రహస్యాలు తెలియటం మొదలుపెట్టాయి_చివరకు నీరజ ఇచ్చిన ఫోన్ నెంబర్
సహాయంతో అందరినీ పట్టుకోగలిగాడు.
వార్తాపత్రికలన్నీ మురళిని ప్రశంసించాయి_గ్యాంగ్ లో అందరి ఫొటోలూ
పేపర్లలో వచ్చాయి_ నీలకాంత్
ను గ్యాంగ్ లో చూసి జనం నిర్ఘాంతపోయారు_ ఒక ప్రఖ్యాత పురుషుడి కొడుకు
గ్యాంగ్ లో వ్యక్తి!!
*
* *
విచారణలో
అన్ని విషయాలూ బయటపడ్డాయి. నీలకాంత్ ను కావాలనే తన గ్యాంగ్ లో చేర్చుకున్నాడు రమణ్
లాల్! ఒక ప్రముఖ వ్యక్తి కొడుకు తమలో ఒకడు కావటం గ్యాంగ్ కి రక్షణగా ఉంటుందని
అనుకున్నాడు... రమణ్ లాల్ ఆశించినట్లే నీలకాంత్ కారణంగానే గ్యాంగ్ మొత్తం ఒకటి
రెండుసార్లు ఆపదలలోంచి తప్పుకుంది_తరువాత తండ్రి నీలకాంత్ ను చాలా
కఠినంగా మందలించాడు_కానీ
నీలకాంత్ చెవిన పెట్టలేదు. చదువు సంధ్యలు అబ్బని అతనికి ఆ జీవితం ఎంతో నచ్చింది.
నీరజ తనను చెంపమీద కొట్టి అవమానించి వెళ్ళిపోగానే ఎలాగైనా నీరజ పైన
ప్రతీకారం సాధించాలని నిశ్చయించుకున్నాడు...వల్లమాలిన కండకావరంతో నీలకాంత్
తనవాళ్ళను పంపి పట్టపగలు నీరజను బలాత్కారంగా తన దగ్గరకు రప్పించుకున్నాడు.
నీరజ అదృష్టంకొద్దీ సరిగ్గా ఆ సమయానికి బాలూ కూడా అక్కడికి
వచ్చాడు...నిలువెల్లా వణికిపోతూ కన్నీళ్ళతో నిస్సహాయంగా ఉన్న నీరజను చూశాడు. విషయం
తెలుసుకున్నాడు.
"ఈ అమ్మాయిని వదిలెయ్యండి..." అన్నాడు
ఆజ్ఞాపిస్తున్నట్లుగా.
"వీల్లేదు." అన్నాడు నీలకాంత్...గ్యాంగ్ ఒకరిముఖాలు ఒకరు
చూసుకున్నారు_ నీలకాంత్
హోదానుబట్టి అతనంటే అందరికీ భయ గౌరవాలున్నాయి. కానీ బాలూ అంటే
భక్తి...ప్రేమ...ఆరాధన.
ఎవరికి కాలులో ముల్లుగుచ్చుకున్నా ప్రాణాలొడ్డి తీసేవాడు బాలూ.
ఎవరు ఆపదలో చిక్కుకున్నా ఎంతకైనా సాహసించి విడిపించేవాడు బాలూ! నీ, నా, భేదం లేకుండా అందరినీ
అన్నివేళలా ఆదుకునేవాడు బాలూ! ఆ కారణంచేత ఎవరూ బాలూ మాట కాదనరు.
నీలకాంత్ విషయం అర్థంచేసుకున్నాడు.
"బాలూ! జరిగిందేదో జరిగింది ఈ విషయంలో ఇంక నువ్వు
కలిగించుకోకు." అన్నాడు.
"ఒక అమాయకురాలి బ్రతుకు నాశనం చేస్తానంటావా? నన్ను కల్పించుకో వద్దంటావా?"
"నేను ఆ అమ్మాయి బ్రతుకు నాశనం చెయ్యను.
పెళ్ళిచేసుకుంటాను."
"ఉద్ధరించావు! ఆ అమ్మాయికి ఇష్టంలేకపోయినా పెళ్ళిచేసుకోవటం ఆ
బ్రతుకు మరింత నాశనం చెయ్యడం కాదా? ఇదంతా జరగనివ్వను."
బాలూ పట్టుదల నీలకాంత్ కు తెలుసు. గ్యాంగ్ లో అతనికున్న విలువా
తెలుసు. అన్నింటినీ మించి ఇది రమణ్ లాల్ కు తెలియకుండా జరిపించిన వ్యవహారం.
"ఒక్క విషయం ఆలోచించు. ఇప్పుడు నీరజకు మన రహస్యం తెలిసిపోయింది. మనం వదిలిపెడితే
బండారం బయటపెట్టదూ."
బాలూ ఆలోచనలో పడ్డాడు.
"అవును అదీ నిజమే?" అన్నాడు.
బాలూ వచ్చి తనను విడిపించమని అన్నదగ్గరనుంచి చచ్చిపోయిన ఆశలకు
ఊపిరి పోసుకుంటున్న నీరజ ఈ మాటలతో హడలిపోయింది.
"లేదు, లేదు!
నేను మీ రహస్యాలేవీ బయటపెట్టను" అంది ధీనంగా.
"ఇంకేం నీలకాంత్! వాగ్దానం చేస్తోందిగా!" అన్నాడు బాలూ.
"నాన్సెన్స్? ఇలాంటి వాగ్దానాలు నేను నమ్మను.
ఇక్కడినుండి బయటపడ్డాక ఈ వాగ్దానం నిలబెట్టుకుంటుందని నమ్మకమేమిటి?"
"మనం మనుష్యుల్ని నమ్మాలి నీలకాంత్!"
"ఓహో! ఏం శ్రీరంగనీతులు! నీనోట రావటం, నేను వినటం! భలే!..."
"పోనీలే నమ్మకు. అయినా ఈవిడ మన రహస్యం చెప్పదు. అలా చెబితే ఆ
మరుక్షణం మళ్ళీ నువ్వు ఈవిడను తెప్పించుకోవచ్చు...అప్పుడు నేను అడ్డురాను..."
"తీరా చెప్పేశాక ఏంచెయ్యగలం?"
"అమాయకంగా మాట్లాడకు! నీమీద నేరం ఆరోపించి రుజువుచెయ్యటం
నీరజలాంటి సామాన్యురాలికి సాధ్యంకాదు. ఈలోగా ఆవిడ బ్రతుకు సర్వనాశనమయిపోతుంది. అంత
తెలివితక్కువగా ఆవిడ ప్రవర్తించదు. కానీ ఈలోగా ఈవిడమీద నువ్వు ఏదైనా అత్యాచారం
చెయ్యడానికి సాహసిస్తే నన్ను మొదటిసారిగా హంతకుణ్ని చేసిన ఘనత దక్కించుకుంటావు.
జాగ్రత్త..."
నీలకాంత్ రక్తం చల్లబడినట్లు అయింది. బాలూ అన్నంతపనీ చేస్తాడని
అతనికి తెలుసు.
బాలూ స్వయంగా నీరజను విడిపించి ఇంటికి పంపించాడు.
నీలకాంత్ రహస్యం చచ్చినట్లు తనలోనే ఇముడ్చుకోవలసి వచ్చింది. నీరజ
ఇది ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటూ ఎప్పటికప్పుడే నీరజను చిత్రవధ చెయ్యటానికి ప్రయత్నిస్తూనే
ఉన్నాడు నీలకాంత్.
బాలూ మీదకూడా నీలకాంత్ పగబట్టాడు. కానీ బాలూను అతను ఏమీ చెయ్యలేడు.
అటు రమణ్ లాల్ కూ ఇటు గ్యాంగ్ కూ బాలూ గుండెకాయ.
సుశీలకు అతి ప్రయత్నంమీద గర్భం నిలిచిందేకాని ఆరోగ్యం పాడయింది.
అదివరలో ఆవిడ తిన్న మందులూ, చేయించుకున్న
ఒకటి రెండు ఆపరేషన్లూ ఆవిడ ఆరోగ్యాన్ని బాగా కృంగదీసాయి.
ఒక మగపిల్లవాణ్ని కని మరణించింది.
చివరి క్షణాలలో సుశీల దగ్గరే ఉన్నాడు బాలూ.
"ఇదీ? చివరికి
నువ్వు సాధించింది..." అన్నాడు నిష్ఠూరంగా.
"ఏం నా బ్రతుకులో నేను సాధించింది చాలా అమూల్యమైనదే! నా చివరి
క్షణాలలో నాకోసం కన్నీళ్ళు కారుస్తూ నా అనేవాళ్ళు నా దగ్గర ఉన్నారు. ఏ వేశ్యకు
పడుతుంది ఇలాంటి అదృష్టం. ఆమాటకొస్తే ఎంతమంది గృహిణులు ఇలాంటి ప్రేమను
అనుభవించగలరు? నాకు ఏ
దిగులూ, ఏ
విచారమూ, ఎలాంటి
పశ్చాత్తాపమూలేదు. చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉంది. బాబు గురించి
కూడా నాకు దిగులులేదు. వాడు మీ కొడుకు. మీ మంచితనం వాడిని కాపాడుతుంది..."
"వద్దు సుశీలా! ఆ మాట
అనకు..." ఆ సమయంలో కూడా 'మంచి' మాట విని సహించలేక అడ్డుతగిలాడు
బాలూ.
సుశీల పెంకెగా తల అడ్డంగా తిప్పుతూ "మీరు మంచివారు. ఆ మంచితనం
కాపాడుతుంది. తప్పకుండా కాపాడుతుంది." అంటూ బాలూ చేతిని ఆప్యాయంగా
చెక్కిలికానించుకుని కళ్లు మూసింది.
తల్లిపోయినప్పుడు కూడా కన్నీళ్లు కార్చని బాలూ కుమిలికుమిలి
ఏడ్చాడు. అతనినుండి ఏదో శక్తి దూరమయినట్లు అనిపించింది.
కళ్ళు తెరవని పసిగుడ్డు-సుశీల అప్పగించిన యాభైవేల రూపాయలు బాలూకు
మిగిలాయి.
బాలూను సాధించటానికి నీలకాంత్ కు మంచి ఉపాయం దొరికింది. ఆ శిశువును
స్వాధీనం చేసుకుని బాలూను లొంగదీసుకోవాలని అనుకున్నాడు. ఇలాంటి విషయాల్లో రమణ్
లాల్ కల్పించుకోడు. ఒకసారి ఆ శిశువును తీసుకుపోవటానికి ప్రయత్నించాడు. సమయానికి
బాలూ అడ్డుకుని కాపాడుకున్నాడు. రాజేశ్వరికి సుశీల సంతానంమీద ఏం శ్రద్ధ? జరిగిన గొడవలతో చికాకుపడి ఆ
శిశువును వదిలించుకోవాలనే ఆవిడ చూస్తోంది. బాలూకు భయపడి ఏమీ అనలేకపోతోంది.
బాలూ విషయం అర్థంచేసుకున్నాడు. రాజేశ్వరి రక్షణలో తన బాబును ఉంచటం
ఇష్టంలేకపోయింది. అతనికాసమయంలో నీరజ గుర్తుకు వచ్చింది. రాత్రివేళ రహస్యంగా నీరజను
కలుసుకున్నాడు.
"ఈ బాబు నా కొడుకు! వేడిని కాన్వెంట్ లో అప్పగించండి! అనాథ
అని చెప్పండి! వీడికోసం వీళ్ళ అమ్మ యాభైవేల రూపాయలు ఇచ్చింది. అవి ప్రస్తుతం మీపేర
బ్యాంక్ లో వేసాను. వాడికోసం ఖర్చుపెట్టి వాడు ప్రయోజకుడు అయ్యేలాగ చూడండి."
"ఎంత నమ్మకం నామీద మీకు! ఈ డబ్బు ఒకవేళ నేను
వాడుకుంటే..."
"మీ యిష్టం! ఒక దీనురాలు తన సర్వస్వమూ కరిగించి కొడుకుకోసం
దాచిన డబ్బు అది! నేను చెయ్యగలిగినది నేను చేస్తున్నాను. మీరు చెయ్యాలనుకున్నది
మీరు చెయ్యండి..."
బాలూ తనకు చేసిన మహోపకారం నీరజ మరిచిపోలేదు. అతడు తనను అంత చిన్న
సహాయం కోరుతుంటే కాదనలేకపోయింది. ఆ రాత్రివేళ అప్పటికప్పుడే బాలూ కొడుకును
కాన్వెంట్ లో చేర్చింది.
నీలకాంత్ బాలూ ఏంచేసాడో తెలుసుకున్నాడు. బాలూను, నీరజను ఏ విధంగానూ సాధించలేక
నీరజను అవమానించి పగతీర్చుకున్నాడు.
శేఠ్ రమణ్ లాల్ ఆస్తి, ఇంకా గ్యాంగ్ లో అందరి
ఆస్తిపాస్తులూ ప్రభుత్వం స్వాధీనపరచుకుంది. ఒక్క బాలూకే సొంత ఆస్తి ఏమీలేదు.
విచారణలో అతడు ఎన్నెన్ని సంస్థలకు సహాయపడ్డాడో అతనికి ఇష్టంలేకపోయినా బయటపడింది.
నాలుగు మూలలనుండీ "బాలూ చాలా మంచివాడు. అతడిని
వదిలిపెట్టండి" అంటూ అభ్యర్థనలు కుప్పలుతిప్పలుగా వచ్చాయి.
కానీ, ఆ
అభ్యర్థనలకు బాలూయే ఒప్పుకోలేదు.
"నేను చేసిన నేరాలకూ, ఇతరులకు చేసిన సహాయాలకూ ఏ
విధమయిన సంబంధమూ లేదు. ఈ గ్యాంగ్ తో మిగిలినవాళ్ళతో పాటుగానే నాకూ శిక్ష
విధించండి!" అన్నాడు.
జడ్జి ఆశ్చర్యంగా బాలూను చూసి అప్రయత్నంగా "నువ్వు
మంచివాడివి" అన్నాడు.
బాలూ కసిగా పిడికిలి గట్టిగా బిగించి "డేమ్" అన్నాడు
కసిగా.
నీరజను విడుదల చేశారు.
కోర్టు బయట తనకోసం ఎదురుచూస్తున్న లక్ష్మీదేవిని చూసి
ఆశ్చర్యపోయింది నీరజ. ప్రభుకోసం చూసింది కనపడలేదు.
"నేను నిర్దోషినని తెలిసి వచ్చావా అత్తయ్యా!" అంది
నిష్ఠూరంగా.
"లేదమ్మా! నువ్వు ఇక్కడ ఉంటావనే తెలిసి వచ్చాను. నువ్వు ఎక్కడ
ఉంటావో, నిన్ను
ఎలాగ కలుసుకోవాలో తెలిస్తే ఎప్పుడో వచ్చేదానిని..."
లక్ష్మీదేవి మాట్లాడే ధోరణికి నీరజ భయపడింది.
"ఏం జరిగింది అత్తయ్యా!" అంది.
"నీకు పుణ్యం ఉంటుంది. వెంటనే రా. చేతులు జోడించి
ప్రార్థిస్తున్నాను. నా ప్రభును నాకు దక్కించు..."
నీరజ ఇంక ఏ ప్రశ్నలూ వెయ్యలేదు. లక్ష్మీదేవితో బయలుదేరింది.
"అదిగో ఎప్పుడూ ఆ గదిలో తలుపులు వేసుకుని కూర్చుంటాడు. అప్పు
తీర్చాలని ఆఫీసుకు మాత్రం వెళతాడు. ఎవరితోనూ మాట్లాడడు." బాధపడుతూ అంది
లక్ష్మీదేవి.
నీరజ తలుపు తట్టింది.
"ఎవరు?"
అన్నాడు
ప్రభు తలుపు తీయకుండానే.
"నేను!" కంపిస్తోన్న గొంతుకతో అంది నీరజ.
వెంటనే తలుపులు తెరుచుకున్నాయి.
కొద్దిరోజులలోనే గుర్తుపట్టరానంత మారిపోయిన ప్రభును చూసి నీరజ
కళ్ళు చెమ్మగిల్లాయి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ బొమ్మల్లా నిలబడిపోయారు.
"నిన్ను నా దగ్గరినుంచి పొమ్మన్నాను. మళ్ళీ ఎందుకొచ్చావ్?"
"ఇప్పటికీ నీ మనసులోంచి పొమ్మనలేక పోయావని తెలుసుకుని
వచ్చాను..."
"ఒక్క నిజం విని వెళ్ళిపో! నువ్వు శీలం పోగొట్టుకున్నావని నా
బాధ కాదు. నా ఆరోగ్యంకోసం, అనవసరంగా
అంత త్యాగం ఎందుకు చెయ్యాలని..."
"ఒక్క నిజం చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు నిజం చెప్తే
నమ్మలేవని కాదు. అనేక గొడవల మధ్య ఇరుక్కుపోయిన నాతో నిన్నుకూడా చిక్కుల్లోకి
దింపటం ఇష్టంలేక..."
నీరజ పోయేదానిలా వెనక్కు తిరిగింది.
ప్రభు "నీరజా!" అని పిలిచాడు. నీరజ గిర్రున తిరిగి
చిరునవ్వు నవ్వింది.
ప్రభు చేతులు జాపాడు.
నీరజ అతని హృదయంమీద వాలిపోయింది.
* సమాప్తం *
----మనోజ్





Comments
Post a Comment